1 కొరింథీ పత్రిక 15:33-58

1 కొరింథీ పత్రిక 15:33-58 OTSA

మోసపోకండి: “దుష్టులతో సహవాసం మంచి ప్రవర్తనను పాడుచేస్తుంది.” మీరు నీతిప్రవర్తన కలిగి పాపం చేయకండి. మీలో కొందరికి దేవుని గురించి తెలియదు కాబట్టి, మీరు సిగ్గుపడాలని ఇలా చెప్తున్నాను. “చనిపోయినవారు ఎలా లేపబడతారు? వారికి ఎలాంటి శరీరం ఉంటుంది?” అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. మూర్ఖుడా! నీవు ఒక విత్తనాన్ని భూమిలో నాటినప్పుడు అది చనిపోతేనే తప్ప మొలకెత్తదు. గోధుమ గింజనైన, మరొక దానినైన నీవు భూమిలో నాటినప్పుడు విత్తనం మాత్రమే నాటావు గాని పెరిగిన మొక్క కాదు. అయితే దేవుడు తాను నిర్ణయించిన శరీరాన్ని దానికి ఇస్తారు. ఆయన ప్రతి ఒక్క గింజకు దాని సొంత శరీరాన్ని ఇస్తారు. శరీరాలన్ని ఒకేలా ఉండవు. మానవుల మాంసం వేరు, జంతువుల మాంసం వేరు, పక్షుల మాంసం వేరు, చేపల మాంసం వేరు. అలాగే ఆకాశ శరీరాలు ఉన్నాయి, భూలోక శరీరాలు ఉన్నాయి; ఆకాశ శరీరాల మహిమ వేరు, భూశరీరాల మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరు. ఒక నక్షత్రానికి మరొక నక్షత్రానికి మహిమలో భేదం ఉంటుంది. మృతుల పునరుత్థానం కూడా ఇలాగే ఉంటుంది. నశించిపోయే శరీరం నాటబడి నాశనంలేనిదిగా లేపబడుతుంది. ఘనహీనంగా విత్తబడి మహిమగలదిగా లేపబడుతుంది; అది బలహీనమైనదిగా విత్తబడి శక్తిగలదానిగా లేపబడుతుంది. ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడి ఆత్మీయ శరీరంగా లేపబడుతుంది. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నట్లే ఆత్మీయ శరీరం కూడ ఉంది. కాబట్టి “మొదటి మనిషియైన ఆదాము జీవి అయ్యాడు” అని వ్రాయబడింది; చివరి ఆదాము జీవాన్నిచ్చే ఆత్మ అయ్యాడు. ఆత్మ సంబంధమైనది మొదట రాలేదు, కాని ప్రకృతి సంబంధమైనది మొదట వచ్చింది, ఆ తర్వాతే ఆత్మ సంబంధమైనది వచ్చింది. మొదటి మానవుడు భూమిలోని మట్టితో చేయబడ్డాడు, రెండవ మానవుడు పరలోకానికి చెందిన వాడు. భూమికి చెందిన మానవునిలా భూలోక సంబంధులు ఉంటారు. పరలోకానికి చెందిన వానిలా పరలోక సంబంధులు ఉంటారు. మనం భూసంబంధియైన మనుష్యుని రూపాన్ని ధరించినట్లే పరలోకసంబంధమైన వాని రూపాన్ని ధరించుకుంటాము. సహోదరీ సహోదరులారా, నేను మీకు చెప్పేది ఏంటంటే, రక్తమాంసాలు దేవుని రాజ్య వారసత్వాన్ని పొందలేవు. నశించిపోయేది శాశ్వతమైన దానిని స్వతంత్రించుకోలేదు. నేను మీకు ఒక రహస్యాన్ని చెప్తాను వినండి: మనమందరం నిద్రించం గాని, మనమందరం మార్పు చెందుతాము. ఒక క్షణంలోనే, రెప్పపాటులో, చివరి బూర మ్రోగగానే మనమందరం మార్పు పొందుతాము. బూర మ్రోగుతుంది, అప్పుడు మృతులు శాశ్వతమైనవారిగా లేపబడతారు, మనమందరం మార్పు చెందుతాము. ఎందుకంటే, నశించిపోయేది శాశ్వతమైన దాన్ని ధరించుకోవాలి, మరణించేది మరణంలేని దాన్ని ధరించుకోవాలి. నశించిపోయేది శాశ్వతమైన దాన్ని, మరణించేది మరణంలేని దాన్ని ధరించినపుడు, “విజయం మరణాన్ని మ్రింగివేసింది” అని వ్రాయబడిన వాక్యం నిజమవుతుంది. “ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? ఓ మరణమా, నీ ముల్లు ఎక్కడ?” మరణపు ముల్లు పాపం, పాపానికున్న బలం ధర్మశాస్త్రమే. అయితే దేవునికి కృతజ్ఞతలు! మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఆయన మనకు విజయాన్ని ఇచ్చారు. కాబట్టి నా ప్రియ సహోదరీ సహోదరులారా, స్థిరంగా నిలబడండి. ఏది మిమ్మల్ని కదపలేదు. ప్రభువులో మీ శ్రమ వ్యర్థం కాదని మీకు తెలుసు కాబట్టి ఎల్లప్పుడు ప్రభువు కార్యాల్లో పూర్తి శ్రద్ధ చూపండి.