అపొస్తలుల కార్యములు 10:24-33

అపొస్తలుల కార్యములు 10:24-33 OTSA

ఆ మరుసటిరోజు అతడు కైసరయ పట్టణం చేరాడు. కొర్నేలీ తన బంధువులను సన్నిహిత స్నేహితులను పిలిచి వీరి కోసం ఎదురు చూస్తున్నాడు. పేతురు ఆ ఇంట్లో ప్రవేశించగానే, కొర్నేలీ అతన్ని కలుసుకొని భక్తితో అతని పాదాల మీద పడి నమస్కారం చేశాడు. అయితే పేతురు, “లేచి నిలబడు, నేను కూడా మనిషినే” అని చెప్పి అతన్ని పైకి లేపాడు. పేతురు అతనితో మాట్లాడుతూ లోపలికి వచ్చినప్పుడు, అక్కడ చాలామంది వచ్చి ఉండడం చూశాడు. అతడు వారితో, “మీ అందరికి తెలిసినట్లే ఒక యూదుడు, యూదుడుకాని వ్యక్తితో సాంగత్యం చేయడం, వారిని కలవడం, యూదా నియమానికి విరుద్ధము. అయితే ఎవరినీ నేను అపవిత్రులని గాని నిషేధించబడిన వారని గాని పిలువకూడదని దేవుడు నాకు చూపించాడు. కాబట్టి నీవు నన్ను పిలిచినప్పుడు ఏ అభ్యంతరం చెప్పకుండా వచ్చాను. ఇప్పుడు మీరు నన్ను ఎందుకు పిలిచారో నాకు చెప్పండి?” అని అడిగాడు. అందుకు కొర్నేలీ, “మూడు రోజుల క్రితం ఇదే సమయంలో అనగా మధ్యాహ్నం సుమారు మూడు గంటలప్పుడు నేను నా ఇంట్లో ప్రార్థన చేస్తునప్పుడు అకస్మాత్తుగా మెరుస్తున్న వస్త్రాల్లో ఉన్న ఒక వ్యక్తి నా ఎదురుగా నిలబడి, నాతో, ‘కొర్నేలీ, దేవుడు నీ ప్రార్థనలను ఆలకించాడు నీవు పేదవారికి చేసిన దానధర్మాలను జ్ఞాపకం చేసుకున్నాడు. నీవు యొప్పే పట్టణంలో ఉన్న పేతురు అని పిలువబడే సీమోనును పిలిపించు. అతడు సముద్రపు ఒడ్డున ఉన్న సీమోను అనే చర్మకారుని ఇంట్లో అతిథిగా ఉన్నాడు’ అని నాతో చెప్పాడు. కాబట్టి నేను వెంటనే నిన్ను పిలిపించాను, నీవు మా మధ్యకు రావడం చాలా సంతోషము. ఇప్పుడు మేమందరం దేవుని సన్నిధిలో ఉండి దేవుడు నీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని వినడానికి చేరుకొన్నాం” అని చెప్పాడు.

అపొస్తలుల కార్యములు 10:24-33 కోసం వీడియో