రోమా పత్రిక 11:1-10

రోమా పత్రిక 11:1-10 TSA

అందుకు నా ప్రశ్న ఏంటంటే: దేవుడు తన ప్రజలను తిరస్కరిస్తారా? ఎన్నటికీ కాదు! నేను కూడా ఇశ్రాయేలుకు చెందినవాన్నే, అబ్రాహాము సంతానాన్నే, బెన్యామీను గోత్రానికి చెందినవాన్నే. తన ప్రజలను అనగా తాను ముందుగానే ఎరిగి ఉన్నవారిని దేవుడు తిరస్కరించరు. ఏలీయా గురించిన భాగంలో లేఖనం ఏమి చెప్తుందో మీకు తెలియదా? ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా అతడు దేవునికి ప్రార్థన చేస్తూ, “ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపారు, నీ బలిపీఠాలను కూల్చివేశారు, నేను ఒక్కన్ని మాత్రమే మిగిలాను, వారు నా ప్రాణం తీయాలని చూస్తున్నారు” అని ఎంతగానో మొరపెట్టుకున్నాడు. అయితే దేవుడు అతనికిచ్చిన సమాధానం ఏంటి? “బయలుకు మోకరించని ఏడువేలమందిని నా కోసం ప్రత్యేకించుకున్నాను” అని. అదే విధంగా ప్రస్తుత సమయంలో కూడా కృప ద్వారా ఏర్పాటు చేయబడినవారు మిగిలే ఉన్నారు. అది కృప వల్ల అయితే అది క్రియలమూలంగా కలిగింది కాదు. ఒకవేళ అలా కాకపోతే కృప ఇక కృప కాదు. అప్పుడు ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు ఆసక్తితో దేనిని వెదికారో అది వారికి దొరకలేదు. వారిలో ఏర్పరచబడినవారికే అది దొరికింది. కాని మిగిలిన వారు కఠినంగా అయ్యారు. దాని గురించి ఇలా వ్రాయబడింది: “నేటి వరకు దేవుడు వారికి మైకంగల ఆత్మను, చూడలేని కళ్లను వినలేని చెవులను ఇచ్చారు.” దావీదు, “వారి భోజనబల్ల వారికి ఉచ్చుగా బోనుగా మారి వారికి అడ్డుబండగా తగిన శాస్తిగా ఉండును గాక. వారు చూడకుండ వారి కళ్లకు చీకటి కమ్మును గాక, వారి నడుములు శాశ్వతంగా వంగిపోవును గాక” అని చెప్తున్నాడు.

రోమా పత్రిక 11:1-10 కోసం వీడియో