ఆది 24:1-16

ఆది 24:1-16 OTSA

అబ్రాహాము చాలా వృద్ధుడయ్యాడు, యెహోవా అతన్ని అన్ని విధాలుగా ఆశీర్వదించారు. అబ్రాహాము తన ఇంట్లో గృహనిర్వాహకుడైన ముఖ్య సేవకునితో, “నీ చేయి నా తొడ క్రింద పెట్టు. నేను ఎవరి మధ్య నివసిస్తున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో నుండి నా కుమారునికి భార్యను తీసుకురావని, నా దేశం, నా బంధువుల దగ్గరకు వెళ్లి వారిలో నుండి నా కుమారుడైన ఇస్సాకుకు భార్యను తీసుకువస్తావని భూమ్యాకాశాలకు దేవుడైన యెహోవా పేరిట ప్రమాణం చేయి” అని అన్నాడు. అందుకు ఆ సేవకుడు, “ఒకవేళ ఆ స్త్రీ ఈ దేశానికి రావడానికి ఇష్టపడకపోతే ఏం చేయాలి? నీవు వచ్చిన ఆ దేశానికి నీ కుమారున్ని తీసుకెళ్లాలా?” అని అతన్ని అడిగాడు. అబ్రాహాము, “ఖచ్చితంగా నా కుమారున్ని అక్కడికి తీసుకెళ్లకూడదు. నా తండ్రి ఇంటి నుండి, నా స్వదేశం నుండి బయటకు తీసుకువచ్చి, ‘నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తాను’ అని వాగ్దానం చేసిన పరలోక దేవుడైన యెహోవాయే నా కుమారునికి భార్యను అక్కడినుండి తీసుకువచ్చేలా తన దూతను నీకు ముందుగా పంపుతారు. ఒకవేళ ఆ స్త్రీ నీ వెంట రావడానికి ఇష్టపడకపోతే ఈ ప్రమాణం నుండి నీవు నిర్దోషివి, కాని నా కుమారున్ని మాత్రం అక్కడికి తీసుకెళ్లకూడదు” అని చెప్పాడు. ఆ సేవకుడు ఈ విషయమై తన యజమానియైన అబ్రాహాము తొడ క్రింద చేయి పెట్టి ప్రమాణం చేశాడు. అప్పుడు ఆ సేవకుడు యజమాని ఒంటెల్లో పది ఒంటెలను, యజమాని యొక్క అన్ని రకాల శ్రేష్ఠమైన వస్తు సముదాయాన్ని తీసుకుని బయలుదేరాడు. అతడు అరాము నహరయీముకు బయలుదేరి, నాహోరు పట్టణం చేరాడు. పట్టణం బయట ఉన్న బావి దగ్గర ఒంటెలను మోకరింపజేశాడు; అది సాయంకాలం, స్త్రీలు నీళ్లు చేదుకోడానికి వచ్చే సమయము. అప్పుడు అతడు ఇలా ప్రార్థన చేశాడు, “యెహోవా! నా యజమానియైన అబ్రాహాము దేవా, నేను వచ్చిన పని ఈ రోజు సఫలం చేయండి, నా యజమాని అబ్రాహాముపై దయ చూపండి. నేను ఈ నీటి ఊట దగ్గర నిలబడి ఉన్నాను, ఈ పట్టణవాసుల కుమార్తెలు నీళ్లు తోడుకోడానికి వస్తున్నారు. నేను వారిలో ఒక యవ్వన స్త్రీతో, ‘నీ కడవ క్రిందికి వంచు, నేను నీళ్లు త్రాగుతాను’ అని అడిగినప్పుడు, ఏ స్త్రీ అయితే, ‘ఇదిగో త్రాగండి, మీ ఒంటెలకు కూడా నీళ్లు తోడి పోస్తాను’ అని అంటుందో, ఆమె నీ సేవకుడైన ఇస్సాకుకు మీరు ఎంచుకున్న స్త్రీ అయి ఉండాలి. దీనిని బట్టి నా యజమాని పట్ల మీరు దయ చూపారు అని గ్రహిస్తాను.” అతడు ప్రార్థన ముగించకముందే రిబ్కా కడవ భుజంపై పెట్టుకుని వచ్చింది. ఆమె అబ్రాహాము సోదరుడు నాహోరు యొక్క భార్యయైన మిల్కా దంపతులకు పుట్టిన బెతూయేలు కుమార్తె. రిబ్కా చాలా అందమైన కన్యక; ఏ మనుష్యుడు ఆమెతో శయనించలేదు. ఆమె బావిలోనికి దిగివెళ్లి తన కుండలో నీళ్లు నింపుకుని పైకి వచ్చింది.

చదువండి ఆది 24

ఆది 24:1-16 కోసం వీడియో