నా కళ్లు కోరినవాటిలో దేన్ని చూడకుండ నేను నిరాకరించలేదు; సంతోషాలను అనుభవించకుండా నా హృదయాన్ని ఆటంకపరచలేదు. నా పనులన్నిటిని బట్టి నా హృదయం సంతోషించింది. నా శ్రమంతటికి కలిగిన ఫలితం ఇదే. అయితే, నా చేతులు చేసిన పనులన్నిటిని వాటికోసం నేను పడిన శ్రమనంతటి పరిశీలిస్తే, అవన్నీ అర్థరహితమే అని, గాలికి ప్రయాసపడినట్లే అని తెలుసుకున్నాను. సూర్యుని క్రింద లాభకరమైనదేదీ లేదని నేను గ్రహించాను. నేను జ్ఞానం, పిచ్చితనం, బుద్ధిహీనతల గురించి ఆలోచించాలని నిర్ణయించుకున్నాను. రాజు ఇంతకుముందే చేసిన దానికంటే, రాజు తర్వాత వచ్చేవాడు అధికంగా ఇంకేమి చేయగలడు? అనుకున్నాను. చీకటి కంటే వెలుగు మేలు అని, బుద్ధిహీనత కంటే జ్ఞానం మేలు అని నేను చూశాను. జ్ఞానికి తలలో కళ్లు ఉంటాయి. మూర్ఖుడు చీకటిలో నడుస్తాడు. అయినా అందరి విధి ఒకటే అని నేను గ్రహించాను. నాలో నేను అనుకున్నాను మూర్ఖుడికి సంభవించేదే నాకూ సంభవిస్తుంది. నేను ఇంత జ్ఞానం సంపాదించి నాకేం లాభం? “ఇది కూడా అర్థరహితం” అని నాలో నేననుకున్నాను. ఎందుకంటే మూర్ఖుల్లాగే జ్ఞానులు కూడా ఎక్కువకాలం జ్ఞాపకం ఉండరు; ఇరువురిని మరచిపోయే రోజులు ఇప్పటికే వచ్చాయి. మూర్ఖుల్లాగే జ్ఞానులు కూడ చస్తారు. ఇదంతా చూస్తూ ఉంటే సూర్యుని క్రింద జరుగుతున్న దాన్ని బట్టి నాకెంతో విచారం కలిగింది, కాబట్టి నేను నా జీవితాన్ని అసహ్యించుకున్నాను. అంతా అర్థరహితమే గాలికి ప్రయాసపడడమే. సూర్యుని క్రింద నేను కష్టపడి సాధించినవన్నీ నా తర్వాత వచ్చే వారికి చెందుతాయని తెలుసుకొని నేను వాటన్నిటిని అసహ్యించుకున్నాను. నా తర్వాత వచ్చేవాడు ఎలాంటివాడో ఎవరికి తెలుసు? అతడు జ్ఞాని కావచ్చు, మూర్ఖుడు కావచ్చు. ఎలాంటి వాడైనా సూర్యుని క్రింద నా శ్రమతో నైపుణ్యతతో సంపాదించినదంతా అతని స్వాధీనమౌతుంది. ఇది కూడా అర్థరహితమే. కాబట్టి సూర్యుని క్రింద నేను పడిన కష్టమంతటి గురించి నేను నిరాశ చెందాను. ఒకరు జ్ఞానంతో తెలివితో నైపుణ్యంతో శ్రమించి పని చేస్తారు, కాని తర్వాత వారు దానిని శ్రమించని మరొకరికి వదిలేయాల్సి వస్తుంది. ఇది కూడా అర్థరహితమే, గొప్ప దురదృష్టకరమే. సూర్యుని క్రింద మనుష్యులు కష్టపడి చేస్తున్న పనులకు వారి శ్రమకు పొందుతున్నది ఏంటి?
చదువండి ప్రసంగి 2
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: ప్రసంగి 2:10-22
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు