పౌలు న్వాయసభ వారిని సూటిగా చూసి, “నా సహోదరులారా, ఈ రోజు వరకు నేను నా మంచి మనస్సాక్షితో దేవుడు నాకు ఇచ్చిన కర్తవ్యాన్ని పూర్తి చేశాను” అని చెప్పాడు. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ, పౌలుకు దగ్గరగా నిలబడి ఉన్నవానితో, అతని నోటి మీద కొట్టమని ఆదేశించాడు. అప్పుడు పౌలు అతనితో, “ఓ సున్నం కొట్టిన గోడా, దేవుడు నిన్ను కొడతాడు! ధర్మశాస్త్రం ప్రకారం నాకు తీర్పు తీర్చడానికి అక్కడ కూర్చుని, నన్ను కొట్టమని ఆదేశించి నీవు ధర్మశాస్త్ర ఆజ్ఞలను అతిక్రమిస్తున్నావు!” అన్నాడు.
పౌలుకు దగ్గరగా నిలబడినవారు, “దేవుని ప్రధాన యాజకుని విమర్శించడానికి నీకెంత ధైర్యం!” అన్నారు.
అందుకు పౌలు, “సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు; అయితే ‘మీ ప్రజల అధికారులను నిందించవద్దు అని’ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉంది” అన్నాడు.
అక్కడ ఉన్నవారిలో కొందరు సద్దూకయ్యులు మరికొందరు పరిసయ్యులు ఉన్నారని పౌలు గ్రహించి, ఆ న్యాయసభలోని వారితో, “నా సహోదరులారా, నేను పరిసయ్యుడను, పరిసయ్యుల సంతానంగా పుట్టాను. నేను మృతులకు పునరుత్థానం ఉందనే నిరీక్షణను బట్టి ఈ విచారణ పాలయ్యాను” అని బిగ్గరగా చెప్పాడు. అతడు ఆ విధంగా చెప్పిన వెంటనే, అక్కడ ఉన్న పరిసయ్యులు సద్దూకయ్యుల మధ్య విభేదం పుట్టి, ఆ సభ రెండుగా చీలిపోయింది. ఎందుకంటే, సద్దూకయ్యులు పునరుత్థానం లేదని, దేవదూతలు లేరని, ఆత్మలు లేవని అంటారు. కానీ పరిసయ్యులు ఇవన్నీ ఉన్నాయని నమ్ముతారు.
అప్పుడు పరిసయ్యులలోని ధర్మశాస్త్ర ఉపదేశకులు కొందరు లేచి, “ఈ వ్యక్తిలో మాకు ఏ తప్పు కనిపించడం లేదు, అతనితో ఆత్మ కాని దేవదూత కాని మాట్లాడి ఉంటే తప్పు ఏంటి?” అని అడుగుతూ గట్టిగా వాదించారు, కాబట్టి గొప్ప అల్లరి చెలరేగింది. ఈ విభేదం మరింత హింసాత్మకంగా మారినందుకు పౌలును ముక్కలుగా చీల్చివేస్తారేమో అని ఆ అధిపతి భయపడ్డాడు. అతడు సైనికులను వెళ్లి వారి మధ్యలో నుండి పౌలును బలవంతంగా పట్టుకుని, సైనికుల కోటలోకి తీసుకుని రమ్మని ఆదేశించాడు.
ఆ రాత్రి ప్రభువు పౌలు దగ్గర నిలబడి, “ధైర్యం తెచ్చుకో! యెరూషలేములో నా గురించి నీవు సాక్ష్యమిచ్చినట్టే రోమాలో కూడా నీవు సాక్ష్యమివ్వాలి” అని చెప్పారు.
మరుసటిరోజు ఉదయం కొందరు యూదులు ఒక కుట్రపన్ని, తాము పౌలును చంపే అంతవరకు ఏమి తినకూడదు త్రాగకూడదని ఒట్టు పెట్టుకొన్నారు. ఇలా కలిసి ఒట్టుపెట్టుకున్న వారు సుమారు నలభై కంటే ఎక్కువ మంది ఉన్నారు. వారు ముఖ్య యాజకులు యూదా పెద్దల దగ్గరకు వెళ్లి, “మేము పౌలును చంపే వరకు ఏమి తినకూడదని ఒట్టు పెట్టుకున్నాము. కాబట్టి మీరు న్యాయసభతో కలిసి, పౌలును మరింత వివరంగా విచారణ చేయాలని అతన్ని మీ దగ్గరకు తీసుకురమ్మని అధిపతితో మనవి చేయండి. అతడు ఇక్కడకు రావడానికి ముందే అతన్ని చంపడానికి మేము సిద్ధంగా ఉంటాం” అని చెప్పుకొన్నారు.
అయితే పౌలు అక్క కుమారుడు ఈ కుట్ర గురించి విన్నప్పుడు, సైనిక కోటలోనికి పోయి ఆ విషయం పౌలుతో చెప్పాడు.
అప్పుడు పౌలు ఒక శతాధిపతిని పిలిచి, “ఈ యువకుడిని అధిపతి దగ్గరకు తీసుకెళ్లండి; ఇతడు అధిపతికి ఒక మాట చెప్పాలి” అని చెప్పాడు. కాబట్టి అతడు ఆ యువకుని అధిపతి దగ్గరకు తీసుకుని వెళ్లాడు.
అప్పుడు శతాధిపతి, “ఈ యువకుడు నీకు ఒక మాట చెప్పాలి కాబట్టి ఇతన్ని మీ దగ్గరకు తీసుకెళ్లమని ఖైదీగా ఉన్న పౌలు నన్ను విన్నవించుకున్నాడు” అని అధిపతితో చెప్పాడు.
అప్పుడు ఆ అధిపతి అతని చేతిని పట్టుకుని ప్రక్కకు తీసుకెళ్లి, “నీవు నాకు ఏమి చెప్పాలని అనుకున్నావు?” అని అడిగాడు.
అందుకు అతడు, “కొందరు యూదులు పౌలును మరింత వివరంగా విచారణ చేయాలనే వంకతో రేపు న్యాయసభకు అతన్ని పంపించమని మిమ్మల్ని విన్నవించుకొంటారు. అయితే మీరు వారికి అనుమతి ఇవ్వకండి, ఎందుకంటే సుమారు నలభై కన్నా ఎక్కువ మంది అతని కోసం పొంచి ఉన్నారు. పౌలును చంపే వరకు ఏమి తినకూడదని వారు ఒట్టు పెట్టుకొన్నారు. ఇప్పుడు వారు మీ దగ్గర అనుమతి కోసం ఎదురుచూస్తూ, సిద్ధంగా ఉన్నారు” అని చెప్పాడు.
ఆ అధిపతి, “ఈ సంగతిని నాకు చెప్పావని ఎవరికి చెప్పవద్దు” అని హెచ్చరించి ఆ యువకుడిని పంపించాడు.