నిర్గమ 30:12-38

నిర్గమ 30:12-38 OTSA

“నీవు ఇశ్రాయేలీయుల జనాభా లెక్కించేటప్పుడు, వారు లెక్కించబడుతున్న సమయంలో ప్రతి ఒక్కరు యెహోవాకు తమ జీవితానికి విమోచన క్రయధనం చెల్లించాలి. అలా చేస్తే నీవు వారిని లెక్కించినప్పుడు ఏ తెగులు వారి మీదికి రాదు. లెక్కించబడినవారిలో చేరే ప్రతి ఒక్కరు పరిశుద్ధాలయం యొక్క షెకెల్ ప్రకారం అర షెకెల్ ఇవ్వాలి, దాని బరువు ఇరవై గెరాలు ఉంటుంది. ఈ అర షెకెల్ యెహోవాకు కానుక. ఇరవై సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ వయస్సు కలిగి లెక్కించబడేవారిలో చేరే వారు యెహోవాకు కానుక ఇవ్వాలి. మీ ప్రాణాలకు ప్రాయశ్చిత్తం కలగడానికి మీరు యెహోవాకు అర్పణ ఇచ్చినప్పుడు ధనవంతులు అర షెకెల్ కన్నా ఎక్కువ ఇవ్వకూడదు, పేదవారు అర షెకెల్ కన్నా తక్కువ ఇవ్వకూడదు. నీవు ఇశ్రాయేలీయుల దగ్గర నుండి ప్రాయశ్చిత్త డబ్బును తీసుకుని సమావేశ గుడారపు సేవ కోసం ఉపయోగించాలి. మీ ప్రాణాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి యెహోవా ఎదుట ఇది ఇశ్రాయేలీయులకు జ్ఞాపకంగా ఉంటుంది.” యెహోవా మోషేతో ఇలా అన్నారు: “కడుక్కోడానికి నీవు ఒక ఇత్తడి గంగాళాన్ని, దానికి ఇత్తడి పీటని చేసి సమావేశ గుడారానికి బలిపీఠానికి మధ్యలో పెట్టి దానిలో నీళ్లు పోయాలి. దానిలో ఉన్న నీళ్లతో అహరోను అతని కుమారులు తమ చేతులు పాదాలు కడుక్కోవాలి. వారు సమావేశ గుడారంలోకి వెళ్లినప్పుడెల్లా, వారు నీళ్లతో కడుక్కోవాలి, తద్వారా వారు చావరు. అలాగే, వారు యెహోవాకు హోమబలి అర్పించి సేవ చేయడానికి బలిపీఠాన్ని సమీపించినప్పుడు, తాము చనిపోకుండా ఉండడానికి వారు తమ చేతులు పాదాలు కడుక్కోవాలి. ఇది అహరోనుకు అతని కుమారులకు తర్వాతి తరాలకు నిత్య కట్టుబాటుగా ఉంటుంది.” తర్వాత యెహోవా మోషేతో ఇలా అన్నారు: “నీవు ఈ శ్రేష్ఠమైన సుగంధద్రవ్యాలు తీసుకోవాలి: పరిశుద్ధాలయం యొక్క షెకెల్ ప్రకారం గోపరసం 500 షెకెళ్ళు, వాసనగల దాల్చిన చెక్క సగం అనగా 250 షెకెళ్ళు, పరిమళ వాసనగల నిమ్మగడ్డి నూనె 250 షెకెళ్ళు లవంగపట్ట 500 షెకెళ్ళు, అయిదు శేర్ల ఒలీవనూనె; అన్నీ పరిశుద్ధాలయం యొక్క షెకెల్ ప్రకారం తీసుకోవాలి. వాటిని పవిత్ర అభిషేక తైలంగా, పరిమళద్రవ్యాలు చేసేవాని పనిలా పరిమళ మిశ్రమం చేయాలి. అది పవిత్ర అభిషేక తైలం అవుతుంది. ఆ అభిషేక తైలంతో సమావేశ గుడారాన్ని, నిబంధన మందసాన్ని, బల్లను, దానిమీది ఉపకరణాలను, దీపస్తంభాన్ని, దాని ఉపకరణాలను, ధూపవేదికను, దహనబలిపీఠాన్ని, దాని పాత్రలన్నిటిని, గంగాళాన్ని, దాని పీటని అభిషేకించాలి. మీరు వాటిని పవిత్రం చేయాలి అప్పుడు అవి అత్యంత పరిశుద్ధమవుతాయి; వాటిని తాకిన ప్రతిదీ పరిశుద్ధమవుతుంది. “నాకు యాజకులుగా సేవ చేయడానికి అహరోనును అతని కుమారులను అభిషేకించి ప్రతిష్ఠించాలి. నీవు ఇశ్రాయేలీయులతో, ‘ఇది రాబోయే తరాలకు పవిత్రమైన అభిషేక తైలం అవుతుంది. దానిని సాధారణ మనుష్యుల శరీరంపై పోయకూడదు, ఆ సూత్రాన్ని ఉపయోగించి మరే ఇతర నూనెను తయారుచేయవద్దు. ఇది పవిత్రమైనది, మీరు దానిని పవిత్రంగా పరిగణించాలి. దాన్ని పోలిన పరిమళద్రవ్యాన్ని తయారుచేసినవారు, యాజకుల మీద కాకుండా ఇతరుల మీద దానిని పోసిన వారు తమ ప్రజల్లో నుండి కొట్టివేయబడాలి’ అని చెప్పు.” యెహోవా మోషేతో ఇలా అన్నారు, “నీవు జటామాంసి, గోపిచందనం, గంధం అనే పరిమళద్రవ్యాలను, స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగాలలో తీసుకుని పరిమళద్రవ్యాలను తయారుచేసేవాని పనియైన ధూపం యొక్క సువాసన మిశ్రమాన్ని తయారుచేయాలి. అది ఉప్పుగా, స్వచ్ఛముగా, పవిత్రంగా ఉండాలి. దానిలో కొంచెం పొడిచేసి, సమావేశ గుడారంలో నిబంధన మందసం ముందు ఉంచండి, అక్కడ నేను మిమ్మల్ని కలుస్తాను. అది మీకు అతి పరిశుద్ధమైనదిగా ఉంటుంది. అదే సూత్రంతో మీ కోసం మరొక ధూపద్రవ్యాలను తయారుచేసుకోవద్దు; అది యెహోవాకు పరిశుద్ధమైనదని పరిగణించండి. దాని పరిమళాన్ని ఆస్వాదించడానికి దానిని పోలిన ధూపాన్ని తయారుచేసినవారు వారు తమ ప్రజల్లో నుండి కొట్టివేయబడాలి.”

నిర్గమ 30:12-38 కోసం వీడియో