అప్పుడు ప్రధాన యాజకుడు స్తెఫెనును, “ఈ మాటలు నిజమేనా?” అని అడిగాడు.
అందుకు అతడు, “సహోదరులారా తండ్రులారా, నా మాటను వినండి! మన పితరుడైన అబ్రాహాము హారానులో నివసించక ముందు మెసొపొటేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, ‘నీ దేశాన్ని, నీ ప్రజలను విడిచి నేను నీకు చూపించబోయే దేశానికి వెళ్లు’ అని చెప్పారు.
“కాబట్టి అతడు కల్దీయుల దేశాన్ని విడిచివెళ్లి హారానులో నివసించాడు. అతని తండ్రి చనిపోయిన తర్వాత, నేడు మనం నివసిస్తున్న ఈ దేశంలో నివసించడానికి దేవుడు అతన్ని పంపారు. ఇక్కడ అతనికి ఒక పాదం పట్టే అంత స్థలం కూడా దేవుడు వారసత్వంగా ఇవ్వలేదు. కాని దేవుడు అబ్రాహాముకు ఒక్క సంతానం కూడా లేని సమయంలో అతని తర్వాత రాబోయే అతని సంతానం ఆ దేశాన్ని స్వాధీన పరచుకొంటారని అతనితో వాగ్దానం చేశారు. దేవుడు అతనితో ఇలా మాట్లాడారు: ‘నీ వారసులు తమది కాని దేశంలో నాలుగు వందల సంవత్సరాలు పరాయివారిగా ఉంటారు, వారు బానిసలుగా ఉంటూ వేధించబడతారు. కాని వారిని బానిసలుగా చేసిన దేశాన్ని నేను శిక్షిస్తాను, ఆ తర్వాత ఆ దేశం నుండి వారు బయటకు వచ్చి ఈ స్థలంలో నన్ను ఆరాధిస్తారు’ అని దేవుడు చెప్పారు. అప్పుడు దేవుడు అబ్రాహాముకు సున్నతితో ఒక నిబంధనను ఇచ్చారు. కాబట్టి అతడు ఇస్సాకుకు తండ్రియైనప్పుడు నిబంధన ప్రకారం అతడు పుట్టిన ఎనిమిదవ రోజున అతనికి సున్నతి చేశాడు. ఇలా ఇస్సాకు యాకోబుకు తండ్రిగా యాకోబు పన్నెండు గోత్రాల పితరులను కన్న తండ్రిగా సున్నతి నిబంధనను పాటించారు.
“మన పితరులు తమ సహోదరుడైన యోసేపును అసూయతో ఈజిప్టుకు బానిసగా అమ్మివేశారు. కానీ దేవుడు అతనికి తోడుగా ఉండి, అతని శ్రమలన్నింటిలో నుండి తప్పించారు. ఆయన యోసేపుకు జ్ఞానం ఇచ్చి ఈజిప్టు రాజైన ఫరో దయ పొందుకొనేలా చేశారు. కాబట్టి ఫరో ఈజిప్టు దేశమంతటిమీద అలాగే అతని రాజభవనం మీద కూడా అతన్ని అధికారిగా నియమించాడు.
“ఆ తర్వాత ఈజిప్టు కనాను దేశాల్లో తీవ్రమైన కరువు వచ్చి, ప్రజలందరికి చాలా కష్టాలు కలిగాయి, అప్పుడు మన పితరులకు కరువు వల్ల ఆహారం దొరకలేదు. యాకోబు ఈజిప్టులో ధాన్యం ఉందని విని, మన పితరులను మొదటిసారి ఈజిప్టు దేశానికి పంపించాడు. వారు రెండవసారి వెళ్లినప్పుడు, యోసేపు తాను ఎవరో తన సహోదరులకు తెలియజేశాడు. అలాగే ఫరో యోసేపు కుటుంబం గురించి తెలుసుకున్నాడు. ఆ తర్వాత యోసేపు తన తండ్రియైన యాకోబును, తన కుటుంబమంతటిని పిలిపించాడు, వారు మొత్తం డెబ్బై అయిదు మంది వ్యక్తులు. అప్పుడు యాకోబు ఈజిప్టుకు వెళ్లాడు, అక్కడే అతడు మన పితరులు చనిపోయారు. వారి మృతదేహాలను షెకెము అనే ఊరికి తెచ్చి అబ్రాహాము షెకెములోని హామోరు కుమారుల దగ్గర వెల ఇచ్చి కొన్న అదే స్థలంలోని సమాధిలో ఉంచారు.
“దేవుడు అబ్రాహాముతో చేసిన వాగ్దానం నెరవేర్చే సమయం దగ్గరకు వచ్చినప్పుడు, ఈజిప్టులో ఉన్న మన ప్రజల సంఖ్య అతి విస్తారంగా పెరిగింది. కొంతకాలం తర్వాత యోసేపు గురించి తెలియని ఒక క్రొత్త రాజు, ఈజిప్టులో అధికారంలోకి వచ్చాడు. అతడు మన జాతి ప్రజల పట్ల కఠినంగా వ్యవహరించి పుట్టిన తమ చంటి పిల్లలను చనిపోవడానికి పారవేయాలని మన పితరులను బలవంతం చేసి హింసించాడు.
“ఇలాంటి రోజుల్లో మోషే పుట్టాడు, అతడు సామాన్యమైన బిడ్డ కాదు. మూడు నెలల వరకు అతని కుటుంబం అతన్ని కాపాడింది. అతన్ని బయట వదిలినప్పుడు ఫరో కుమార్తె అతన్ని తీసుకుని, అతన్ని తన సొంత కుమారునిగా పెంచుకొంది. మోషే ఈజిప్టువారి విద్యలన్నింటిని నేర్చుకొని, మాటలోను, క్రియలలోను ప్రావీణ్యత సంపాదించుకున్నాడు.
“మోషేకు నలభై సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు అతడు ఇశ్రాయేలీయులైన తన సొంత ప్రజలను చూడాలని నిర్ణయించుకొన్నాడు. అతడు తన జాతివారిలోని ఒకడిని ఒక ఐగుప్తీయుడు దౌర్జన్యంగా కొట్టడం చూసి, వానిని కాపాడి ఆ ఈజిప్టువాన్ని చంపి ప్రతీకారం తీర్చుకున్నాడు. తన ద్వారా తన సొంత జాతి ప్రజలను దేవుడు విడుదల చేస్తున్నాడనే సంగతిని తన ప్రజలు తెలుసుకుంటారని మోషే అనుకున్నాడు కాని వారు గ్రహించలేదు. మరుసటిరోజు, పోట్లాడుకుంటున్న ఇద్దరు ఇశ్రాయేలీయుల దగ్గరకు మోషే వచ్చి వారిని సమాధానపరచాలని ప్రయత్నిస్తూ ‘అయ్యా, మీరిద్దరు సహోదరులు కదా, మీరెందుకు ఒకరిని ఒకరు గాయపరచుకొంటున్నారు?’ అని అడిగాడు.
“అయితే గాయపరుస్తున్న వాడు మోషేను ప్రక్కకు త్రోసి, ‘మామీద అధికారిగా న్యాయాధిపతిగా నిన్ను ఎవరు నియమించారు? ఆ ఈజిప్టువాన్ని చంపినట్లు నన్ను కూడా చంపాలని అనుకుంటున్నావా?’ అన్నాడు. మోషే ఆ మాట విని మిద్యాను దేశానికి పారిపోయి, అక్కడ ఒక పరదేశిగా జీవించి ఇద్దరు కుమారులను కన్నాడు.
“నలభై సంవత్సరాలు గడిచిన తర్వాత, ఒక రోజు సీనాయి పర్వతం దగ్గర అరణ్యంలో ఒక మండుతున్న పొదలో నుండి వస్తున్న అగ్నిజ్వాలల్లో ఒక దేవదూత మోషేకు ప్రత్యక్షమయ్యాడు. అతడు అది చూసి, ఆ దర్శనానికి ఆశ్చర్యపడి స్పష్టంగా చూడడానికి దాని దగ్గరకు వెళ్తుండగా, ‘నేను మీ పితరుల దేవుడను అనగా నేనే అబ్రాహాము ఇస్సాకు యాకోబు దేవుడను’ అని ప్రభువు చెప్పడం అతడు విన్నాడు. కాబట్టి మోషే భయంతో వణుకుతూ దానిని చూడడానికి సాహసించలేకపోయాడు.