1 కొరింథీ పత్రిక 15:1-32

1 కొరింథీ పత్రిక 15:1-32 OTSA

సహోదరీ సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీరు అంగీకరించి దానిలో నిలిచి ఉండాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేను మీకు బోధించిన విధంగా మీరు దానికి గట్టిగా అంటిపెట్టుకుని ఉంటే ఈ సువార్తను బట్టి మీరు రక్షించబడతారు. లేకపోతే మీరు నమ్మడం వ్యర్థమే. నేను పొందిన దానిని మొదట మీకు ప్రకటించాను: అది ఏంటంటే లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపాల కోసం మరణించారు. లేఖనాల ప్రకారం ఆయన సమాధి చేయబడి, మూడవ దినాన సజీవునిగా లేచారు. ఆయన కేఫాకు, తర్వాత పన్నెండు మందికి కనబడ్డారు. దాని తర్వాత ఆయన ఒకేసారి అయిదువందల మందికి పైగా సహోదర సహోదరీలకు కనబడ్డారు. వారిలో కొందరు మరణించినా చాలామంది ఇంకా జీవించే ఉన్నారు. ఆ తర్వాత యాకోబుకు, మిగిలిన అపొస్తలులందరికి ఆయన కనబడ్డారు. అందరికంటే చివరిగా అకాలంలో పుట్టిన నాకు కూడా ఆయన కనబడ్డారు. అపొస్తలులందరిలో నేను అల్పమైనవాన్ని. నేను దేవుని సంఘాన్ని హింసించిన కారణంగా అపొస్తలుడని పిలువబడడానికి యోగ్యున్ని కాను. అయితే నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలన మాత్రమే, ఆయన కృప నాలో వ్యర్థం కాలేదు. పైగా ఇతర అపొస్తలుల కంటే నేను ఎంతో ఎక్కువగా శ్రమపడ్డాను కాని అది నిజంగా నా ప్రయాస కాదు, నాకు తోడుగా ఉన్న దేవుని కృపయే. కాబట్టి నేనైనా వారైనా దానినే ప్రకటిస్తున్నాం, దానినే మీరు నమ్మారు. మృతులలో నుండి క్రీస్తు సజీవంగా లేపబడ్డారని మేము ప్రకటిస్తుండగా, మృతుల పునరుత్థానం లేదని మీలో కొందరు ఎలా చెప్తారు? మృతుల పునరుత్థానం లేకపోతే క్రీస్తు కూడా లేపబడనట్టే కదా. అంతేకాదు క్రీస్తు లేపబడకపోతే, మా బోధ వ్యర్థమే, మీ విశ్వాసం కూడా వ్యర్థమే. అంతేకాక, దేవుడు క్రీస్తును మరణం నుండి లేపారని దేవుని గురించి చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మేము అబద్ధ సాక్షులంగా కనబడుతున్నాము. అయితే దేవుడు ఆయనను లేపకపోతే మరణించినవారు లేపబడరు అనేది నిజం కదా. మృతులు లేపబడకపోతే క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడకపోతే మీ విశ్వాసం వ్యర్థమే; మీరు ఇంకా మీ పాపాల్లోనే ఉన్నారు. అంతేకాక క్రీస్తులో మరణించినవారు కూడా నశించినట్లే. కేవలం ఈ జీవితకాలం వరకే క్రీస్తులో మన నిరీక్షణ ఉంచితే, అందరికంటే మనం అత్యంత దయనీయంగా ఉంటాము. ఇప్పుడైతే మరణించినవారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మరణం నుండి లేపబడ్డారు. ఒక్క మనుష్యుని ద్వారా మరణం వచ్చింది కాబట్టి మృతుల పునరుత్థానం కూడ ఒక్క మనుష్యుని ద్వారానే వస్తుంది. ఆదాములో అందరు ఎలా మరణించారో అలాగే క్రీస్తులో అందరు బ్రతికించబడతారు. అయితే ప్రతి ఒక్కరు తమ క్రమాన్ని బట్టి బ్రతికించబడతారు. క్రీస్తు ప్రథమ ఫలము. తర్వాత ఆయన వచ్చినప్పుడు ఆయనకు చెందినవారు బ్రతుకుతారు. క్రీస్తు సమస్త ఆధిపత్యాన్ని అధికారాన్ని బలాన్ని నాశనం చేసి తండ్రియైన దేవునికి రాజ్యానికి అప్పగిస్తారు. అప్పుడు అంతం వస్తుంది. ఎందుకంటే ఆయన తన శత్రువులందరిని తన పాదాల క్రింద ఉంచేవరకు ఆయన పరిపాలిస్తారు. చివరిగా నశించే శత్రువు మరణం. “దేవుడు సమస్తాన్ని క్రీస్తు పాదాల క్రింద ఉంచారు” అని చెప్పినప్పుడు ఆయన క్రింద సమస్తాన్ని ఇచ్చిన దేవుడు మినహా మిగిలిన వాటన్నిటిని ఆయన క్రింద ఉంచారని అర్థం. ఆయన ఇది చేసినప్పుడు, దేవుడే అన్నిటిలో సర్వమై ఉండేలా, కుమారుడు తనకు సమస్తాన్ని లోబరచిన దేవునికి తానే లోబడతారు. ఇప్పుడు పునరుత్థానం లేకపోతే, మరి మృతుల కోసం బాప్తిస్మం పొందినవారు ఏం చేస్తారు? మరణించినవారు ఎన్నటికి లేపబడకపోతే, ప్రజలు వారి కోసం ఎందుకు బాప్తిస్మం పొందుతున్నారు? మరి అనుక్షణం మేము ఎందుకు ప్రాణభయంతో ఉండాలి? సహోదరీ సహోదరులైన మీ గురించి మన ప్రభువైన యేసు క్రీస్తులో నాకు అతిశయం కలుగుతున్నట్టుగానే నేను ప్రతి రోజూ చస్తూనే ఉన్నాను. కాని, కేవలం మానవరీతిగా ఎఫెసులోని మృగాలతో నేను పోరాడితే నాకు లాభమేంటి? ఒకవేళ మరణించినవారు లేపబడకపోతే, “రేపు చనిపోతాం కాబట్టి, మనం తిని త్రాగుదాం.”