1 సమూయేలు 20:1-17

1 సమూయేలు 20:1-17 OTSA

తర్వాత దావీదు రామాలోని నాయోతు నుండి పారిపోయి యోనాతాను దగ్గరకు వచ్చి, “నేనేమి చేశాను? నా నేరమేంటి? నా ప్రాణం తీయడానికి వెదికేంతగా నీ తండ్రి పట్ల నేను చేసిన పాపమేంటి?” అని అడిగాడు. అందుకు యోనాతాను, “నీవలా ఎప్పుడూ మాట్లాడకు! నా తండ్రి చిన్న పనైనా పెద్ద పనైనా నాకు చెప్పకుండా చేయడు. నా తండ్రి ఈ విషయం నా దగ్గర ఎందుకు దాస్తాడు?” అన్నాడు. అప్పుడు దావీదు, “నేను నీ దయ పొందానని నీ తండ్రికి ఖచ్చితంగా తెలుసు కాబట్టి అతడు ‘యోనాతాను బాధపడతాడు కాబట్టి అతనికి తెలియకూడదు’ అని అనుకుని ఉంటాడు. అయితే సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, నిజంగా నాకు మరణానికి మధ్య ఒక్క అడుగు మాత్రమే ఉంది” అని ప్రమాణం చేసి చెప్పాడు. యోనాతాను, “నీకోసం నేను ఏం చేయాలో చెప్పు అది నేను చేస్తాను” అని దావీదుతో చెప్పాడు. అందుకు దావీదు యోనాతానుతో, “రేపు అమావాస్య, అప్పుడు నేను తప్పకుండా రాజుతో పాటు కలిసి భోజనం చేయాలి; కాని ఎల్లుండి సాయంత్రం వరకు పొలంలో దాక్కోడానికి నాకు అనుమతి ఇవ్వు. నీ తండ్రీ నేను లేనని గమనించినప్పుడు నీవు అతనితో, ‘దావీదు వంశంవారు ప్రతి సంవత్సరం బలి అర్పించడం ఆనవాయితీగా వస్తుంది కాబట్టి అతడు తన ఊరైన బేత్లెహేముకు వెళ్లడానికి నా అనుమతి కోసం నన్ను బ్రతిమాలాడు’ అని చెప్పు. అప్పుడు అతడు, ‘అలాగే’ అని చెప్తే నీ సేవకుడనైన నేను క్షేమము. కానీ ఒకవేళ అతడు నా మీద తీవ్రంగా కోపపడితే అతడు నాకు హాని చేసే ఉద్దేశం కలిగి ఉన్నట్లు నీవు తెలుసుకుంటావు. నీ దాసుడైన నా మీద దయ చూపించు, ఏంటంటే యెహోవా ఎదుట నీతో నిబంధన చేయడానికి నీవు నీ సేవకుడైన నన్ను రప్పించావు. నన్ను నీ తండ్రి చేతికి ఎందుకు అప్పగిస్తావు? నాలో తప్పు ఉంటే నీవే నన్ను చంపు!” అన్నాడు. యోనాతాను, “అలా ఎప్పుడూ అనవద్దు. నా తండ్రి నీకు హాని చేయాలని చూస్తున్నట్టు నాకు తెలిస్తే నీతో చెప్పకుండా ఉంటానా?” అన్నాడు. అందుకు దావీదు యోనాతానును, “నీ తండ్రి నీతో కఠినంగా మాట్లాడితే దానిని నాకు ఎవరు చెప్తారు?” అని అడిగాడు. యోనాతాను దావీదుతో, “పొలంలోనికి వెళ్దాం రా” అన్నప్పుడు ఇద్దరు కలిసి పొలంలోనికి వెళ్లారు. తర్వాత యోనాతాను దావీదుతో, “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సాక్షి, రేపుగాని ఎల్లుండి గాని ఈ సమయానికి నా తండ్రిని కలుసుకుంటాను. అతడు నీ పట్ల సానుకూలంగా ఉంటే ఆ విషయాన్ని నీకు తెలియచేయకుండా ఉంటానా? అయితే నా తండ్రి నీకు హాని చేసే ఉద్దేశం కలిగి ఉన్నాడని నాకు తెలిసి కూడా నీకు చెప్పి నిన్ను క్షేమంగా పంపించకపోతే యెహోవా యోనాతానుకు గొప్ప హాని కలిగించును గాక. యెహోవా నా తండ్రికి తోడుగా ఉన్నట్లు నీకు కూడా తోడుగా ఉండును గాక. అయితే నేనింకా బ్రతికి ఉంటే నేను చనిపోకుండా యెహోవా దయ చూపినట్లు నాపై దయ చూపించు. యెహోవా దావీదు శత్రువులలో ఒక్కరిని కూడా భూమి మీద నిలువకుండా నిర్మూలం చేసిన తర్వాత కూడా నీవు నా సంతానం పట్ల దయ చూపించకపోతే యెహోవా నిన్ను విడిచిపెడతారు” అన్నాడు. “యెహోవా దావీదు యొక్క శత్రువులు లెక్క అప్పగించేలా చేయును గాక” అని చెప్తూ యోనాతాను దావీదు కుటుంబంతో నిబంధన చేశాడు. యోనాతాను దావీదును తన ప్రాణస్నేహితునిగా ప్రేమించాడు కాబట్టి తనకున్న ప్రేమను బట్టి దావీదు చేత మరల ప్రమాణం చేయించాడు.