దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి నేను తెలివైన నిర్మాణకునిగా పునాది వేశాను. అలాగే మరొకరు దాని మీద కడుతున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా కట్టాలి. ఎందుకంటే అప్పటికే వేయబడిన పునాది తప్ప మరొకటి ఎవరూ వేయలేరు, ఆ పునాది యేసు క్రీస్తే. ఎవరైనా ఈ పునాది మీద బంగారం, వెండి, వెలగల రాళ్లు, చెక్క, ఎండుగడ్డి లేదా గడ్డి లాంటి వస్తువులతో కడితే, ఆ న్యాయ దినాన వారు చేసిన పని వెలుగులో స్పష్టంగా కనబడుతుంది. అది అగ్నిచేత నిరూపించబడుతుంది, అందరి పనిలోని నాణ్యత అగ్నిచేత పరీక్షించబడుతుంది. పునాది మీద కట్టిన పని ఎవరిది నిలుస్తుందో, వారు జీతాన్ని పొందుతారు. అది కాల్చి వేయబడితే దానిని కట్టిన వారికి నష్టం కలుగుతుంది కానీ వారు తప్పించుకుంటారు. అయితే అది కేవలం మంటల్లో నుండి తప్పించుకున్నట్లుగా ఉంటారు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తుందని మీకు తెలియదా? ఎవరైనా దేవుని మందిరాన్ని పాడు చేస్తే, దేవుడు వారిని పాడుచేస్తారు. ఎందుకంటే దేవుని మందిరం పరిశుద్ధమైనది. మీరందరు కలిసి ఆ ఆలయమై ఉన్నారు. మిమ్మల్ని మీరు మోసగించుకోకండి. ఈ లోకరీతిగా, మీలో ఎవరైనా నేను జ్ఞానినని అనుకుంటే, వారు జ్ఞాని అవ్వడానికి “బుద్ధిలేనివారిగా” కావాలి. ఎందుకంటే ఈ లోక జ్ఞానం దేవుని దృష్టిలో వెర్రితనము. లేఖనాల్లో: “జ్ఞానులను వారి యుక్తిలోనే ఆయన పట్టుకుంటారు” అని వ్రాయబడి ఉంది. లేఖనాల్లో ఇంకొక చోట: “జ్ఞానుల ఆలోచనలు వ్యర్థమైనవి అని దేవునికి తెలుసు” అని వ్రాయబడి ఉంది. కాబట్టి ఎవరు మనుష్యులను బట్టి గర్వించకూడదు. అన్ని మీకు చెందినవే. పౌలు అయినా, అపొల్లో అయినా, కేఫా అయినా, లోకమైనా, జీవమైనా, మరణమైనా, ఇప్పుడు ఉన్న వాటిలోనైనా, రాబోయే వాటిలోనైనా అన్ని మీకు చెందినవే. మీరు క్రీస్తుకు చెందినవారు, క్రీస్తు దేవునికి చెందినవారు.
చదువండి 1 కొరింథీ పత్రిక 3
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: 1 కొరింథీ పత్రిక 3:10-23
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు