2 సమూయేలు 17:1-14

2 సమూయేలు 17:1-14 OTSA

ఇంకా అహీతోపెలు అబ్షాలోముతో, “నేను పన్నెండువేలమంది సైనికులను ఎంపిక చేసుకుని ఈ రాత్రే రాజైన దావీదును వెంటాడడానికి బయలుదేరి వెళ్లనివ్వండి. అతడు అలసిపోయి బలహీనంగా ఉన్నప్పుడు నేను అతనిపై దాడిచేసి అతన్ని భయపెడతాను. అప్పుడు అతనితో ఉన్నవారంతా పారిపోతారు. నేను రాజును మాత్రమే చంపి, ప్రజలందరినీ నీ దగ్గరకు తీసుకువస్తాను. నీవు వెదకే మనిషి ప్రాణానికి బదులుగా ప్రజలందరు తిరిగి నీ దగ్గరకు వస్తారు. ప్రజలంతా క్షేమంగా ఉంటారు” అన్నాడు. ఈ మాట అబ్షాలోముకు ఇశ్రాయేలీయుల పెద్దలందరికి నచ్చింది. అప్పుడు అబ్షాలోము, “అర్కీయుడైన హూషైను పిలిపించు. అతడు చెప్పేది కూడా మనం విందాం” అన్నాడు. హూషై అబ్షాలోము దగ్గరకు వచ్చినప్పుడు, “అహీతోపెలు మాకు ఈ సలహా ఇచ్చాడు. అతడు చెప్పింది చేయాలా? ఒకవేళ వద్దంటే, నీ అభిప్రాయమేంటో చెప్పు” అన్నాడు. అందుకు హూషై అబ్షాలోముతో, “ఈసారి అహీతోపెలు ఇచ్చిన సలహా మంచిది కాదు. హూషై ఇంకా మాట్లాడుతూ, నీ తండ్రి గురించి అతని మనుష్యుల గురించి నీకు తెలుసు; వారు యుద్ధవీరులు, కూనలను పోగొట్టుకున్న అడవి ఎలుగుబంటిలా భయంకరులు. అంతేకాక నీ తండ్రి అనుభవజ్ఞుడైన యుద్ధవీరుడు; అతడు సైన్యంతో రాత్రి గడపడు. ఇప్పుడు కూడా అతడు గుహలోనో మరో స్థలంలోనో దాక్కొని ఉంటాడు. అతడు కాబట్టి నీ దళాల మీద మొదట దాడి చేయాల్సివస్తే, దాని గురించి విన్నవారందరు, ‘అబ్షాలోమును అనుసరించే దళాల మధ్య వధ జరిగింది’ అని అంటారు. అప్పుడు సింహపు గుండె లాంటి గుండె కలిగిన మహా ధైర్యవంతులైన సైనికులు కూడా భయంతో కరిగిపోతారు, ఎందుకంటే నీ తండ్రి గొప్ప యుద్ధవీరుడని అతనితో ఉన్నవారంతా ధైర్యవంతులని ఇశ్రాయేలీయులందరికి తెలుసు. “కాబట్టి నా సలహా ఏంటంటే, దాను నుండి బెయేర్షేబ వరకు సముద్రపు ఇసుకరేణువులంత అసంఖ్యాకంగా ఇశ్రాయేలీయులందరు నీ దగ్గర సమకూడాలి. నీవే స్వయంగా వారిని యుద్ధంలో నడిపించాలి. అప్పుడతడు ఎక్కడ కనబడినా మనం అతనిపై దాడి చేద్దాం; నేల మీద మంచు పడినట్లుగా మనం అతని మీద దాడి చేస్తే అతడు గాని అతని మనుష్యులు కాని ప్రాణాలతో తప్పించుకోలేరు. ఒకవేళ అతడు ఏదైన పట్టణానికి వెళ్తే, ఇశ్రాయేలీయులందరు ఆ పట్టణానికి త్రాళ్లు తీసుకువచ్చి, అక్కడ చిన్న రాయి కూడా మిగులకుండా ఆ పట్టణాన్ని లోయలోకి లాగివేస్తారు” అన్నాడు. అబ్షాలోము ఇశ్రాయేలీయులందరు అది విని, “అర్కీయుడైన హూషై చెప్పిన సలహా అహీతోపెలు చెప్పిన దానికంటే బాగుంది” అన్నారు. ఎందుకంటే యెహోవా అబ్షాలోము మీదికి ఆపద రప్పించడానికి అహీతోపెలు చెప్పిన మంచి ఆలోచనను భగ్నం చేయాలని నిశ్చయించుకున్నారు.