1 దినవృత్తాంతములు 28:9-20

1 దినవృత్తాంతములు 28:9-20 OTSA

“సొలొమోనూ, నా కుమారుడా! నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయాలను పరిశోధిస్తారు, ఆలోచనల ఉద్దేశాలన్నిటిని గ్రహిస్తారు కాబట్టి నీవు ఆయనను తెలుసుకుని పూర్ణహృదయంతో చిత్తశుద్ధితో ఆయనను సేవించు. నీవు ఆయనను వెదికితే, ఆయన నీకు దొరుకుతారు; అయితే నీవు ఆయనను విడిచిపెడితే, ఆయన నిన్ను శాశ్వతంగా తిరస్కరిస్తారు. పరిశుద్ధాలయంగా ఉండేలా ఒక ఇల్లు కట్టడానికి యెహోవా నిన్ను ఎన్నుకున్నారు అనే సంగతిని గ్రహించి ధైర్యంగా ఉండి పని చేయి.” అప్పుడు దావీదు తన కుమారుడైన సొలొమోనుకు, దేవాలయ మంటపము, దాని భవనాలకు, గిడ్డంగులకు, దాని పైభాగానికి, దాని లోపలి గదులకు, ప్రాయశ్చిత్త స్థలానికి సంబంధించిన నమూనాలు ఇచ్చాడు. దేవుని ఆత్మ దావీదు హృదయంలో పెట్టిన నమూనాలను అతడు సొలొమోనుకు ఇచ్చాడు. యెహోవా మందిర ఆవరణాలకు, చుట్టూ ఉండే గదులకు, దేవుని ఆలయ ఖజానాలకు, సమర్పించబడిన వస్తువుల ఖజానాలకు నమూనాలు అతడు ఇచ్చాడు. యాజకుల లేవీయుల విభాగాల గురించి, యెహోవా మందిరంలో జరగాల్సిన సేవలన్నిటి గురించి, అలాగే దాని సేవలో ఉపయోగించబడే పాత్రల గురించి కూడా దావీదు అతనికి నియమాలు తెలియజేశాడు. వివిధ సేవలలో ఉపయోగించబడే బంగారు ఉపకరణాలను చేయడానికి కావలసినంత బంగారాన్ని, వివిధ సేవలలో ఉపయోగించబడే వెండి ఉపకరణాలను చేయడానికి కావలసినంత వెండిని దావీదు అతనికి అప్పగించాడు. బంగారు దీపస్తంభాలకు వాటి దీపాలకు ఒక్కొక్క దీపస్తంభానికి దీపాలకు కావలసిన బరువు ప్రకారం బంగారాన్ని, వెండి దీపస్తంభాలకు వాటి దీపాలకు ఒక్కొక్క దీపస్తంభానికి దీపాలకు కావలసిన బరువు ప్రకారం వెండిని; దేవుని సన్నిధిలో రొట్టెలుంచే ఒక్కొక్క బంగారు బల్లకు కావలసిన బంగారాన్ని; వెండి బల్లలకు కావలసిన వెండిని; కొంకులు, గిన్నెలు, పాత్రలకు కావలసిన మేలిమి బంగారాన్ని; ఒక్కొక్క బంగారు పాత్రకు కావలసిన బరువు ప్రకారం బంగారాన్ని; ఒక్కొక్క వెండి పాత్రకు కావలసిన బరువు ప్రకారం వెండిని; ధూపవేదికకు కావలసిన స్వచ్ఛమైన బంగారాన్ని దావీదు అతనికి ఇచ్చాడు. తమ రెక్కలు విప్పి యెహోవా నిబంధన మందసాన్ని కప్పివుంచే బంగారు కెరూబుల రథం యొక్క నమూనాను కూడా దావీదు అతనికిచ్చాడు. అప్పుడు దావీదు, “ఇదంతా యెహోవా తన చేతిని నా మీద ఉంచడం వలన నేను వీటన్నిటిని వ్రాశాను, ఈ నమూనా వివరాలన్ని నేను గ్రహించగలిగేలా ఆయన చేశారు” అని చెప్పాడు. దావీదు తన కుమారుడైన సొలొమోనుతో ఇంకా మాట్లాడుతూ ఇలా చెప్పాడు, “దృఢంగా, ధైర్యంగా ఉంటూ పని చేయి. నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉంటారు కాబట్టి భయపడకు దిగులుపడకు. యెహోవా ఆలయ సేవకు సంబంధించిన పనులన్నీ ముగిసేవరకు ఆయన నిన్ను ఏమాత్రం విడిచిపెట్టరు.