ఆది 24:52-67

ఆది 24:52-67 OTSA

అబ్రాహాము సేవకుడు ఈ మాటలు విని, యెహోవా ఎదుట నేల మీద సాష్టాంగపడ్డాడు. తర్వాత ఆ వ్యక్తి వెండి, బంగారు నగలు, వస్త్రాలు రిబ్కాకు ఇచ్చాడు; అతడు ఆమె సోదరునికి, ఆమె తల్లికి కూడా విలువైన కానుకలిచ్చాడు. అప్పుడు అతడు, అతని మనుష్యులు భోజనం చేసి ఆ రాత్రి అక్కడే గడిపారు. మర్నాడు ఉదయం వారు లేచినప్పుడు, అతడు, “నా దారిన నన్ను నా యజమాని దగ్గరకు పంపివేయండి” అని అన్నాడు. అయితే ఆమె తల్లి సోదరుడు, “యువతిని కనీసం పదిరోజులైనా మా దగ్గర ఉండనివ్వండి, ఆ తర్వాత ఆమె వెళ్లిపోవచ్చు” అని అన్నారు. కాని అతడు, “యెహోవా నా ప్రయాణం సఫలం చేశారు, కాబట్టి ఆలస్యం చేయకుండా నన్ను పంపివేయండి, నా యజమాని దగ్గరకు నేను వెళ్తాను” అన్నాడు. అప్పుడు వారు, “యువతిని పిలిచి ఆమె ఏమంటుందో అడుగుదాం” అని అన్నారు. కాబట్టి వారు రిబ్కాను పిలిచి, “ఇతనితో నీవు వెళ్తావా?” అని అడిగారు. అందుకు ఆమె, “నేను వెళ్తాను” అని జవాబిచ్చింది. కాబట్టి వారు తమ సోదరి రిబ్కాను, ఆమెకు తోడుగా దాదిని, అబ్రాహాము సేవకుని, అతనితో వచ్చిన మనుష్యులను పంపివేశారు. వారు రిబ్కాను దీవించి ఆమెతో ఇలా అన్నారు, “మా సోదరీ, నీవు వర్ధిల్లాలి, వేవేల మందికి తల్లివి కావాలి; నీ సంతానపు వారు తమ శత్రువుల పట్టణాలను స్వాధీనం చేసుకోవాలి.” అప్పుడు రిబ్కా, ఆమె పరిచారకులు సిద్ధపడి, ఒంటెలు ఎక్కి ఆ మనుష్యునితో పాటు వెళ్లారు. అలా ఆ సేవకుడు రిబ్కాను తీసుకుని వెళ్లాడు. ఇప్పుడు ఇస్సాకు బెయేర్-లహాయి-రోయి నుండి వచ్చాడు, ఎందుకంటే అతడు దక్షిణాదిలో నివాసముంటున్నాడు. ఒక రోజు సాయంకాలం అతడు ధ్యానం చేసుకోవడానికి పొలానికి వెళ్లాడు; ఆ సమయంలో ఇస్సాకు తేరిచూడగా, అతనికి ఒంటెలు వస్తున్నట్లు కనిపించాయి. రిబ్కా తలెత్తి ఇస్సాకును చూసి, ఒంటె మీది నుండి క్రిందికి దిగి, “మనలను కలవడానికి పొలంలో నుండి వస్తున్న అతడు ఎవరు?” అని ఆ సేవకుని అడిగింది. అందుకతడు, “అతడే నా యజమాని” అని అన్నాడు. ఆమె తన తలమీద ముసుగు వేసుకుంది. ఆ సేవకుడు జరిగినదంతా ఇస్సాకుకు చెప్పాడు. ఇస్సాకు తన తల్లియైన శారా గుడారం లోనికి ఆమెను తీసుకెళ్లి, ఆమెను పెళ్ళి చేసుకున్నాడు. ఇలా రిబ్కా అతని భార్య అయ్యింది. అతడు ఆమెను ప్రేమించాడు; ఇలా తల్లి మరణం చేత బాధతో ఉన్న ఇస్సాకుకు రిబ్కా ద్వార ఓదార్పు కలిగింది.

చదువండి ఆది 24

ఆది 24:52-67 కోసం వీడియో