మూడు రోజుల తర్వాత పౌలు అక్కడి యూదా నాయకులను పిలిచి, వారు ఒక్కచోట చేరినప్పుడు వారితో, “నా సహోదరులారా, నేను మన ప్రజలకు, మన పూర్వికుల ఆచారాలకు వ్యతిరేకంగా ఏమి చేయకపోయినా, నన్ను యెరూషలేములో బంధించి రోమీయులకు అప్పగించారు. వారు నన్ను విచారణ చేసి మరణశిక్ష విధించవలసినంత తప్పు నేను చేయలేదని నన్ను విడిచిపెట్టాలని అనుకున్నారు. కానీ యూదులు అడ్డుచెప్పడంతో నేను కైసరుకు విజ్ఞప్తి చేసుకుంటానని మనవి చేశాను. నా సొంత ప్రజలకు వ్యతిరేకంగా నేను ఏ ఫిర్యాదు చేయదలచుకోలేదు. ఈ కారణంగానే నేను మిమ్మల్ని చూసి మీతో మాట్లాడాలని మిమ్మల్ని పిలిపించాను. ఇశ్రాయేలీయుల యొక్క నిరీక్షణను బట్టి నేను ఈ గొలుసుతో బంధించబడి ఉన్నాను” అని వారితో చెప్పాడు. అందుకు వారు, “నీ గురించి యూదయ నుండి ఎటువంటి ఉత్తరాలు మాకు రాలేదు. అక్కడినుండి వచ్చిన మన ప్రజల్లో ఎవరు నీ గురించి చెడుగా మాతో చెప్పలేదు. కానీ ప్రతిచోట ప్రజలు ఈ మతమార్గానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మాకు తెలుసు, కాబట్టి దీని గురించి నీ అభిప్రాయం మేము వినాలనుకొంటున్నాం” అన్నారు. ఒక రోజును ఏర్పాటు చేసుకుని, పౌలు ఉన్న చోటికి చాలామంది వచ్చారు. అతడు ఉదయం నుండి సాయంకాలం వరకు దేవుని రాజ్యం గురించి వివరిస్తూ సాక్ష్యమిచ్చి, మోషే ధర్మశాస్త్రం నుండి ప్రవక్తలు వ్రాసిన పుస్తకాల నుండి యేసు గురించి బోధిస్తూ వారిని ఒప్పించడానికి ప్రయత్నించాడు. అతడు చెప్పిన సంగతులను కొందరు నమ్మారు, మరికొందరు నమ్మలేదు. పౌలు వారితో చివరిగా చెప్పిన మాటలు ఇవి: “యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో పరిశుద్ధాత్మ మాట్లాడినది నిజమే: “ ‘ఈ ప్రజల దగ్గరకు వెళ్లి చెప్పు, “మీరు ఎప్పుడూ వింటూనే ఉంటారు గాని అర్థం చేసుకోరు; ఎప్పుడూ చూస్తూనే ఉంటారు గాని గ్రహించరు.” ఎందుకంటే ఈ ప్రజల హృదయాలు మొద్దుబారిపోయాయి; వారు చెవులతో వినరు, వారు కళ్లు మూసుకున్నారు. లేకపోతే వారు తమ కళ్లతో చూసి, చెవులతో విని, తమ హృదయాలతో గ్రహించి, నా వైపుకు తిరుగుతారు, అప్పుడు నేను వారిని స్వస్థపరుస్తాను.’ “అందుకే దేవుని రక్షణ యూదేతరుల దగ్గరకు పంపబడినది, వారు దాన్ని వింటారని మీరు తెలుసుకోవాలి.” పౌలు ఈ మాటలను చెప్పిన తర్వాత యూదులు తమలో తాము తీవ్రంగా వాదించుకుంటూ అక్కడినుండి వెళ్లిపోయారు. పౌలు రెండు సంవత్సరాలు పూర్తిగా తన అద్దె ఇంట్లో ఉంటూ తనను చూడాలని వచ్చిన వారందరిని స్వాగతించాడు. అతడు పూర్ణధైర్యంతో ఏ ఆటంకం లేకుండా దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తూ, ప్రభువైన యేసు క్రీస్తు గురించి బోధించాడు.
చదువండి అపొస్తలుల కార్యములు 28
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: అపొస్తలుల కార్యములు 28:17-31
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు