అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు వంశావళి. అబ్రాహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు పద్దనరాములోని సిరియావాడైన బెతూయేలు కుమార్తె, లాబాను సోదరియైన రిబ్కాను పెళ్ళి చేసుకున్నప్పుడు అతని వయస్సు నలభై సంవత్సరాలు. రిబ్కాకు సంతానం కలుగలేదు కాబట్టి ఇస్సాకు ఆమె గురించి యెహోవాకు ప్రార్థన చేశాడు, యెహోవా అతని ప్రార్థనకు జవాబిచ్చారు, అతని భార్య రిబ్కా గర్భవతి అయ్యింది. ఆమె గర్భంలో పిల్లలు ఒకరితో ఒకరు పెనుగులాడారు, అందుకు ఆమె, “నాకెందుకు ఇలా జరుగుతుంది?” అని అంటూ యెహోవాను అడగడానికి వెళ్లింది. యెహోవా ఆమెతో ఇలా చెప్పారు, “నీ గర్భంలో రెండు జనాంగాలు ఉన్నాయి, ఈ రెండు జనాంగాలు నీ గర్భం నుండే వేరుగా ఉంటాయి; ఒక జనం మరొక జనం కంటే బలంగా ఉంటారు. పెద్దవాడు చిన్నవానికి సేవ చేస్తాడు.” ఆమె ప్రసవ కాలం సమీపించినప్పుడు, ఆమె గర్భంలో కవలపిల్లలు ఉన్నారు. మొదట పుట్టినవాడు ఎర్రగా ఉన్నాడు, అతని శరీరమంతా రోమాల వస్త్రంలా ఉంది; కాబట్టి అతనికి ఏశావు అని పేరు పెట్టారు. తర్వాత అతని సోదరుడు, అతని మడిమెను పట్టుకుని బయటకు వచ్చాడు, అతనికి యాకోబు అని పేరు పెట్టారు. రిబ్కా వారికి జన్మనిచ్చినప్పుడు ఇస్సాకు వయస్సు అరవై సంవత్సరాలు. అబ్బాయిలు పెరిగారు, ఏశావు అరణ్యంలో తిరుగుతూ నేర్పుగల వేటగాడయ్యాడు. యాకోబు నెమ్మదస్థుడై గుడారాల్లో నివసించేవాడు. ఇస్సాకు వేటాడిన మాంసం కోరుకునేవాడు, అతడు ఏశావును ప్రేమించేవాడు, కానీ రిబ్కా యాకోబును ప్రేమించేది. ఒక రోజు యాకోబు వంటకం చేస్తున్నపుడు, ఏశావు పొలం నుండి బాగా ఆకలితో వచ్చి, “నేను చాలా ఆకలితో ఉన్నాను, నీవు వండుచున్న ఆ ఎర్రని కూర కొంచెం నాకు పెట్టు!” అని అడిగాడు, (అందుకే అతనికి ఎదోము అని పేరు వచ్చింది.) యాకోబు, “అలా అయితే మొదట నీ జ్యేష్ఠత్వపు హక్కు నాకు అమ్ము” అని అన్నాడు. అప్పుడు ఏశావు, “నేను ఆకలితో చస్తూ ఉంటే నాకు జ్యేష్ఠత్వం దేనికి ఉపయోగం?” అని అన్నాడు. అయితే యాకోబు, “ముందు నాకు ప్రమాణం చేయి” అన్నాడు. కాబట్టి ఏశావు తన జ్యేష్ఠత్వపు హక్కును యాకోబుకు అమ్మివేస్తున్నట్టుగా ప్రమాణం చేశాడు. అప్పుడు యాకోబు కొంత రొట్టె, కొంత కాయధాన్యం వంటకం ఏశావుకు ఇచ్చాడు. అతడు తిని త్రాగి లేచి వెళ్లిపోయాడు. ఈ విధంగా ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు.
Read ఆది 25
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: ఆది 25:19-34
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు