1 రాజులు 19:15-21

1 రాజులు 19:15-21 OTSA

అప్పుడు యెహోవా అతనితో, “నీవు వచ్చిన దారిలోనే తిరిగి వెళ్లు, దమస్కు ఎడారికి వెళ్లు. అక్కడికి వెళ్లాక, హజాయేలును అరాము మీద రాజుగా అభిషేకించు. తర్వాత ఇశ్రాయేలు మీద నిమ్షీ కుమారుడైన యెహును రాజుగా, ఆబేల్-మెహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాను నీ తర్వాత ప్రవక్తగా అభిషేకించు. హజాయేలు ఖడ్గం నుండి తప్పించుకునే వారిని యెహు చంపుతాడు, యెహు ఖడ్గం నుండి తప్పించుకునే వారిని ఎలీషా చంపుతాడు. అయినా ఇశ్రాయేలులో బయలుకు మోకరించని, వాన్ని ముద్దుపెట్టుకోని ఏడువేలమందిని నా కోసం ప్రత్యేకంగా ఉంచాను” అని చెప్పారు. కాబట్టి ఏలీయా అక్కడినుండి వెళ్లి, షాపాతు కుమారుడైన ఎలీషాను కనుగొన్నాడు. ఎలీషా పన్నెండు జతల ఎడ్లతో పొలం దున్నిస్తూ స్వయంగా అతడు పన్నెండవ జతను నడుపుతూ ఉన్నప్పుడు, ఏలీయా అతని దగ్గరకు వెళ్లి తన దుప్పటి తీసి అతని మీద వేశాడు. అప్పుడు ఎలీషా ఎడ్లను విడిచిపెట్టి ఏలీయా వెంబడి పరుగెత్తి, “నేను వెళ్లి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని వీడ్కోలు చెప్పి మీ వెంట వస్తాను” అని అన్నాడు. అందుకు ఏలీయా, “వెనుకకు వెళ్లు. కాని నేను నీకు చేసిన దాని గురించి ఆలోచించు” అన్నాడు. కాబట్టి ఎలీషా అతన్ని విడిచి వెనుకకు వెళ్లి ఆ జత ఎడ్లను వధించి వాటి మాంసాన్ని కాడి మ్రానులతో వంట చేసి ప్రజలకు వడ్డించాడు. వారు తినిన తర్వాత అతడు లేచి ఏలీయా వెంట వెళ్లి అతని సేవకుడయ్యాడు.