ఆది 43

43
రెండవసారి ఈజిప్టుకు ప్రయాణం
1దేశంలో కరువు ఇంకా తీవ్రంగా ఉంది. 2ఈజిప్టు నుండి తెచ్చుకున్న ధాన్యమంతా వారు తిన్న తర్వాత, వారి తండ్రి వారితో, “మీరు తిరిగివెళ్లి మన కోసం ఇంకా కొంచెం ఆహారం కొనండి” అని అన్నాడు.
3కానీ యూదా అతనితో, “ఆ మనుష్యుడు, ‘మీ తమ్ముడు మీతో ఉండే వరకు నన్ను మీరు మళ్ళీ చూడరు’ అని గట్టిగా హెచ్చరించాడు. 4ఒకవేళ మా తమ్మున్ని మాతో పంపితే, మేము వెళ్లి నీకు ఆహారం కొంటాము. 5కానీ ఒకవేళ అతన్ని పంపకపోతే, మేము వెళ్లం ఎందుకంటే, ‘మీ తమ్ముడు మీతో ఉండకపోతే మీరు నన్ను మళ్ళీ చూడరు’ అని ఆ మనుష్యుడు అన్నాడు” అని చెప్పాడు.
6“మీకు ఇంకొక సోదరుడున్నాడని చెప్పి ఎందుకు ఈ శ్రమ నాకు తెచ్చి పెట్టారు?” అని ఇశ్రాయేలు అడిగాడు.
7వారు, “ఆయన మమ్మల్ని ఖండితంగా ప్రశ్నించాడు. ‘మీ తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా? మీకు ఇంకొక సోదరుడు ఉన్నాడా?’ అని అడిగాడు. మేము అతని ప్రశ్నలకు జవాబిచ్చాం అంతే. ‘మీ తమ్మున్ని ఇక్కడకు తీసుకురండి’ అని అంటాడని మాకు ఎలా తెలుస్తుంది?” అని అన్నారు.
8అప్పుడు యూదా తన తండ్రి ఇశ్రాయేలుతో, “బాలున్ని నాతో పంపించు, మేము వెంటనే వెళ్తాము. అప్పుడు మేము నీవు మా పిల్లలు చావకుండ బ్రతుకుతాము. 9నేను అతని భద్రతకు హామీ ఇస్తున్నాను; అతని కోసం నన్ను బాధ్యున్ని చేయవచ్చు. నేను అతన్ని నీ దగ్గరకు తిరిగి తీసుకువచ్చి నీ ఎదుట ఉంచకపోతే, నా జీవితం అంతా ఆ నిందను భరిస్తాను. 10ఇలా ఆలస్యం కాకపోయి ఉంటే, రెండవసారి కూడా వెళ్లి వచ్చియుండేవారం” అని అన్నాడు.
11అప్పుడు వారి తండ్రి ఇశ్రాయేలు అన్నాడు, “ఒకవేళ అలాగైతే, ఇలా చేయండి: దేశంలో ఉన్న శ్రేష్ఠమైన వాటిని అంటే ఔషధతైలం, కొంచెం తేనె, కొన్ని సుగంధద్రవ్యాలు, బోళం, పిస్తా గింజలు, బాదం పప్పులు మీ సంచుల్లో పెట్టుకుని ఆ వ్యక్తికి కానుకగా తీసుకెళ్లండి. 12మీ దగ్గర ఉన్న వెండికి రెట్టింపు తీసుకెళ్లండి, ఎందుకంటే మీ గోనెసంచులలో పెట్టబడిన వెండిని మీరు తిరిగి ఇచ్చేయాలి. బహుశ అది పొరపాటు కావచ్చు. 13మీ సోదరున్ని కూడా తీసుకుని వెంటనే ఆ మనుష్యుని దగ్గరకు తిరిగి వెళ్లండి. 14సర్వశక్తిగల దేవుడు#43:14 హెబ్రీలో ఎల్-షద్దాయ్ ఆ మనుష్యుని ఎదుట కరుణ చూపును గాక తద్వారా మీ ఇంకొక సోదరుడు బెన్యామీను మీతో తిరిగి వచ్చేలా అనుమతిస్తాడు. నా మట్టుకైతే, ఒకవేళ నేను కోల్పోవలసి వస్తే కోల్పోతాను.”
15కాబట్టి ఆ మనుష్యులు కానుకలను, రెట్టింపు డబ్బును, బెన్యామీనును కూడా తీసుకుని త్వరగా ఈజిప్టుకు వెళ్లి యోసేపు ఎదుట హాజరయ్యారు. 16యోసేపు వారితో బెన్యామీనును చూసి తన గృహనిర్వాహకునితో, “ఈ మనుష్యులను నా ఇంటికి తీసుకెళ్లి, ఒక జంతువును వధించి, భోజనం సిద్ధం చేయి; వారు మధ్యాహ్నం నాతో భోజనం చేస్తారు” అని చెప్పాడు.
17ఆ మనుష్యుడు యోసేపు చెప్పినట్టు చేశాడు, వారిని యోసేపు ఇంటికి తీసుకెళ్లాడు. 18యోసేపు వారిని తన ఇంటికి తీసుకెళ్లినందుకు ఆ మనుష్యులు భయపడ్డారు. “మొదటిసారి మన గోనెసంచులలో పెట్టబడిన వెండి గురించి మనం ఇక్కడకు రావలసివచ్చింది. అతడు మనపై దాడి చేసి, మనలను బానిసలుగా బంధించి మన గాడిదలను తీసుకుంటాడు” అని అనుకున్నారు.
19కాబట్టి వారు యోసేపు యొక్క గృహనిర్వాహకుని దగ్గరకు వెళ్లి ద్వారం దగ్గర అతనితో మాట్లాడారు. 20“అయ్యా, మా మనవి వినండి. మేము మొదటిసారి ఆహారం కొనడానికే వచ్చాము. 21కానీ మేము రాత్రి గడిపిన స్థలంలో మా గోనెసంచులను విప్పి చూస్తే, ఎవరు ఎంత వెండి తెచ్చారో సరిగ్గా అంతే వెండి వారి గోనెసంచిలో ఉంది. కాబట్టి మేము తిరిగి దానిని తెచ్చాము. 22ఆహారం కొనడానికి మరికొంత వెండిని కూడా తీసుకుని వచ్చాము. మా గోనెసంచులలో వెండిని ఎవరు పెట్టారో మాకు తెలియదు” అన్నారు.
23అప్పుడు అతడు, “మీకు క్షేమం కలుగును గాక మీరు భయపడకండి, మీ దేవుడు, మీ తండ్రి యొక్క దేవుడు, ఈ ధనాన్ని మీ గోనెసంచులలో పెట్టారు; మీ వెండి నాకు ముట్టింది” అని అన్నాడు. తర్వాత షిమ్యోనును వారి దగ్గరకు తీసుకువచ్చాడు.
24గృహనిర్వాహకుడు ఆ మనుష్యులను యోసేపు ఇంట్లోకి తీసుకెళ్లాడు, కాళ్లు కడుక్కోడానికి వారికి నీళ్లిచ్చాడు, వారి గాడిదలకు మేత పెట్టాడు. 25తాము భోజనం చేయాల్సింది అక్కడే అని విన్నందుకు మధ్యాహ్నం యోసేపు రాక కోసం తమ కానుకలను సిద్ధపరచుకున్నారు.
26యోసేపు ఇంటికి రాగానే, వారు ఇంట్లోకి తెచ్చిన కానుకలను అతనికి ఇచ్చి, అతని ఎదుట సాష్టాంగపడ్డారు. 27వారు ఎలా ఉన్నారని వారిని అడిగి, “వృద్ధుడైన మీ తండ్రి గురించి మీరు నాకు చెప్పారు కదా, ఆయన ఎలా ఉన్నారు? ఇంకా బ్రతికే ఉన్నారా?” అని అన్నాడు.
28వారు జవాబిస్తూ, “తమ దాసుడు, మా తండ్రి బ్రతికే ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు” అన్నారు, అప్పుడు వారు తలవంచి, సాష్టాంగపడ్డారు.
29యోసేపు కళ్ళెత్తి తన తమ్ముడు అనగా తన సొంత తల్లి కుమారుడైన బెన్యామీనును చూసి, “మీరు నాకు చెప్పిన మీ చిన్న తమ్ముడు ఇతడేనా?” అని అడిగి, “నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించును గాక!” అని అన్నాడు. 30తమ్మున్ని చూడగానే యోసేపుకు అతని మీద ప్రేమ పొర్లుకు వచ్చింది, అందుకు అతడు వెంటనే లోపలి గదిలోకి వెళ్లి ఏడ్చాడు.
31తన ముఖం కడుక్కున్న తర్వాత, తనను తాను అదుపుచేసుకుని, “భోజనం వడ్డించండి” అని చెప్పాడు.
32సేవకులు యోసేపుకు తన బల్ల దగ్గర, అతని సోదరులకు వేరే బల్ల దగ్గర, అతనితో భోజనంచేస్తున్న ఈజిప్టువారికి వరుసగా భోజనం వడ్డించారు, ఎందుకంటే హెబ్రీయులతో కలసి భోజనం చేయడం ఈజిప్టువారికి అసహ్యము. 33వారి వయస్సు ప్రకారం మొదటివాడు మొదలుకొని చివరివాని వరకు అతని ఎదుట కూర్చున్నారు; వారు ఆశ్చర్యంతో ఒకరినొకరు చూసుకున్నారు. 34యోసేపు బల్ల నుండి వారికి భోజనం వడ్డించబడినప్పుడు, ఇతరులకంటే అయిదు రెట్లు ఎక్కువగా బెన్యామీనుకు వడ్డించారు. కాబట్టి వారు అతనితో స్వేచ్ఛగా విందు చేసుకున్నారు, త్రాగారు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

ఆది 43: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి

ఆది 43 కోసం వీడియో