1 సమూయేలు 1:7-20

1 సమూయేలు 1:7-20 OTSA

ఇది ఏటేటా కొనసాగింది. హన్నా యెహోవా మందిరానికి వెళ్లినప్పుడెల్లా, ఆమె ఏడుస్తూ తినడం మానివేసేలా పెనిన్నా ఆమెను రెచ్చగొట్టేది. ఆమె భర్త ఎల్కానా ఆమెతో, “హన్నా, ఎందుకు ఏడుస్తున్నావు? నీవెందుకు తినడం లేదు? నీవెందుకు క్రుంగిపోతున్నావు? నీకు పదిమంది కుమారుల కంటే నేను ఎక్కువ కాదా?” అని అన్నాడు. ఒకసారి వారు షిలోహులో భోజనం చేసిన తర్వాత హన్నా లేచి నిలబడింది. అప్పుడు యాజకుడైన ఏలీ యెహోవా ఆలయ గుమ్మం దగ్గర తన కుర్చీపై కూర్చున్నాడు. హన్నా తీవ్ర వేదనలో ఏడుస్తూ యెహోవాకు ప్రార్థించింది. ఆమె, “సైన్యాల యెహోవా, మీరు మీ సేవకురాలినైన కష్టాలను చూసి నన్ను గుర్తుంచుకుని, మీ సేవకురాలినైన నన్ను మరచిపోకుండా నాకు ఒక కుమారున్ని ఇస్తే, అతడు బ్రతికే దినాలన్ని యెహోవాకే ఇస్తాను, అతని తలపై క్షౌరపుకత్తి ఎప్పుడూ ఉపయోగించబడదు” అని అంటూ ఒక మ్రొక్కుబడి చేసింది. ఆమె యెహోవాకు ప్రార్థిస్తూ ఉండగా, ఏలీ ఆమె నోటిని గమనించాడు. హన్నా తన హృదయంలో ప్రార్థన చేస్తోంది, ఆమె పెదవులు కదులుతున్నాయి కానీ ఆమె స్వరం వినబడలేదు. ఏలీ ఆమె త్రాగి ఉందని భావించి, ఏలీ ఆమెతో, “ఎంతకాలం నీవు మత్తులో ఉంటావు? నీ ద్రాక్షరసాన్ని దూరం పెట్టు” అన్నాడు. అందుకు హన్నా, “అలా కాదు, నా ప్రభువా, నేను చాలా బాధలో ఉన్నాను. నేను ద్రాక్షరసం గాని మద్యం గాని త్రాగలేదు; నేను నా ఆత్మను యెహోవా దగ్గర క్రుమ్మరిస్తున్నాను. నీ సేవకురాలిని చెడ్డదానిగా భావించవద్దు; నేను చాలా వేదనతో దుఃఖంతో ఇక్కడ ప్రార్థన చేస్తున్నాను” అన్నది. అందుకు ఏలీ, “నీవు సమాధానంగా వెళ్లు, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసికొన్న మనవిని ఆయన నీకు దయచేయును గాక” అని ఆమెతో చెప్పాడు. ఆమె అతనితో, “నీ దాసురాలు నీ దయ పొందును గాక” అన్నది. తర్వాత ఆమె తన దారిన వెళ్లి భోజనం చేసింది; ఆ రోజు నుండి ఆమె ఎన్నడు దుఃఖపడుతూ కనబడలేదు. మరుసటిరోజు తెల్లవారుజామున వారు లేచి యెహోవా ఎదుట ఆరాధించి రామాలో ఉన్న తమ ఇంటికి తిరిగి వెళ్లారు. ఎల్కానా తన భార్యయైన హన్నాను లైంగికంగా కలుసుకున్నప్పుడు యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకున్నారు. అలా కొంతకాలం గడిచాక హన్నా గర్భవతియై ఒక కుమారుని కన్నది. “నేను అతని కోసం యెహోవాను అడిగాను” అని అంటూ ఆమె అతనికి సమూయేలు అని పేరు పెట్టింది.

Read 1 సమూయేలు 1