“ఇలాంటి రోజుల్లో మోషే పుట్టాడు, అతడు సామాన్యమైన బిడ్డ కాదు. మూడు నెలల వరకు అతని కుటుంబం అతన్ని కాపాడింది. అతన్ని బయట వదిలినప్పుడు ఫరో కుమార్తె అతన్ని తీసుకుని, అతన్ని తన సొంత కుమారునిగా పెంచుకొంది. మోషే ఈజిప్టువారి విద్యలన్నింటిని నేర్చుకొని, మాటలోను, క్రియలలోను ప్రావీణ్యత సంపాదించుకున్నాడు. “మోషేకు నలభై సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు అతడు ఇశ్రాయేలీయులైన తన సొంత ప్రజలను చూడాలని నిర్ణయించుకొన్నాడు. అతడు తన జాతివారిలోని ఒకడిని ఒక ఐగుప్తీయుడు దౌర్జన్యంగా కొట్టడం చూసి, వానిని కాపాడి ఆ ఈజిప్టువాన్ని చంపి ప్రతీకారం తీర్చుకున్నాడు. తన ద్వారా తన సొంత జాతి ప్రజలను దేవుడు విడుదల చేస్తున్నాడనే సంగతిని తన ప్రజలు తెలుసుకుంటారని మోషే అనుకున్నాడు కాని వారు గ్రహించలేదు. మరుసటిరోజు, పోట్లాడుకుంటున్న ఇద్దరు ఇశ్రాయేలీయుల దగ్గరకు మోషే వచ్చి వారిని సమాధానపరచాలని ప్రయత్నిస్తూ ‘అయ్యా, మీరిద్దరు సహోదరులు కదా, మీరెందుకు ఒకరిని ఒకరు గాయపరచుకొంటున్నారు?’ అని అడిగాడు. “అయితే గాయపరుస్తున్న వాడు మోషేను ప్రక్కకు త్రోసి, ‘మామీద అధికారిగా న్యాయాధిపతిగా నిన్ను ఎవరు నియమించారు? ఆ ఈజిప్టువాన్ని చంపినట్లు నన్ను కూడా చంపాలని అనుకుంటున్నావా?’ అన్నాడు. మోషే ఆ మాట విని మిద్యాను దేశానికి పారిపోయి, అక్కడ ఒక పరదేశిగా జీవించి ఇద్దరు కుమారులను కన్నాడు. “నలభై సంవత్సరాలు గడిచిన తర్వాత, ఒక రోజు సీనాయి పర్వతం దగ్గర అరణ్యంలో ఒక మండుతున్న పొదలో నుండి వస్తున్న అగ్నిజ్వాలల్లో ఒక దేవదూత మోషేకు ప్రత్యక్షమయ్యాడు. అతడు అది చూసి, ఆ దర్శనానికి ఆశ్చర్యపడి స్పష్టంగా చూడడానికి దాని దగ్గరకు వెళ్తుండగా, ‘నేను మీ పితరుల దేవుడను అనగా నేనే అబ్రాహాము ఇస్సాకు యాకోబు దేవుడను’ అని ప్రభువు చెప్పడం అతడు విన్నాడు. కాబట్టి మోషే భయంతో వణుకుతూ దానిని చూడడానికి సాహసించలేకపోయాడు. “అప్పుడు ప్రభువు అతనితో, ‘నీవు నిలబడిన స్థలం పరిశుద్ధస్థలం కాబట్టి నీ చెప్పులు విప్పు. ఈజిప్టులో ఉన్న నా ప్రజల బాధను నేను చూశాను. నేను వారి మూలుగులను విని వారిని విడిపించడానికి దిగి వచ్చాను. కాబట్టి రా! నేను నిన్ను తిరిగి ఈజిప్టు దేశానికి పంపుతాను’ అన్నారు. “ ‘మామీద అధికారిగా న్యాయాధిపతిగా నిన్ను ఎవరు నియమించారు?’ అని తిరస్కరించిన ఈ మోషేనే దేవుడు వారికి అధికారిగా విమోచకునిగా ఉండాలని మండుతున్న పొదలో ప్రత్యక్షమైన దేవదూత ద్వార పంపించారు. అతడు ఈజిప్టులో, ఎర్ర సముద్రం దగ్గర నలభై సంవత్సరాలు అరణ్యంలో అద్భుతాలను సూచకక్రియలను చేసి వారిని ఈజిప్టు నుండి బయటకు నడిపించాడు. “ఈ మోషేనే ఇశ్రాయేలీయులతో, ‘దేవుడు నా లాంటి ఒక ప్రవక్తను మీలో నుండి మీ కోసం లేవనెత్తుతాడు’ అని చెప్పాడు. అతడు అరణ్యంలో ఉన్నప్పుడు సీనాయి కొండమీద తనతో మాట్లాడిన దూతతో మన పితరులతో సమావేశం అయ్యాడు; మనకు అందించడానికి జీవ వాక్కులు పొందుకున్నాడు. “కానీ మన పితరులు అతనికి లోబడలేదు. పైగా అతన్ని తిరస్కరించి తమ హృదయాల్లో ఈజిప్టు వైపుకు తిరిగారు. వారు అహరోనుతో, ‘ఈజిప్టులో నుండి మమ్మల్ని బయటకు తీసుకువచ్చిన ఈ మోషే అనే వానికి ఏమి జరిగిందో మాకు తెలియదు కాబట్టి నీవు వచ్చి మాకు ముందు నడవడానికి మాకు దేవుళ్ళను తయారుచేయి’ అని అన్నారు. అప్పుడు వారు ఒక దూడ రూపంలో ఒక విగ్రహాన్ని చేసుకున్నారు. దానికి బలులను అర్పించి తమ స్వహస్తాలతో చేసిన దాని ముందు ఆనందించారు. అందుకు దేవుడు వారి నుండి దూరమై సూర్య, చంద్ర నక్షత్రాలను పూజించడానికి వారిని విడిచిపెట్టాడు. దీనిని గురించి ప్రవక్తల గ్రంథాల్లో: “ ‘ఇశ్రాయేలు ప్రజలారా, అరణ్యంలో నలభై సంవత్సరాలు మీరు నాకు బలులు అర్పణలు తెచ్చారా? మీరు తయారుచేసుకున్న విగ్రహాలను పూజించారు మొలొకును దైవమని దాని గుడారాన్ని ఊరేగించారు, రెఫాను అనే మీ దేవుని నక్షత్రాన్ని పూజించారు. అందుకే నేను మిమ్మల్ని బబులోను అవతలికి బందీలుగా పంపిస్తాను’ అని వ్రాయబడి ఉంది.
Read అపొస్తలుల కార్యములు 7
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: అపొస్తలుల కార్యములు 7:20-43
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు