అపొస్తలుల కార్యములు 10:1-18

అపొస్తలుల కార్యములు 10:1-18 OTSA

ఇటలీ దేశ సైనిక దళానికి శతాధిపతి యైన కొర్నేలీ అనే వ్యక్తి కైసరయ పట్టణంలో ఉన్నాడు. అతడు అతని కుటుంబమంతా దేవుని యందు భయభక్తులు కలిగినవారు; అవసరంలో ఉన్న ప్రజలకు ధారాళంగా దానధర్మాలు చేస్తూ క్రమంగా దేవునికి ప్రార్థన చేసేవాడు. ఒక రోజు మధ్యాహ్నం సుమారు మూడు గంటలప్పుడు అతనికి ఒక దర్శనం కలిగింది. ఒక దేవదూత ప్రత్యక్షమై, “కొర్నేలీ!” అని పిలువడం ఆ దర్శనంలో స్పష్టంగా కనబడింది. కొర్నేలీ భయంతో అతన్ని తేరి చూస్తూ, “ఏమిటి, ప్రభువా?” అని అడిగాడు. అప్పుడు ఆ దూత, “నీ ప్రార్థనలు పేదవారికి నీవు చేసిన దానధర్మాలు దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థ అర్పణగా చేరాయి. నీవు మనుష్యులను యొప్పే పట్టణానికి పంపి పేతురు అని పిలువబడే సీమోనును పిలిపించు. అతడు సముద్రపు ఒడ్డున ఉన్న సీమోను అనే చర్మకారుని ఇంట్లో ఉన్నాడు” అని చెప్పాడు. అతనితో మాట్లాడిన ఆ దేవదూత వెళ్లిపోయిన తర్వాత కొర్నేలీ తన సేవకులలో ఇద్దరిని, తన వ్యక్తిగత సేవలు చేసే దైవభక్తి గల ఒక సైనికుని పిలిచాడు. వారికి జరిగినదంతా చెప్పి యొప్పేకు పంపించాడు. వారు బయలుదేరి ప్రయాణమై పట్టణాన్ని చేరుకోబోతున్నప్పటికి మరుసటిరోజు సుమారు మధ్యాహ్న సమయంలో, పేతురు ప్రార్థన చేసుకోవడానికి ఇంటి పైకప్పుకు వెళ్లాడు. అతనికి చాలా ఆకలివేసి ఏమైనా తినాలని అనిపించింది, భోజనం సిద్ధం చేస్తుండగా అతడు స్వాప్నిక స్థితిలోనికి వెళ్లాడు. అప్పుడతడు పరలోకం తెరువబడి నాలుగు మూలలు పట్టుకోబడి భూమి మీదకు దింపబడుతున్న ఒక పెద్ద దుప్పటి వంటి దాన్ని చూశాడు. దానిలో నాలుగు కాళ్లున్న అన్ని రకాల జంతువులు, ప్రాకే ప్రాణులు పక్షులు ఉన్నాయి. అప్పుడు ఒక స్వరం అతనితో ఇలా అన్నది: “పేతురు, లేచి వాటిని చంపుకొని తిను.” అందుకు పేతురు, “లేదు, ప్రభువా! నేను అపరిశుభ్రమైనది అపవిత్రమైనది ఎప్పుడూ తినలేదు” అని జవాబిచ్చాడు. రెండవసారి ఆ స్వరం అతనితో, “దేవుడు పవిత్రపరచిన వాటిని నీవు అపవిత్రమని పిలువద్దు” అన్నది. ఈ విధంగా మూడుసార్లు జరిగింది, వెంటనే ఆ దుప్పటి తిరిగి ఆకాశానికి కొనిపోబడింది. పేతురు ఆ దర్శనానికి భావం ఏమిటని ఆశ్చర్యపడుతున్నప్పుడు, కొర్నేలీ పంపినవారు, సీమోను ఇల్లు ఎక్కడ ఉందో తెలుసుకొని దాని ద్వారం ముందు నిలబడ్డారు. ఇంటివారిని పిలిచి, పేతురు అనబడే సీమోను ఉండేది ఇక్కడేనా? అని అడిగారు.

అపొస్తలుల కార్యములు 10:1-18 కోసం వీడియో

Free Reading Plans and Devotionals related to అపొస్తలుల కార్యములు 10:1-18