“తోటి ఇశ్రాయేలీయులారా, ఇది వినండి: మీ కోసం దేవుని నుండి అధికారం పొందిన నజరేయుడైన యేసు ద్వారా అద్భుతాలను, మహత్కార్యాలను, సూచకక్రియలను దేవుడే మీ మధ్యలో చేయించారని మీకు కూడ తెలుసు. దేవుడు తన భవిష్యత్ జ్ఞానాన్నిబట్టి నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం యేసు క్రీస్తును మీకు అప్పగించారు; అయితే మీరు, దుష్టుల సహాయంతో, ఆయనను సిలువకు మేకులు కొట్టి చంపారు. కానీ మరణం ఆయనను బంధించి ఉంచడం అసాధ్యం, కాబట్టి దేవుడు ఆయనను మరణ వేదన నుండి విడిపించి, మృతులలో నుండి లేపారు. దావీదు ఆయన గురించి ఇలా అన్నారు:
“ ‘ఎల్లప్పుడు నేను నా ఎదుట నా ప్రభువును చూస్తున్నాను.
నా ప్రభువు, నా కుడి ప్రక్కనే ఉన్నారు,
కాబట్టి నేను కదల్చబడను.
కాబట్టి నా హృదయం సంతోషించి, నా నాలుక ఆనందిస్తుంది;
నా శరీరం కూడా నిరీక్షణలో విశ్రమిస్తుంది,
ఎందుకంటే నీవు నా ఆత్మను మృతుల రాజ్యంలో విడిచిపెట్టరు,
మీ పరిశుద్ధుని కుళ్లిపోనీయరు.
మీరు నాకు జీవమార్గాలను తెలిపారు;
మీ సన్నిధిలోని ఆనందంతో నన్ను నింపుతారు.’
“తోటి ఇశ్రాయేలీయులారా, నేను మీతో నిస్సందేహంగా చెప్పగలను, మీ పితరుడైన దావీదు చనిపోయి పాతిపెట్టబడ్డాడు, అతని సమాధి ఇప్పటికీ మన మధ్య ఉంది. అతడు ఒక ప్రవక్త దేవుడు అతని సంతానంలో ఒకనిని అతని సింహాసనం మీద కూర్చోబెడతానని ఒట్టు పెట్టుకుని తనకు ప్రమాణం చేశాడని దావీదుకు తెలుసు. రాబోయేదాన్ని చూసిన ఆయన క్రీస్తు పునరుత్థానం గురించి మాట్లాడుతూ, ఆయన మృతుల రాజ్యంలో విడిచిపెట్టబడలేదని, ఆయన శరీరం కుళ్ళి పోవడం చూడలేదని చెప్పారు. దేవుడు యేసును జీవంతో లేపారు, దీనికి మేమంతా సాక్షులము. దేవుని కుడిచేతి వైపుకు ఎత్తబడి, తండ్రి చేసిన వాగ్దానం ప్రకారం పరిశుద్ధాత్మను పొందుకొని ఇప్పుడు మీరు చూస్తూ వింటున్న దానిని మీమీద కుమ్మరించారు. దావీదు పరలోకానికి ఎక్కి పోలేదు అయినా ఇలా చెప్పాడు,
“ ‘నేను నీ శత్రువులను
నీకు పాదపీఠంగా చేసే వరకు
“నీవు నా కుడి వైపున కూర్చోమని
ప్రభువు నా ప్రభువుతో చెప్పారు.” ’
“కాబట్టి ఇశ్రాయేలు ప్రజలందరు ఖచ్చితంగా తెలుసుకోవలసింది ఏంటంటే: మీరు సిలువ వేసిన ఈ యేసునే, దేవుడు ప్రభువుగా క్రీస్తుగా చేశారు.”
ప్రజలు ఈ మాటలు విని, మనస్సులో బాధపడి పేతురు, ఇతర అపొస్తలులతో, “సహోదరులారా, మేము ఏమి చేయాలి?” అని అన్నారు.
అందుకు పేతురు, “మీలో ప్రతి ఒక్కరు, మీ పాపాల క్షమాపణ కోసం పశ్చాత్తాపపడి, యేసు క్రీస్తు పేరట బాప్తిస్మం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరం పొందుకొంటారు. ఈ వాగ్దానం మీకు మీ పిల్లలకు దూరంగా ఉన్నవారందరికి అనగా, మన ప్రభువైన దేవుడు పిలిచే వారందరికి చెందుతుంది” అని వారితో చెప్పాడు.
ఇంకా అనేక రకాల మాటలతో పేతురు వారిని హెచ్చరించి, “ఈ వక్ర తరం నుండి మీరు రక్షణ పొందండి” అని వారికి విజ్ఞప్తి చేశాడు. అతని సందేశాన్ని అంగీకరించినవారు బాప్తిస్మం పొందుకున్నారు, ఆ రోజు సుమారుగా మూడువేలమంది వ్యక్తులు సంఘానికి చేర్చబడ్డారు.
వారు అపొస్తలులు చెప్పే బోధలకు లోబడి, వారి సహవాసంలో ఉండి, రొట్టె విరుచుటలో ప్రార్థనలో ఆసక్తితో కొనసాగుతున్నారు. అపొస్తలుల ద్వార జరిగిన అనేక అద్భుతాలు సూచకక్రియలను బట్టి ప్రతీ వ్యక్తికి భయం కలిగింది. విశ్వాసులందరు కలిసి ఉన్నారు, ప్రతిదీ ఉమ్మడిగా కలిగి ఉన్నారు. వారు తమ ఆస్తిపాస్తులను అమ్మి అవసరంలో ఉన్నవారికి ఇచ్చారు. వారందరు ప్రతిరోజు దేవాలయ ఆవరణంలో క్రమంగా కలుసుకొనేవారు. తమ ఇళ్ళలో అందరు కలిసి ఆనందంగా యథార్థ హృదయంతో రొట్టెను విరిచి తినేవారు. వారు దేవుని స్తుతిస్తూ, ప్రజలందరి అభిమానం పొందుకున్నారు. ప్రభువు ప్రతిదినం రక్షించబడుచున్న వారిని వారి సంఖ్యకు చేర్చారు.