మేము అక్కడ చాలా రోజులు ఉన్నప్పుడు, యూదయ ప్రాంతం నుండి అగబు అనే ప్రవక్త వచ్చాడు. అతడు మా దగ్గరకు వచ్చి, పౌలు నడికట్టును తీసుకుని దానితో తన చేతులను, కాళ్లను కట్టుకుని, “ ‘యెరూషలేములోని యూదా నాయకులు ఈ నడికట్టు కల వానిని ఈ విధంగా బంధించి యూదేతరుల చేతికి అప్పగిస్తారు’ అని పరిశుద్ధాత్మ చెప్తున్నాడు” అని అన్నాడు.
ఈ మాట విన్న తర్వాత మేము, అక్కడ కూడిన ప్రజలు పౌలును యెరూషలేముకు వెళ్లవద్దని బ్రతిమాలాము. అప్పుడు పౌలు, “ఎందుకు మీరు ఏడుస్తూ నా గుండెను బద్దలు చేస్తున్నారు? ప్రభువైన యేసు పేరు కోసం నేను బందీని అవ్వడమే కాదు యెరూషలేములో చనిపోడానికి కూడా సిద్ధంగా ఉన్నాను” అని చెప్పాడు. అతడు ఎంత చెప్పినా ఒప్పుకోలేదు కాబట్టి, “దేవుని చిత్తం జరుగును గాక” అని మౌనంగా ఉండిపోయాము.
ఆ తర్వాత, మేము యెరూషలేముకు బయలుదేరాము. కైసరయ ప్రాంతం నుండి మాతో కొందరు శిష్యులు వెంట వచ్చి, మొదటి శిష్యులలో ఒకడైన కుప్రకు చెందిన మ్నాసోను ఇంటికి తీసుకెళ్లి, అక్కడ మేము ఉండడానికి ఏర్పాట్లు చేశారు.
మేము యెరూషలేముకు చేరిన తర్వాత, సహోదరి సహోదరులు మమ్మల్ని సంతోషంగా చేర్చుకున్నారు. మరుసటిరోజు పౌలు మేము కలిసి యాకోబును చూడటానికి వెళ్లాము, అక్కడ సంఘ పెద్దలందరు ఉన్నారు. పౌలు వారిని పలకరించి, యూదేతరుల మధ్యలో తన పరిచర్య ద్వారా దేవుడు చేసిన కార్యాలన్నింటిని వివరంగా తెలియజేశాడు.
వారు వాటిని విని దేవుని స్తుతించారు. ఆ తర్వాత వారు పౌలుతో, “సహోదరుడా, చూడు, యూదులలో ఎన్ని వేలమంది విశ్వసించారో, వారందరు ధర్మశాస్త్రం కోసం ఆసక్తి కలిగి ఉన్నారు. యూదేతరుల మధ్యలో నివసిస్తున్న యూదులకు వారి పిల్లలకు సున్నతి చేయించవద్దని, మన ఆచారాల ప్రకారం జీవించవద్దని, మోషే ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టాలని నీవు బోధిస్తున్నావని వారు తెలియజేశారు. నీవు ఇక్కడ వచ్చావన్న సంగతి వారు ఖచ్చితంగా వింటారు. కాబట్టి మేము చెప్పినట్లు నీవు చేయాలి. అది ఏంటంటే, మాతో నలుగురు మ్రొక్కుబడి చేసుకొన్నవారు ఉన్నారు. వారిని తీసుకెళ్లి, వారి శుద్ధీకరణ సంస్కారంలో పాల్గొని, వారు తమ తల వెంట్రుకలను తీయించుకోవడానికి అయ్యే ఖర్చులను భరించు. అప్పుడు నీ గురించి తెలిసినదానిలో సత్యం లేదని, నీవు కూడా ధర్మశాస్త్రానికి లోబడే జీవిస్తున్నావని ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు. అయితే యూదేతరుల విశ్వాసులు, ‘విగ్రహాలకు అర్పించిన ఆహారాన్ని తినడం, రక్తం తినడం, గొంతును నులిమి చంపిన జంతువుల మాంసం తినడం, లైంగిక అనైతికత సంబంధాలను మానుకోవాలి’ అనే మా నిర్ణయాన్ని వారికి వ్రాసి తెలిపాం” అన్నారు.
మరుసటిరోజు పౌలు ఆ మనుష్యులను తీసుకెళ్లి వారితో తాను కూడా శుద్ధి చేసుకున్నాడు. శుద్ధీకరణ రోజులు పూర్తియైన తర్వాత అందరి కోసం కానుకలను చెల్లిస్తానని చెప్పడానికి అతడు దేవాలయంలోనికి వెళ్లాడు.