నిర్గమ 3:1-17

నిర్గమ 3:1-17 OTSA

ఈ సమయంలో, మోషే మిద్యానులో యాజకుడైన యెత్రో అనే తన మామ మందను మేపుతూ, మందను అరణ్యానికి చాలా దూరంగా నడిపించి దేవుని పర్వతమైన, హోరేబు దగ్గరకు వచ్చాడు. అక్కడ ఒక పొదలో మండుతున్న అగ్నిజ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఆ పొద అగ్నితో మండుతూ ఉన్నప్పటికీ అది కాలిపోకపోవడం మోషే చూశాడు. అప్పుడు మోషే, “నేను అక్కడికి వెళ్లి ఆ పొద ఎందుకు కాలిపోవడం లేదనే ఆ గొప్ప అద్భుతాన్ని చూస్తాను” అని అనుకున్నాడు. దానిని చూడడానికి అతడు అక్కడికి రావడం యెహోవా చూసినప్పుడు, ఆ పొద మధ్యలో నుండి దేవుడు, “మోషే! మోషే!” అని అతన్ని పిలిచారు. అందుకు మోషే, “నేను ఇక్కడ ఉన్నాను” అన్నాడు. అందుకు దేవుడు, “దగ్గరకు రావద్దు, నీవు నిలబడిన స్థలం పరిశుద్ధస్థలం కాబట్టి నీ చెప్పులు విప్పు” అన్నారు. ఇంకా ఆయన, “నేను నీ తండ్రి దేవుడను, అనగా అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను” అన్నారు. అప్పుడు మోషే దేవుని వైపు చూడడానికి భయపడి, తన ముఖాన్ని దాచుకున్నాడు. అప్పుడు యెహోవా, “నేను ఈజిప్టులో ఉన్న నా ప్రజల బాధను చూశాను. వారిచేత వెట్టిచాకిరి చేయిస్తున్న అధికారులను గురించి వారు నాకు చేసిన మొరను నేను విన్నాను, వారి శ్రమల గురించి నాకు తెలుసు. కాబట్టి ఈజిప్టువారి చేతిలో నుండి వారిని విడిపించడానికి ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశంలోనికి, అనగా కనానీయుల, హిత్తీయుల, అమోరీయుల, పెరిజ్జీయుల, హివ్వీయుల, యెబూసీయుల దేశమైన పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వారిని తీసుకెళ్లడానికి నేను దిగి వచ్చాను. ఇశ్రాయేలీయుల మొర నాకు చేరింది, ఈజిప్టువారు వారినెలా అణచివేస్తున్నారో నేను చూశాను. కాబట్టి ఇప్పుడు, వెళ్లు. నా ప్రజలైన ఇశ్రాయేలీయులను ఈజిప్టు బయటకు తీసుకురావడానికి నేను నిన్ను ఫరో దగ్గరకు పంపుతున్నాను” అని అన్నారు. అయితే మోషే, “ఫరో దగ్గరకు వెళ్లడానికి ఇశ్రాయేలీయులను ఈజిప్టులో నుండి బయటకు తీసుకురావడానికి నేను ఎంతటివాన్ని?” అని దేవునితో అన్నాడు. అప్పుడు దేవుడు, “ఖచ్చితంగా నేను నీకు తోడై ఉంటాను. నేను నిన్ను పంపాను అనడానికి ఇది ఒక అసాధారణ గుర్తుగా ఉంటుంది: మీరు ఈజిప్టు నుండి ప్రజలను బయటకు తీసుకువచ్చినప్పుడు, మీరూ ఈ పర్వతం మీద దేవుని ఆరాధిస్తారు” అని చెప్పారు. అప్పుడు మోషే, “నేను ఇశ్రాయేలీయుల దగ్గరకు వెళ్లి వారితో, ‘మీ పితరుల దేవుడు నన్ను మీ దగ్గరకు పంపారు’ అని చెప్పినప్పుడు వారు, ‘ఆయన పేరు ఏమిటి?’ అని నన్ను అడుగుతారు, అప్పుడు నేను వారికి ఏమి చెప్పాలి?” అని దేవుని అడిగాడు. అందుకు దేవుడు మోషేతో, “నేను నేనైయున్నాను. నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పాలి: ‘నేనైయున్నాను అనేవాడు నన్ను మీ దగ్గరకు పంపాడు.’ ” దేవుడు మోషేతో, “నీవు ఇశ్రాయేలీయులతో, ‘మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నన్ను మీ దగ్గరకు పంపారు’ అని చెప్పాలి. “ఇదే నా నిత్యమైన పేరు, తరతరాల వరకు మీరు జ్ఞాపకముంచుకోవలసిన పేరు ఇదే. “వెళ్లు, ఇశ్రాయేలీయుల పెద్దలను పోగు చేసి వారితో, ‘మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇలా అన్నారు: నేను మిమ్మల్ని చూశాను; ఈజిప్టులో మీకు జరిగిన దానిని చూశాను. ఈజిప్టు కష్టాల నుండి విడిపించి, కనానీయుల, హిత్తీయుల, అమోరీయుల, పెరిజ్జీయుల, హివ్వీయుల, యెబూసీయుల దేశం అనగా పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని తీసుకెళ్తానని ప్రమాణం చేశాను’ అని వారితో చెప్పు.

నిర్గమ 3:1-17 కోసం వీడియో