రామతాయిముకు చెందిన ఒక వ్యక్తి ఉండేవాడు, అతడు ఎఫ్రాయిం కొండ సీమలోని ఒక సూఫీయుడు, అతని పేరు ఎల్కానా, అతని తండ్రి యెరోహాము. యెరోహాము ఎలీహు కుమారుడు, ఎలీహు తోహు కుమారుడు. తోహు ఎఫ్రాయిమీయుడైన సూఫు కుమారుడు. అతనికి ఇద్దరు భార్యలు; ఒకరు హన్నా మరొకరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు ఉన్నారు, కానీ హన్నాకు పిల్లలు లేరు.
ఏలీ ఇద్దరు కుమారులైన హొఫ్నీ, ఫీనెహాసు యెహోవా యాజకులుగా ఉన్న షిలోహులో సైన్యాల యెహోవాను ఆరాధించడానికి, బలి అర్పించడానికి అతడు తన పట్టణం నుండి ప్రతి సంవత్సరం వెళ్లేవాడు. ఎల్కానా బలి అర్పించే రోజు వచ్చినప్పుడెల్లా, అతడు తన భార్య పెనిన్నాకు, ఆమె కుమారులు, కుమార్తెలందరికి మాంసంలో భాగాలను ఇచ్చేవాడు. అయితే అతడు హన్నాను ప్రేమించాడు కాబట్టి ఆమెకు రెండంతలు ఇస్తూ వచ్చాడు, యెహోవా ఆమె గర్భాన్ని మూసివేశారు. యెహోవా ఆమెకు పిల్లలు పుట్టకుండా చేశారు, కాబట్టి పెనిన్నా హన్నాకు చిరాకు కలిగించాలని ఎత్తిపొడుపు మాటలతో రెచ్చగొట్టేది. ఇది ఏటేటా కొనసాగింది. హన్నా యెహోవా మందిరానికి వెళ్లినప్పుడెల్లా, ఆమె ఏడుస్తూ తినడం మానివేసేలా పెనిన్నా ఆమెను రెచ్చగొట్టేది. ఆమె భర్త ఎల్కానా ఆమెతో, “హన్నా, ఎందుకు ఏడుస్తున్నావు? నీవెందుకు తినడం లేదు? నీవెందుకు క్రుంగిపోతున్నావు? నీకు పదిమంది కుమారుల కంటే నేను ఎక్కువ కాదా?” అని అన్నాడు.
ఒకసారి వారు షిలోహులో భోజనం చేసిన తర్వాత హన్నా లేచి నిలబడింది. అప్పుడు యాజకుడైన ఏలీ యెహోవా ఆలయ గుమ్మం దగ్గర తన కుర్చీపై కూర్చున్నాడు. హన్నా తీవ్ర వేదనలో ఏడుస్తూ యెహోవాకు ప్రార్థించింది. ఆమె, “సైన్యాల యెహోవా, మీరు మీ సేవకురాలినైన కష్టాలను చూసి నన్ను గుర్తుంచుకుని, మీ సేవకురాలినైన నన్ను మరచిపోకుండా నాకు ఒక కుమారున్ని ఇస్తే, అతడు బ్రతికే దినాలన్ని యెహోవాకే ఇస్తాను, అతని తలపై క్షౌరపుకత్తి ఎప్పుడూ ఉపయోగించబడదు” అని అంటూ ఒక మ్రొక్కుబడి చేసింది.
ఆమె యెహోవాకు ప్రార్థిస్తూ ఉండగా, ఏలీ ఆమె నోటిని గమనించాడు. హన్నా తన హృదయంలో ప్రార్థన చేస్తోంది, ఆమె పెదవులు కదులుతున్నాయి కానీ ఆమె స్వరం వినబడలేదు. ఏలీ ఆమె త్రాగి ఉందని భావించి, ఏలీ ఆమెతో, “ఎంతకాలం నీవు మత్తులో ఉంటావు? నీ ద్రాక్షరసాన్ని దూరం పెట్టు” అన్నాడు.
అందుకు హన్నా, “అలా కాదు, నా ప్రభువా, నేను చాలా బాధలో ఉన్నాను. నేను ద్రాక్షరసం గాని మద్యం గాని త్రాగలేదు; నేను నా ఆత్మను యెహోవా దగ్గర క్రుమ్మరిస్తున్నాను. నీ సేవకురాలిని చెడ్డదానిగా భావించవద్దు; నేను చాలా వేదనతో దుఃఖంతో ఇక్కడ ప్రార్థన చేస్తున్నాను” అన్నది.
అందుకు ఏలీ, “నీవు సమాధానంగా వెళ్లు, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసికొన్న మనవిని ఆయన నీకు దయచేయును గాక” అని ఆమెతో చెప్పాడు.
ఆమె అతనితో, “నీ దాసురాలు నీ దయ పొందును గాక” అన్నది. తర్వాత ఆమె తన దారిన వెళ్లి భోజనం చేసింది; ఆ రోజు నుండి ఆమె ఎన్నడు దుఃఖపడుతూ కనబడలేదు.
మరుసటిరోజు తెల్లవారుజామున వారు లేచి యెహోవా ఎదుట ఆరాధించి రామాలో ఉన్న తమ ఇంటికి తిరిగి వెళ్లారు. ఎల్కానా తన భార్యయైన హన్నాను లైంగికంగా కలుసుకున్నప్పుడు యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకున్నారు. అలా కొంతకాలం గడిచాక హన్నా గర్భవతియై ఒక కుమారుని కన్నది. “నేను అతని కోసం యెహోవాను అడిగాను” అని అంటూ ఆమె అతనికి సమూయేలు అని పేరు పెట్టింది.
ఆమె భర్త ఎల్కానా తన కుటుంబ సభ్యులందరితో కలిసి యెహోవాకు వార్షిక బలిని అర్పించడానికి, తన మ్రొక్కుబడిని చెల్లించడానికి వెళ్లినప్పుడు, హన్నా వెళ్లలేదు. ఆమె తన భర్తతో ఇలా చెప్పింది: “బాలుడు పాలు విడిచిన తర్వాత, నేను అతన్ని తీసుకెళ్లి యెహోవా ముందు ఉంచుతాను, ఇక అతడు ఎప్పుడూ అక్కడే ఉంటాడు.”
“నీకు ఏది మంచిదో అది చేయి, వానిని పాలు మాన్పించేవరకు నీవు ఇక్కడే ఉండు; యెహోవా తన మాట నెరవేర్చును గాక” అని ఆమె భర్తయైన ఎల్కానా ఆమెతో చెప్పాడు. కాబట్టి ఆ స్త్రీ తన కుమారుని పాలు మాన్పించేవరకు ఇంట్లోనే ఉండి వానిని పోషించింది.
వాడు పాలు విడిచిన తర్వాత, వాడు చిన్నవాడిగా ఉండగానే ఆమె తనతో పాటు మూడు సంవత్సరాల ఎద్దును, ఒక ఏఫా పిండిని, ద్రాక్షతిత్తిని తీసుకుని షిలోహులో ఉన్న యెహోవా మందిరానికి తీసుకెళ్లింది. ఎద్దును బలి అర్పించిన తర్వాత, వారు ఆ బాలున్ని ఏలీ దగ్గరకు తీసుకెళ్లి, ఆమె అతనితో, “నా ప్రభువా, నన్ను క్షమించండి. మీ జీవం తోడు ఇక్కడ మీ ప్రక్కన నిలబడి యెహోవాకు ప్రార్థించిన స్త్రీని నేనే. నేను ఈ బిడ్డ కోసం ప్రార్థించాను, నేను యెహోవాను ఏమి అడిగానో, ఆయన నాకు అదే ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు నేను ఈ బిడ్డను తిరిగి యెహోవాకు ఇస్తున్నాను. వాడు జీవించినంత కాలం యెహోవాకు ప్రతిష్ఠితుడై ఉంటాడు” అని చెప్పింది. అప్పుడు ఆ చిన్నవాడు అక్కడే యెహోవాను ఆరాధించాడు.