2 కొరింథీ పత్రిక 11:1-15

2 కొరింథీ పత్రిక 11:1-15 OTSA

నేను కొంత అవివేకంగా మాట్లాడినా మీరు సహించాలని ఆశిస్తున్నాను. అవును, దయచేసి నన్ను సహించండి! దైవికమైన ఆసక్తిని మీ పట్ల నేను కలిగి ఉన్నాను. ఎందుకంటే, మిమ్మల్ని నేను క్రీస్తు అనే ఏకైక భర్తకు ప్రధానం చేశాను, కాబట్టి పవిత్రమైన కన్యగా మిమ్మల్ని ఆయనకు అప్పగించాలి. అయితే, సర్పం తన కుయుక్తితో హవ్వను మోసగించినట్లు క్రీస్తులో మీకున్న నిజాయితీ, పవిత్రత నుండి ఏదో ఒక విధంగా మీ మనస్సులు తొలగిపోతాయేమోనని నేను భయపడుతున్నాను. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మేము ప్రకటించిన యేసును గాక వేరొక యేసును ప్రకటించినా, లేదా మీరు పొందిన ఆత్మకు విరుద్ధమైన వేరొక ఆత్మను మీరు పొందినా, లేదా మీరు అంగీకరించింది కాకుండా వేరొక సువార్తను అంగీకరించినా మీరు సుళువుగానే సహిస్తున్నారు. “ఈ గొప్ప అపొస్తలుల” కంటే నేను ఏమాత్రం తక్కువ కాదని నేను అనుకుంటున్నాను. మాట్లాడడంలో నాకు నేర్పు లేకపోవచ్చు కాని జ్ఞానంలో కాదు. అన్ని విధాలుగా మేము దీన్ని మీకు పూర్తిగా స్పష్టం చేశాము. దేవుని సువార్తను మీకు ఉచితంగా బోధించి, మిమ్మల్ని గొప్పవారిని చేయడానికి నన్ను నేను తగ్గించుకొని పాపం చేశానా? మీకు నేను సేవ చేయడానికి ఇతర సంఘాల నుండి సహాయం పొంది వారిని దోచుకున్నాను. అంతేకాక నేను మీతో ఉన్నప్పుడు నాకు సహాయం అవసరమైతే నేను ఎవరికి భారంగా లేను, ఎందుకంటే, మాసిదోనియా నుండి వచ్చిన సహోదరులే నాకు అవసరమైనవన్నీ అందించారు. నేను మీకు భారం కాకుండా ఎలా ఉన్నానో ఇకముందు కూడా అలాగే ఉంటాను. నాలో క్రీస్తు సత్యం ఉన్నందుకు, అకాయ ప్రాంతాల్లో నేనిలా గర్వపడకుండ ఎవరు ఆపలేరు. ఎందుకు? మీపై నాకు ప్రేమ లేదా? ఉందని దేవునికి తెలుసు! గర్వించడానికి కారణం వెదికేవారు తాము గర్వించే వాటిలో మాతో సమానంగా ఉన్నామని వారు ఎంచుకోవడానికి అవకాశం లేకుండా చేయడానికి ఇప్పుడు నేను ఏమి చేస్తున్నానో అదే చేయడం కొనసాగిస్తాను. అలాంటివారు అబద్ధ అపొస్తలులు, మోసపూరితమైన పనివారు, క్రీస్తు అపొస్తలుల్లా వేషం వేసుకున్నవారు. ఇందులో ఆశ్చర్యం ఏమి లేదు, సాతాను కూడా వెలుగు దూత వేషం వేసుకున్నాడు. కాబట్టి వాని సేవకులు కూడా నీతి సేవకుల్లా మారువేషం వేసుకోవడంలో వింత లేదు. వారి క్రియలకు తగిన అంతం వారికి ఉంటుంది.