అపొస్తలుల కార్యములు 1:1-11

అపొస్తలుల కార్యములు 1:1-11 OTSA

ఓ థెయోఫిలా, యేసు ఆరంభం నుండి ఆయన ఏర్పరచుకొన్న అపొస్తలులకు పరిశుద్ధాత్మ ద్వార సూచనలు ఇచ్చిన తర్వాత, పరలోకానికి ఆయన కొనిపోబడిన సమయం వరకు ఆయన ఏమేమి చేశారో ఏ విషయాలను బోధించారో వాటన్నిటిని గురించి నా మొదటి పుస్తకంలో నేను వ్రాశాను. అనగా, ఆయన హింసను పొందిన తర్వాత, తాను సజీవునిగా ఉన్నారని అనేక రుజువులతో తనను తాను వారికి నలభై రోజులు కనుపరచుకుంటూ దేవుని రాజ్యాన్ని గురించి బోధించారు. ఒక రోజు యేసు వారితో కలసి భోజనం చేస్తున్నప్పుడు ఆయన వారికి ఈ ఆజ్ఞ ఇచ్చారు: “మీరు యెరూషలేమును వదిలి వెళ్లకండి, నేను మీతో ముందే చెప్పినట్లు, నా తండ్రి వాగ్దానం చేసిన ఆ బహుమానాన్ని పొందుకొనే వరకు కనిపెడుతూ ఉండండి. ఎందుకంటే, యోహాను నీటితో బాప్తిస్మమిచ్చాడు, కాని కొన్ని రోజుల్లో మీరు పరిశుద్ధాత్మతో బాప్తిస్మం పొందుకొంటారు.” అప్పుడు ఆ అపొస్తలులు ఆయన చుట్టుచేరి, “ప్రభువా, ఇప్పుడు నీవు ఇశ్రాయేలు రాజ్యాన్ని తిరిగి నిర్మిస్తావా?” అని అడిగారు. అందుకు ఆయన వారితో, “తండ్రి తన అధికారంతో నిర్ణయించిన సమయాలను, కాలాలను తెలుసుకోవడం మీ పని కాదు. అయితే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకొంటారు. అప్పుడు మీరు యెరూషలేములో, సమస్త యూదయ, సమరయ ప్రాంతాల్లో, భూమి అంచుల వరకు నాకు సాక్షులుగా ఉంటారు” అన్నారు. ఈ మాటలను చెప్పిన తర్వాత, వారి కళ్ళ ముందే, ఆయన ఆరోహణమయ్యారు. అప్పుడు ఒక మేఘం వచ్చి వారికి కనబడకుండా ఆయనను కమ్ముకున్నది. ఆయన వెళ్తునప్పుడు వారు ఆకాశంవైపే తేరి చూస్తూ నిలబడ్డారు, అప్పుడు తెల్లని వస్త్రాలను ధరించుకొన్న ఇద్దరు వ్యక్తులు వారి దగ్గరకు వచ్చి, “గలిలయ వాసులారా, మీరు ఇక్కడ నిలబడి ఆకాశం వైపు ఎందుకు చూస్తున్నారు? మీ ముందు ఆరోహణమైన ఈ యేసే, ఏ విధంగా పరలోకానికి వెళ్లడం చూశారు, అదే విధంగా ఆయన తిరిగి వస్తారు” అని వారితో చెప్పారు.

అపొస్తలుల కార్యములు 1:1-11 కోసం వీడియో