కీర్తనలు 78:56-72

కీర్తనలు 78:56-72 TSA

కాని వారు దేవున్ని పరీక్షించారు మహోన్నతుని మీద తిరగబడ్డారు; వారు ఆయన శాసనాలను పాటించలేదు. వారి పూర్వికుల్లా వారు ద్రోహులు అపనమ్మకస్తులు, పనికిరాని విల్లులా నిష్ప్రయోజకులు. వారి క్షేత్రాలతో దేవునికి కోపం తెప్పించారు; వారు విగ్రహాలను పెట్టుకుని ఆయనకు రోషం పుట్టించారు. దేవుడు వారి కేకలు విన్నప్పుడు, ఆయన ఆగ్రహించారు; ఆయన ఇశ్రాయేలును పూర్తిగా త్రోసివేశారు. షిలోహు ప్రత్యక్ష గుడారాన్ని, మనుష్యుల మధ్య ఆయన వేసుకున్న గుడారాన్ని విడిచిపెట్టారు. ఆయన తన బలానికి సూచనగా ఉన్న మందసాన్ని బందీఖానాకు, తన వైభవాన్ని శత్రువుల చేతికి అప్పగించారు. ఆయన తన ప్రజలను ఖడ్గానికి అప్పగించారు; ఆయన తన వారసత్వం మీద ఆగ్రహించారు. అగ్ని వారి యువకులను దహించివేసింది, వారి యువతులకు పెళ్ళి పాటలు లేవు; వారి యాజకులు ఖడ్గానికి అప్పగించబడ్డారు వారి విధవరాండ్రు ఏడవలేకపోయారు. అప్పుడు నిద్ర నుండి లేచినవానిలా, ద్రాక్షారస మత్తు నుండి మేల్కొన్న యోధునిలా దేవుడు మేల్కొన్నారు. ఆయన తన శత్రువుల మీద ప్రతి దాడి చేశారు; వారికి నిత్య అవమానాన్ని కలిగించారు. అప్పుడు ఆయన యోసేపు గుడారాలను నిరాకరించారు, ఆయన ఎఫ్రాయిం గోత్రాన్ని ఏర్పరచుకోలేదు; కాని ఆయన యూదా గోత్రాన్ని, తాను ప్రేమించిన సీయోను కొండనే ఎన్నుకున్నారు. ఆయన పరిశుద్ధాలయాన్ని ఆకాశమంత ఎత్తుగా, భూమిలా దృఢంగా శాశ్వతంగా నిర్మించుకున్నారు. ఆయన తన సేవకుడైన దావీదును ఎన్నుకుని, గొర్రెల దొడ్డి నుండి అతన్ని పిలిపించారు; గొర్రెలను మేపుతుండగా అతన్ని తీసుకువచ్చి తన ప్రజలైన యాకోబు మీద, తన వారసత్వమైన ఇశ్రాయేలు మీద కాపరిగా నియమించారు. దావీదు యథార్థ హృదయంతో వారిని పాలించాడు; జ్ఞానం కలవాడై వారిని నడిపించాడు.