కాబట్టి దావీదు, అతని మనుష్యులు దాదాపు ఆరువందలమంది కెయీలాను విడిచి ఒక చోటు నుండి మరొక చోటికి వెళ్లారు. దావీదు కెయీలా నుండి పారిపోయాడని సౌలుకు తెలిసి అక్కడికి వెళ్లలేదు. అయితే దావీదు అరణ్యంలో, బలమైన కోటలలో, జీఫు అడవి కొండల్లో నివసించాడు. ప్రతిరోజు సౌలు అతన్ని వెదికాడు కాని దేవుడు సౌలు చేతికి అతని అప్పగించలేదు. తన ప్రాణం తీయడానికి సౌలు బయలుదేరాడని తెలుసుకుని దావీదు జీఫు ఎడారిలోని హోరేషులో ఉన్నాడు. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను హోరేషులో ఉన్న దావీదు దగ్గరకు వచ్చి దేవుని బట్టి అతన్ని బలపరుస్తూ, “భయపడకు, నా తండ్రియైన సౌలు నిన్ను పట్టుకోలేడు నీవు ఇశ్రాయేలీయులకు రాజవుతావు; నీ తర్వాతి స్థానంలో నేను ఉంటాను. ఇది నా తండ్రియైన సౌలుకు కూడా తెలుసు” అని చెప్పాడు. వీరిద్దరు యెహోవా ఎదుట నిబంధన చేసుకున్న తర్వాత యోనాతాను ఇంటికి వెళ్లిపోయాడు కాని దావీదు హోరేషులోనే ఉన్నాడు. జీఫీయులు బయలుదేరి గిబియాలో ఉన్న సౌలు దగ్గరకు వచ్చి, “యెషీమోనుకు దక్షిణంగా ఉన్న హకీలా కొండమీద హోరేషు బలమైన కోటల దగ్గర మా మధ్య దావీదు దాక్కున్నాడా హోరేషు కొండ దగ్గర మా మధ్య దావీదు దాక్కున్నాడు? రాజా, మీకు ఇష్టమైతే మాతో రండి, రాజైన మీ చేతికి అతన్ని అప్పగించే బాధ్యత మాది” అన్నారు. అప్పుడు సౌలు వారితో, “మీకు నాపై ఉన్న కనికరాన్ని బట్టి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. మీరు వెళ్లి ఇంకా సమాచారం తెలుసుకోండి. దావీదు ఎక్కడ ఉంటున్నాడో, అతన్ని ఎవరు చూశారో తెలుసుకోండి. అతడు చాలా చాకచక్యంగా వ్యవహరిస్తున్నాడని నాకు తెలిసింది. అతడు దాక్కున్న స్థలాలన్నిటిని కనిపెట్టి ఆ వివరాలు తీసుకుని నా దగ్గరకు మళ్ళీ రండి. అప్పుడు నేను మీతో కూడా వచ్చి అతడు దేశంలో ఎక్కడ ఉన్నా యూదా వంశస్థుల అందరిలో నేను అతన్ని వెదికి పట్టుకుంటాను” అన్నాడు. వారు బయలుదేరి సౌలు కంటే ముందు జీఫుకు తిరిగి వెళ్లారు. దావీదు అతని ప్రజలు యెషీమోనుకు దక్షిణాన ఉన్న అరాబాలో మాయోను ఎడారిలో ఉన్నారు. సౌలు అతని మనుష్యులు తనను వెదకడం మొదలుపెట్టారని దావీదుకు తెలిసినప్పుడు కొండ శిఖరం దిగి మాయోను ఎడారిలో నివసించాడు. సౌలు అది విని దావీదును తరుముతూ మాయోను ఎడారిలోనికి వెళ్లాడు. అయితే పర్వతానికి ఒకవైపు సౌలు, మరోవైపు దావీదు అతని ప్రజలు వెళ్తుండగా దావీదు సౌలు నుండి తప్పించుకోవాలని తొందరపడుతున్నాడు. సౌలు అతని ప్రజలు దావీదును అతని ప్రజలను పట్టుకోవాలని వారిని చుట్టుముడుతున్నారు. అప్పుడు ఒక దూత సౌలు దగ్గరకు వచ్చి, “త్వరగా రా, దేశం మీదకి ఫిలిష్తీయులు దండెత్తి వచ్చారు” అని చెప్పాడు. సౌలు దావీదును తరమడం మాని ఫిలిష్తీయులను ఎదుర్కోడానికి వెనుకకు తిరిగి వెళ్లాడు. కాబట్టి ఆ స్థలానికి సెలా హమ్మలెకోతు అని ఆ పేరు పెట్టారు. తర్వాత దావీదు అక్కడినుండి బయలుదేరి ఎన్-గేదీకి వచ్చి కొండ ప్రాంతంలో నివసించాడు.
చదువండి 1 సమూయేలు 23
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: 1 సమూయేలు 23:13-29
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు