1 కొరింథీ పత్రిక 14:26-33

1 కొరింథీ పత్రిక 14:26-33 OTSA

సహోదరీ సహోదరులారా, మేము ఇక ఏమి చెప్పాలి? మీరు సమావేశమైనప్పుడు, మీలో ఒకరు కీర్తన పాడాలని, ఒకరు బోధించాలని, ఒకరు దేవుడు బయలుపరచిన దాన్ని ప్రకటించాలని, ఒకరు భాషలతో మాట్లాడాలని, ఒకడు దానికి అర్థం చెప్పాలని తలస్తున్నారు. కాని ఇవన్నీ సంఘాన్ని బలపరచడానికి చేయండి. భాషల్లో మాట్లాడాలనుకున్నవారు ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే ఒకరి తర్వాత ఒకరు మాట్లాడాలి. మరొకరు దాని అర్థాన్ని వివరించాలి. అయితే అర్థాన్ని వివరించగలవారు ఎవరూ లేకపోతే, భాషలు మాట్లాడేవారు సంఘంలో మౌనంగా ఉండి, తనలో తాను దేవునితోను మాత్రమే మాట్లాడుకోవాలి. ప్రవక్తల్లో ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే మాట్లాడాలి. ఇతరులు వారు చెప్పిన దానిని జాగ్రత్తగా వివేచించాలి. సమావేశంలో కూర్చున్నవారిలో ఎవరైనా దేవుని నుండి ప్రత్యక్షతను పొందితే, మాట్లాడుతున్నవారు తన మాటలు ఆపివేయాలి. ప్రతి ఒక్కరు నేర్చుకోవడానికి ప్రోత్సహించబడేలా మీరందరు ఒకరి తర్వాత ఒకరు ప్రవచించాలి. ప్రవక్తల ఆత్మ ప్రవక్తలకు లోబడి ఉండాలి. అలాగే పరిశుద్ధుల సంఘాలన్నిటిలో దేవుడు సమాధానాన్ని కలిగిస్తారే తప్ప అల్లరిని కాదు.