ప్రకటన 17:5-18

ప్రకటన 17:5-18 TSA

ఆమె నుదిటి మీద వ్రాసి ఉన్న పేరులో ఒక రహస్యం ఉంది: “మహా బబులోను పట్టణం, వేశ్యలకు తల్లి భూమి మీద జరిగే ప్రతి అసహ్యమైన కార్యానికి తల్లి.” ఈ స్త్రీ దేవుని పరిశుద్ధ ప్రజల రక్తాన్ని అనగా యేసు హతసాక్షుల రక్తాన్ని త్రాగి మత్తులో ఉండడం నేను చూశాను. నేను ఆమెను చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యపడ్డాను. అప్పుడు ఆ దేవదూత నాతో, “నీవెందుకు ఆశ్చర్యపడుతున్నావు? హతసాక్షుల స్వారీ చేసిన ఏడు తలలు పది కొమ్ములు కలిగిన మృగానికి సంబంధించిన రహస్యాన్ని నేను నీకు తెలియజేస్తాను” అని చెప్పాడు. నీవు చూసిన ఆ మృగం ఒకప్పుడు ఉండేది కాని ఇప్పుడు లేదు. అది అగాధం నుండి పైకి వచ్చి నాశనమై పోవడానికి సిద్ధంగా ఉన్నది. ఆ మృగం ఇంతకుముందు ఉండేది, కానీ ఇప్పుడు లేదు. అది మళ్ళీ వస్తుంది కాబట్టి సృష్టికి పునాది వేయబడక ముందు నుండి జీవగ్రంథంలో పేర్లు వ్రాయబడని భూనివాసులందరు ఆ మృగాన్ని చూసి ఆశ్చర్యపడతారు. ఈ విషయాన్ని గుర్తించడానికి జ్ఞానంగల మనస్సు అవసరం. ఆ స్త్రీ కూర్చుని ఉన్న ఏడు తలలు ఏడు కొండలు. ఆ ఏడు తలలు ఏడుగురు రాజులను సూచిస్తున్నాయి. వారిలో అయిదుగురు పడిపోయారు, ఒక రాజు యేలుతున్నాడు, మరొక రాజు ఇంకా రాలేదు. కాని అతడు వచ్చినప్పుడు అతడు కేవలం కొంతకాలమే యేలుతాడు. ఇంతకుముందు ఉండి ఇప్పుడు లేని ఆ మృగమే ఎనిమిదవ రాజు. ఆ మృగమే ఏడుగురిలో ఒకడు, అతడు తన నాశనం కోసమే రాబోతున్నాడు. నీవు చూసిన పది కొమ్ములు పదిమంది రాజులు. వారు ఇంకా రాజ్యాన్ని పొందలేదు, కాని మృగంతో పాటు కలిసి ఒక గంట సమయం రాజుల్లా యేలడానికి వారికి అధికారం ఇవ్వబడుతుంది. వీరు ఒకే ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. వీరు తమ శక్తిని, అధికారాన్ని మృగానికి ఇస్తారు. ఈ రాజులందరూ మృగంతో పాటు కలిసి గొర్రెపిల్లకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తారు కాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు కాబట్టి ఆయన వారందరి మీద విజయం పొందుతాడు. ఆయనతో పాటు ఆయనచే పిలువబడిన వారు, ఏర్పరచబడినవారు ఆయనను నమ్మకంగా వెంబడించినవారు ఉంటారు. అప్పుడు ఆ దేవదూత నాతో, “ఆ వేశ్య కూర్చుని ఉన్న ఆ జలాలే ప్రజలు, జనసమూహాలు, దేశాలు, వివిధ భాషలు మాట్లాడేవారు. నీవు చూసిన ఆ మృగం ఆ పది కొమ్ములు ఆ వేశ్యను ద్వేషిస్తాయి. అవి ఆమెను దిక్కులేని దానిగా, దిగంబరిగా చేయడానికి ఆమెను తీసుకొస్తాయి. అవి ఆమె మాంసాన్ని తిని, ఆమె శరీరాన్ని అగ్నితో కాల్చివేస్తాయి. ఎందుకంటే దేవుడు ముందుగానే పలికిన మాటలు నెరవేరే వరకు వారు తమ రాజ్యాధికారాన్ని ఆ మృగానికి అప్పగించడానికి అంగీకరించడం ద్వారా ఆయన ఉద్దేశాలు పూర్తయ్యే వరకు దేవుడు దీన్ని వారి హృదయాల్లో ఉంచారు. నీవు చూసిన ఆ స్త్రీ భూరాజులను యేలుతున్న ఆ మహా పట్టణం” అని చెప్పాడు.

ప్రకటన 17:5-18 కోసం వీడియో