ద్వితీయో 16:1-17

ద్వితీయో 16:1-17 OTSA

అబీబు నెలను ఆచరించి మీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరిగించాలి, ఎందుకంటే అబీబు నెలలో రాత్రివేళ మీ దేవుడైన యెహోవా ఈజిప్టులో నుండి మిమ్మల్ని తీసుకువచ్చారు. యెహోవా తన నామానికి నివాస స్థలంగా ఏర్పరచుకొనే స్థలంలో మీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించి పశువుల్లో నుండి గాని మందలో నుండి గాని ఒక జంతువును బలి ఇవ్వాలి. పులిసిన దానితో చేసిన రొట్టెలు తినకూడదు, కాని మీరు ఈజిప్టులో నుండి త్వరగా బయలుదేరి వచ్చారు కాబట్టి, ఈజిప్టు దేశం నుండి వచ్చిన ఆ రోజును జీవితకాలమంతా జ్ఞాపకముంచుకోడానికి ఏడు రోజులు మీరు బాధను సూచించే రొట్టె అనగా పులియని రొట్టెలు తినాలి. ఆ ఏడు రోజులు మీ దేశంలో ఎక్కడా పులిసిన పదార్థమేదీ కనిపించకూడదు. మీరు మొదటి రోజు సాయంకాలం వధించిన బలి మాంసంలో ఏదీ ఉదయం వరకు మిగలకూడదు. మీ దేవుడైన యెహోవా తన నామానికి నివాసంగా ఏర్పరచుకొనే స్థలంలో తప్ప ఆయన మీకు ఇచ్చే ఏ పట్టణాల్లో పస్కా పశువును అర్పించకూడదు. ఈజిప్టు నుండి మీరు బయలుదేరిన సందర్భంగా, సూర్యుడు అస్తమించే సమయంలో, సాయంకాలంలో ఆ స్థలంలోనే మీరు పస్కా పశువును బలి ఇవ్వాలి. మీ దేవుడైన యెహోవా ఎన్నుకునే స్థలంలో దానిని కాల్చి తినాలి. ఉదయం మీ గుడారాలకు తిరిగి వెళ్లాలి. ఆరు రోజులు పులియని రొట్టెలు తినాలి, ఏడవ రోజు మీ దేవుడైన యెహోవాకు ఒక సభను నిర్వహించాలి, అప్పుడు మీరు ఏ పని చేయకూడదు. పంటపై కొడవలి వేయడం మొదలుపెట్టినప్పటి నుండి ఏడు వారాలు లెక్కించాలి. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి ఇచ్చిన దానిలో నుండి స్వేచ్ఛార్పణలు ఇవ్వడం ద్వారా మీ దేవుడైన యెహోవాకు వారాల పండుగ ఆచరించాలి. మీరు, మీ కుమారులు, కుమార్తెలు, మీ దాసదాసీలు, మీ పట్టణాల్లో నివసించే లేవీయులు, మీ మధ్య ఉండే విదేశీయులు, తండ్రిలేనివారు, విధవరాండ్రు, అందరు యెహోవా తన నామానికి నివాస స్థలంగా ఏర్పరచుకొన్న స్థలంలో మీ దేవుడైన యెహోవా సన్నిధిలో ఆనందించాలి. మీరు ఈజిప్టులో బానిసలుగా ఉన్న సంగతి జ్ఞాపకం చేసుకుని ఈ శాసనాలను జాగ్రత్తగా పాటించండి. మీరు మీ నూర్పిడి కళ్ళం నుండి ధాన్యాన్ని, ద్రాక్ష గానుగ తొట్టె నుండి ద్రాక్షరసాన్ని సమకూర్చుకున్న తర్వాత గుడారాల పండుగ ఏడు రోజులు ఆచరించాలి. మీరు, మీ కుమారులు కుమార్తెలు, మీ దాసదాసీలు, మీ పట్టణాల్లో నివసించే లేవీయులు, మీ మధ్య ఉండే విదేశీయులు, తండ్రిలేనివారు, విధవరాండ్రు, అందరు ఈ పండుగలో ఆనందించాలి. యెహోవా ఏర్పరచుకొన్న స్థలంలో మీ దేవుడైన యెహోవాకు మీరు ఈ పండుగ ఏడు రోజులు ఆచరించాలి. ఎందుకంటే, మీ దేవుడైన యెహోవా మీ పంట అంతటిలో మీ చేతి పనులన్నిటిలో మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, మీ ఆనందం పరిపూర్ణం అవుతుంది. సంవత్సరానికి మూడుసార్లు మీ పురుషులందరు మీ దేవుడైన యెహోవా తన నామానికి నివాస స్థలంగా ఏర్పరచుకొనే స్థలంలో కనబడాలి: పులియని రొట్టెల పండుగలో, వారాల పండుగలో, గుడారాల పండుగలో. యెహోవా సన్నిధిలో ఎవరూ వట్టి చేతులతో కనిపించకూడదు. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించిన ప్రకారం మీలో ప్రతి ఒకరు తమ శక్తి కొద్ది కానుకలు తీసుకురావాలి.