ఆది 18:1-15

ఆది 18:1-15 OTSA

అబ్రాహాము మమ్రేలో ఉన్న సింధూర వృక్షాల దగ్గర తన గుడార ద్వారం దగ్గర ఎండలో కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యారు. అబ్రాహాము కళ్ళెత్తి చూసినప్పుడు అతని ఎదుట ముగ్గురు మనుష్యులు నిలిచి ఉన్నారు. వారిని చూసిన వెంటనే తన గుడార ద్వారం నుండి వారిని కలవడానికి త్వరపడి వెళ్లి సాష్టాంగపడ్డాడు. అబ్రాహాము వారితో, “నా ప్రభువా, మీ దృష్టిలో నేను దయ పొందినట్లైతే, మీ దాసున్ని విడిచి వెళ్లకండి. నీళ్లు తెప్పిస్తాను, కాళ్లు కడుక్కుని ఈ చెట్టు క్రింద విశ్రాంతి తీసుకోండి. మీరు మీ సేవకుని దగ్గరకు వచ్చారు కాబట్టి మీరు తినడానికి ఆహారం తీసుకువస్తాను, మీ ఆకలి తీరిన తర్వాత వెళ్లవచ్చు” అని అన్నాడు. “మంచిది, అలాగే చేయి” అని వారు జవాబిచ్చారు. కాబట్టి అబ్రాహాము శారా గుడారంలోకి త్వరపడి వెళ్లి, “త్వరగా మూడు మానికెలు నాణ్యమైన పిండి తెచ్చి, బాగా పిసికి రొట్టెలు చేయి” అని చెప్పాడు. తర్వాత అబ్రాహాము పశువుల మంద దగ్గరకు పరుగెత్తి వెళ్లి, లేగదూడను తెచ్చి తన పనివానికి ఇచ్చాడు, ఆ పనివాడు త్వరగా దానిని వండి పెట్టాడు. తర్వాత అతడు కొంచెం వెన్న, పాలు, వండిన దూడ మాంసాన్ని వారి ముందు ఉంచాడు. వారు భోజనం చేస్తుండగా, వారి దగ్గర చెట్టు క్రింద అతడు నిలబడ్డాడు. “నీ భార్య శారా ఎక్కడ?” అని వారు అడిగారు. “అదిగో ఆ గుడారంలో ఉంది” అని అబ్రాహాము జవాబిచ్చాడు. అప్పుడు వారిలో ఒకరు, “వచ్చే సంవత్సరం ఈ సమయానికి తప్పకుండా నేను నీ దగ్గరకు తిరిగి వస్తాను, అప్పటికి నీ భార్య శారా ఒక కుమారున్ని కలిగి ఉంటుంది” అని అన్నారు. శారా అతని వెనుక ఉన్న గుడార ద్వారం దగ్గర నిలబడి వింటుంది. అబ్రాహాము శారా అప్పటికే చాలా వృద్ధులు, శారా పిల్లలు కనే వయస్సు దాటిపోయింది. శారా తనలో తాను నవ్వుకుని, “నేను బలం ఉడిగిన దానిని, నా భర్త కూడా వృద్ధుడు కదా ఇప్పుడు నాకు ఈ భాగ్యం ఉంటుందా?” అని అనుకుంది. అప్పుడు యెహోవా అబ్రాహాముతో, “శారా ఎందుకలా నవ్వుకుంది, ‘ముసలిదాన్ని నేను కనగలనా అని ఎందుకు అనుకుంది?’ యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? వచ్చే సంవత్సరం నియమించబడిన సమయానికి నేను నీ దగ్గరకు తిరిగి వస్తాను, అప్పటికి శారా ఒక కుమారున్ని కంటుంది” అని అన్నారు. శారా భయపడి, “నేను నవ్వలేదు” అని అబద్ధమాడింది. “లేదు, నీవు నవ్వావు” అని ఆయన అన్నారు.

చదువండి ఆది 18

ఆది 18:1-15 కోసం వీడియో