ఓబద్యా అహాబును కలుసుకోడానికి వెళ్లి ఈ విషయం తెలియజేయగా అహాబు ఏలీయాను కలుసుకోడానికి వెళ్లాడు. అహాబు ఏలీయాను చూడగానే అతనితో, “ఇశ్రాయేలును కష్టపెట్టేవాడివి నీవే గదా?” అన్నాడు.
అందుకు ఏలీయా, “నేను కాదు; నీవు, నీ తండ్రి కుటుంబం యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను తిరస్కరించి, బయలును అనుసరించి మీరే ఇశ్రాయేలును కష్టపెట్టారు. ఇప్పుడు నీవు ఇశ్రాయేలీయులందరిని కర్మెలు పర్వతం మీద నన్ను కలవమని పిలిపించు. యెజెబెలు బల్ల దగ్గర తినే నాలుగు వందల యాభై బయలు ప్రవక్తలను, నాలుగు వందల అషేరా ప్రవక్తలను కూడా రమ్మను” అని జవాబిచ్చాడు.
కాబట్టి అహాబు ఇశ్రాయేలు ప్రజలందరినీ పిలిపించాడు. ఆ ప్రవక్తలను కూడా కర్మెలు పర్వతం మీద సమావేశపరిచాడు. ఏలీయా ప్రజల దగ్గరకు వెళ్లి, “మీరు ఎంతకాలం రెండు అభిప్రాయాల మధ్య తడబడుతూ ఉంటారు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి, బయలు దేవుడైతే అతన్ని అనుసరించండి” అని అన్నాడు.
అయితే ప్రజలు ఏమి బదులు చెప్పలేదు.
అప్పుడు ఏలీయా వారితో, “యెహోవా ప్రవక్తల్లో నేనొక్కడినే మిగిలాను, కాని బయలు ప్రవక్తలు నాలుగు వందల యాభైమంది ఉన్నారు. మాకు రెండు ఎడ్లను తీసుకురండి, వారు ఆ ఎడ్లలో ఒకదాన్ని బయలు ప్రవక్తలు తీసుకుని దానిని ముక్కలుగా కోసి, క్రింద నిప్పు అంటించకుండా కట్టెల మీద పేర్చాలి. ఇంకొక ఎద్దును నేను సిద్ధం చేసి క్రింద నిప్పు అంటించకుండా కట్టెల మీద పేరుస్తాను. మీరు మీ దేవుని పేరిట ప్రార్థన చేయండి, నేను యెహోవా పేరిట ప్రార్థన చేస్తాను. ఏ దేవుడైతే అగ్నిని పంపి జవాబిస్తాడో ఆయనే నిజమైన దేవుడు” అని అన్నాడు.
అప్పుడు ప్రజలంతా, “నీవు చెప్పింది బాగుంది” అన్నారు.
ఏలీయా బయలు ప్రవక్తలతో, “మీరు చాలామంది ఉన్నారు కాబట్టి ముందు మీరు ఒక ఎద్దును తీసుకుని దానిని సిద్ధం చేయండి. మీ దేవుని పేరిట ప్రార్థన చేయండి, అయితే నిప్పు అంటించకూడదు” అన్నాడు. కాబట్టి వారు ఒక ఎద్దును తీసుకుని సిద్ధం చేశారు.
తర్వాత వారు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు, “బయలా! మాకు జవాబివ్వు!” అని అంటూ బయలు పేరెత్తి బిగ్గరగా మొరపెట్టారు. కాని ఏ స్పందన లేదు; ఎవరూ జవాబివ్వలేదు. వారు సిద్ధం చేసిన బలిపీఠం చుట్టూ నాట్యం చేయడం మొదలుపెట్టారు.
మధ్యాహ్న సమయంలో ఏలీయా వారిని గేలి చేస్తూ, “బిగ్గరగా అరవండి! అతడు నిజంగా దేవుడే కదా! బహుశ అతడు ఏదైన ఆలోచనలో నిమగ్నమై ఉన్నాడేమో, లేదా పనిలో ఉన్నాడేమో లేదా ప్రయాణంలో ఉన్నాడేమో. బహుశ పడుకున్నాడేమో, అతన్ని నిద్ర లేపాలేమో” అన్నాడు. కాబట్టి వారు ఇంకా బిగ్గరగా కేకలువేస్తూ వారి అలవాటు ప్రకారం రక్తం ధారలుగా కారే వరకు కత్తులతో, ఈటెలతో తమను తాము కోసుకున్నారు. మధ్యాహ్నం దాటింది, సాయంత్రం బలి సమయం వరకు వారు తమ వెర్రి ప్రవచనాలను కొనసాగించారు. అయినా స్పందన లేదు, ఎవరు జవాబివ్వలేదు, ఎవరూ పట్టించుకోలేదు.
అప్పుడు ఏలీయా ప్రజలందరితో, “ఇక్కడకు నా దగ్గరకు రండి” అన్నాడు. వారతని దగ్గరకు రాగా అతడు పడిపోయిన యెహోవా బలిపీఠాన్ని తిరిగి నిర్మించాడు. అప్పుడు ఏలీయా, “నీ పేరు ఇశ్రాయేలు” అని యెహోవా వాగ్దానం పొందుకున్న యాకోబు గోత్రాల లెక్క చొప్పున పన్నెండు రాళ్లు తీసుకున్నాడు. రాళ్లతో యెహోవా పేరున బలిపీఠం కట్టి, దాని చుట్టూ రెండు శేయల గింజలు పట్టేటంత పెద్దగా కందకం తవ్వాడు. అతడు బలిపీఠం మీద కట్టెలు పేర్చి ఎద్దును ముక్కలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచాడు. తర్వాత వారితో, “నాలుగు పెద్ద జాడీలు నీళ్లతో నింపి, అర్పణ మీద కట్టెల మీద పోయండి” అన్నాడు.
అతడు, “మళ్ళీ అలాగే చేయండి” అని చెప్పగా వారు మళ్ళీ అలాగే చేశారు.
అతడు, “మూడవసారి కూడా అలాగే చేయండి” అనగానే వారు మళ్ళీ దహనబలి పశుమాంసం మీద కట్టెల మీద నీళ్లు పోశారు. నీళ్లు బలిపీఠం మీద నుండి చుట్టూ పారుతూ కందకం కూడా నిండిపోయింది.
అర్పణ సమయంలో, ఏలీయా ప్రవక్త బలిపీఠం దగ్గరగా వెళ్లి ఇలా ప్రార్థించాడు: “యెహోవా! అబ్రాహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా! ఇశ్రాయేలులో మీరే దేవుడని, నేను మీ సేవకుడినని, మీ ఆజ్ఞ ప్రకారమే ఇవన్నీ చేశానని ఈ రోజు వెల్లడి చేయండి. యెహోవా, నాకు జవాబివ్వండి; మీరే దేవుడైన యెహోవా అని, మీరు వారి హృదయాలను నీ వైపుకు త్రిప్పుకుంటున్నారని ప్రజలు తెలుసుకునేలా నాకు జవాబివ్వండి.”
అప్పుడు యెహోవా అగ్ని ఆకాశం నుండి దిగివచ్చి బలిని, కట్టెలను, రాళ్లను, మట్టిని దహించి కందకంలో ఉన్న నీళ్లు కూడా ఇంకిపోయేలా చేసింది.
ప్రజలంతా ఇది చూసి సాష్టాంగపడి, “యెహోవాయే దేవుడు! యెహోవాయే దేవుడు!” అని అంటూ కేకలు వేశారు.
అప్పుడు ఏలీయా, “బయలు ప్రవక్తలను పట్టుకోండి! వారిలో ఒక్కడు కూడా తప్పించుకోకూడదు!” అని వారికి ఆజ్ఞాపించాడు. ప్రజలు వారిని పట్టుకున్నారు, ఏలీయా వారిని కీషోను లోయలోకి తీసుకెళ్లి అక్కడ చంపాడు.