గలతీ పత్రిక 2:14-21

గలతీ పత్రిక 2:14-21 OTSA

వారు సువార్త సత్యం ప్రకారం ప్రవర్తించడం లేదని నేను చూసినప్పుడు, వారందరి ముందు కేఫా అనే పేతురుతో, “నీవు యూదుడవు, అయినా నీవు యూదుల్లా కాక యూదేతరుల్లా జీవిస్తున్నావు. అలాంటప్పుడు యూదుల ఆచారాలను అనుసరించమని యూదేతరులను ఎందుకు బలవంతం చేస్తున్నావు? “మనం పుట్టుకతోనే యూదులం, యూదేతరుల్లా పాపులం కాము. ఒక వ్యక్తి ధర్మశాస్త్రాన్ని ఆచరించడం వల్ల నీతిమంతునిగా తీర్చబడడు, కాని యేసు క్రీస్తులో విశ్వాసముంచడం వల్లనే అని మనకు తెలుసు. అందుకే, మేము కూడా ధర్మశాస్త్ర క్రియలనుబట్టి కాక, క్రీస్తులో విశ్వాసముంచడం ద్వారా నీతిమంతులంగా తీర్చబడ్డాం, ఎందుకంటే ధర్మశాస్త్ర క్రియలనుబట్టి ఎవ్వరూ నీతిమంతులుగా తీర్చబడలేరు. “కాని ఒకవేళ, క్రీస్తులో నీతిమంతులు కావాలని కోరుకుంటూ, యూదులమైన మనం కూడా పాపులమని తీర్చబడితే, క్రీస్తు పాపాన్ని ప్రోత్సహిస్తున్నారని అర్థం కాదా? కానే కాదు! ఒకవేళ నేను కూల్చివేసిన దానిని మరల కడితే, అప్పుడు నేను నిజంగానే అపరాధిని అవుతాను. “నేను దేవుని కోసం జీవించటానికి ధర్మశాస్త్ర విషయంలో ధర్మశాస్త్రం ద్వారా చనిపోయాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, ఇప్పుడు జీవిస్తుంది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నారు. ఇప్పుడు నేను శరీరంలో జీవిస్తున్న జీవితం, నన్ను ప్రేమించి నా కోసం తనను తాను అర్పించుకొన్న దేవుని కుమారునియందు విశ్వాసముంచడం వల్ల జీవిస్తున్నాను. దేవుని కృపను నేను తిరస్కరించను, ఒకవేళ, ధర్మశాస్త్రం ద్వారా నీతి పొందుకోగలిగితే, క్రీస్తు కారణం లేకుండా చనిపోయినట్లే!”