1 రాజులు 3:5-15

1 రాజులు 3:5-15 OTSA

గిబియోనులో రాత్రివేళ కలలో యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై, “నేను నీకు ఏమివ్వాలో అడుగు” అన్నారు. సొలొమోను జవాబిస్తూ ఇలా అన్నాడు, “మీ దాసుడు, నా తండ్రియైన దావీదు మీ పట్ల నమ్మకంగా, నీతి నిజాయితీ కలిగి ఉండేవాడు కాబట్టి మీరు అతనిపై ఎంతో దయను చూపించారు. మీరు అదే గొప్ప కనికరాన్ని తన పట్ల కొనసాగిస్తూ, ఈ రోజు అతని సింహాసనం మీద అతనికి కుమారుని కూర్చోబెట్టారు. “ఇప్పుడు యెహోవా, నా దేవా! నా తండ్రియైన దావీదుకు బదులుగా మీరు మీ దాసుడనైన నన్ను రాజుగా నియమించారు. అయితే నేను చిన్న బాలున్ని, నా విధులు ఎలా నిర్వర్తించాలో నాకు తెలియదు. మీ దాసుడనైన నేను మీరు ఎన్నుకున్న మీ ప్రజలమధ్య ఉన్నాను, వారు గొప్ప ప్రజలు, లెక్కించలేనంత ఎక్కువగా ఉన్నారు. కాబట్టి మీ ప్రజలను పాలించడానికి, మంచి చెడ్డల భేదం తెలుసుకోవడానికి వివేచన హృదయం మీ దాసునికి ఇవ్వండి. ఎందుకంటే, మీ గొప్ప ప్రజలైన వీరిని ఎవరు పరిపాలించగలరు?” సొలొమోను యొక్క ఈ మనవి ప్రభువుకు నచ్చింది. కాబట్టి దేవుడు అతనితో ఇలా అన్నారు, “నీవు నీకోసం దీర్ఘాయువును గాని, ధనాన్ని గాని, నీ శత్రువుల చావును గాని అడగకుండా న్యాయంగా పరిపాలించడానికి వివేచనను అడిగావు కాబట్టి, నీవు అడిగింది నేను ఇస్తాను. నేను నీకు జ్ఞానం కలిగిన వివేచన హృదయాన్ని ఇస్తాను. నీలాంటి వారు నీకంటే ముందు ఎవరూ లేరు, నీ తర్వాత ఎవరూ ఉండరు. అంతేకాక నీవు అడగని ఐశ్వర్యాన్ని ఘనతను నీకిస్తాను. తద్వారా నీ జీవితకాలమంతా రాజులలో నీకు ఎవరూ సాటి ఉండరు. నీ తండ్రియైన దావీదులా నీవు నా మార్గాన్ని అనుసరిస్తూ, నా శాసనాలను, ఆజ్ఞలను పాటిస్తే, నేను నీకు దీర్ఘాయువు ఇస్తాను.” తర్వాత సొలొమోను మేల్కొని, అది కల అని గ్రహించాడు. అతడు యెరూషలేముకు తిరిగివెళ్లి, యెహోవా నిబంధన మందసం ఎదుట నిలబడి, దహనబలులు, సమాధానబలులు అర్పించాడు. తర్వాత తన సేవకులందరికి విందు చేశాడు.

Read 1 రాజులు 3