1 కొరింథీ పత్రిక 14:1-20

1 కొరింథీ పత్రిక 14:1-20 OTSA

ప్రేమ చూపడానికి ప్రయాసపడండి, ఆత్మ వరాలను ఆసక్తితో కోరుకోండి. మరి ముఖ్యంగా ప్రవచన వరాన్ని ఆశించండి. భాషల్లో మాట్లాడేవారు మానవులతో కాదు కాని దేవునితో మాట్లాడతారు. ఎవరూ వాటిని అర్థం చేసుకోలేరు; ఆత్మ ద్వారా వారు రహస్యాలను పలుకుతున్నారు. అయితే ప్రవచించేవారు మానవులను బలపరచడానికి, ప్రోత్సాహం, ఆదరణ కలిగించడానికి వారితో మాట్లాడుతున్నారు. భాషల్లో మాట్లాడేవారు తనకు తానే జ్ఞానాభివృద్ధి చేసుకుంటారు, కాని ప్రవచించేవారు సంఘానికి అభివృద్ధి కలుగజేస్తారు. మీరందరు భాషల్లో మాట్లాడాలని నా కోరిక కాని, మీరు ప్రవచించాలని మరి ఎక్కువగా కోరుతున్నాను. భాషల్లో మాట్లాడేవారు తెలిపిన దానికి సంఘం అభివృద్ధి చెందేలా మరొకరు అర్థం చెప్తేనే తప్ప, భాషల్లో మాట్లాడేవారి కంటే ప్రవచించేవారే గొప్పవారు. కాబట్టి సహోదరీ సహోదరులారా, నేను మీ దగ్గరకు వచ్చి సత్యాన్ని తెలియజేయడం గాని జ్ఞానం గాని ప్రవచనం గాని వాక్య బోధ గాని మీకు చెప్పకపోతే నేను వచ్చి భాషల్లో మాట్లాడడం వల్ల నా నుండి మీకు ఏ మంచి జరుగుతుంది? వేణువు, వీణ వంటి జీవంలేని వాయిద్యాలను వాయించినప్పుడు వాటి స్వరాల్లో భేదం లేకపోతే ఏది ఏ వాయిద్యమో ఎలా తెలుసుకోగలరు? అంతేకాక, బూర ఊదేవారు స్పష్టమైన ధ్వని చేయకపోతే యుద్ధానికి ఎవరు సిద్ధపడతారు? అలాగే మీరు నాలుకతో స్పష్టమైన మాటలు మాట్లాడకపోతే మీరు ఏమి మాట్లాడుతున్నారో ఎవరైనా ఎలా తెలుసుకోగలరు? అప్పుడు మీరు కేవలం గాలిలో మాట్లాడినట్లు ఉంటుంది. లోకంలో చాలా భాషలు ఉన్నాయి, అవన్నీ అర్థాన్ని కలిగి ఉన్నాయని అనడంలో సందేహం లేదు. ఎవరైనా మాట్లాడినప్పుడు దాని అర్థాన్ని నేను గ్రహించలేకపోతే మాట్లాడేవారికి నేను, నాకు మాట్లాడేవారు పరాయివానిగా ఉంటాను. ఆత్మ సంబంధమైన వరాలు పొందాలన్న ఆసక్తి మీలో ఉంది కాబట్టి సంఘాన్ని బలపరచడానికి వాటిని సమృద్ధిగా పొందే ప్రయత్నం చేయండి. భాషలో మాట్లాడేవారు తాము మాట్లాడిన దానికి అర్థం చెప్పే శక్తి కోసం ప్రార్థించాలి. ఎందుకంటే, నేను భాషలో ప్రార్థిస్తే, నా ఆత్మ కూడా ప్రార్థిస్తుంది కాని నా మనస్సు ఫలవంతంగా ఉండదు. కాబట్టి నేను ఏమి చేయాలి? నా ఆత్మతో ప్రార్థిస్తాను, అయితే నా జ్ఞానంతో కూడ ప్రార్థిస్తాను. నా ఆత్మతో పాడతాను, నా మనసుతో కూడా పాడతాను. లేకపోతే మీరు ఆత్మలో దేవునికి కృతజ్ఞత చెల్లిస్తే, మీరు చెప్పిన దాన్ని గ్రహించలేనివారు అక్కడ ఉంటే, మీరు ఏం చెప్పారో వారికి తెలియదు కాబట్టి మీ కృతజ్ఞతా స్తుతికి వారు “ఆమేన్” అని ఎలా చెప్తారు? నీవు చక్కగానే దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నావు కాని దానివల్ల ఎవరికి జ్ఞానవృద్ధి కలుగదు. మీ అందరికంటే నేను ఎక్కువగా భాషల్లో మాట్లాడుతున్నందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. కాని, సంఘంలో అర్థం చేసుకోలేని భాషలో పదివేల మాటలు మాట్లాడడం కంటే, ఇతరులకు బోధించడానికి అర్థమైన అయిదు మాటలు నేను మాట్లాడితే మంచిది. సహోదరీ సహోదరులారా, పసిబిడ్డల్లా ఆలోచించడం ఆపండి. చెడు విషయంలో పసివారిలా ఉండండి కాని ఆలోచించడంలో పెద్దవారిలా ఉండండి.