1 దినవృత్తాంతములు 15:1-16

1 దినవృత్తాంతములు 15:1-16 OTSA

దావీదు తన కోసం దావీదు పట్టణంలో భవనాలు కట్టించుకున్న తర్వాత, అతడు దేవుని మందసం కోసం ఒక స్థలాన్ని సిద్ధపరచి దాని కోసం గుడారం వేయించాడు. తర్వాత దావీదు, “దేవుని మందసాన్ని మోయడానికి నిత్యంగా తనకు సేవ చేయడానికి యెహోవా లేవీయులను ఎన్నుకున్నారు కాబట్టి వారు తప్ప ఇంకెవరు యెహోవా మందసాన్ని మోయకూడదు” అని చెప్పాడు. యెహోవా మందసాన్ని తాను సిద్ధపరచిన స్థలానికి తీసుకురావడానికి దావీదు ఇశ్రాయేలీయులందరిని యెరూషలేములో సమావేశపరిచాడు. అప్పుడు అహరోను వారసులను, లేవీయులను పిలిపించాడు, వారు వీరే: కహాతు వారసులలో నుండి, వారి నాయకుడైన ఊరియేలు, అతని బంధువుల్లో 120 మంది; మెరారి వారసులలో నుండి వారి నాయకుడైన అశాయాను, అతని బంధువుల్లో 220 మంది; గెర్షోను వారసులలో నుండి వారి నాయకుడైన యోవేలు, అతని బంధువుల్లో 130 మంది; ఎలీషాపాను వారసులలో నుండి వారి నాయకుడైన షెమయా, అతని బంధువుల్లో 200 మంది; హెబ్రోను వారసులలో నుండి వారి నాయకుడైన ఎలీయేలు, అతని బంధువుల్లో 80 మంది; ఉజ్జీయేలు వారసులలో నుండి వారి నాయకుడైన అమ్మీనాదాబు, అతని బంధువుల్లో 112 మంది. తర్వాత దావీదు యాజకులైన సాదోకు అబ్యాతారులను, లేవీయులైన ఊరియేలు, అశాయాను, యోవేలు, షెమయాను, ఎలీయేలు, అమ్మీనాదాబులను పిలిపించాడు. అతడు వారితో ఇలా అన్నాడు, “మీరు లేవీయుల కుటుంబ పెద్దలు; ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందసాన్ని, నేను సిద్ధపరచిన స్థలానికి తీసుకురావడానికి మీరు, మీ బంధువులు, మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. లేవీయులైన మీరు ఇంతకుముందు మన దేవుడైన యెహోవా మందసాన్ని మోయలేదు కాబట్టి మన దేవుడైన యెహోవా కోపంతో మనమీద విరుచుకుపడ్డారు. మనం ఎలా చేయాలో నియమించబడిన విధానం ప్రకారం ఆయనను అడగలేదు.” అప్పుడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందసాన్ని తీసుకురావడానికి యాజకులు, లేవీయులు తమను తాము ప్రతిష్ఠించుకున్నారు. యెహోవా చెప్పిన మాట ప్రకారం మోషే ఆజ్ఞాపించినట్లు లేవీయులు దేవుని మందసాన్ని దాని మోతకర్రలతో తమ భుజాల మీదికి ఎత్తుకున్నారు. తమ తోటి లేవీయులను సితారలు, వీణలు, తాళాలు మొదలైన వాయిద్యాలతో సంతోషకరమైన ధ్వని చేయమని సంగీతకారులుగా నియమించమని లేవీ నాయకులకు దావీదు ఆదేశించాడు.