కీర్తనలు 40:11-17

కీర్తనలు 40:11-17 TSA

యెహోవా, మీ కరుణను నాకు దూరం చేయకండి; మీ మారని ప్రేమ మీ విశ్వాస్యత నిత్యం నన్ను కాపాడును గాక. లెక్కలేనన్ని ఆపదలు నన్ను చుట్టి ఉన్నాయి; నా పాపాలు నన్ను పట్టుకున్నాయి, నేనేమి చూడలేని స్థితిలో ఉన్నాను. అవి నా తలవెంట్రుకల కంటే ఎక్కువ ఉన్నాయి, నా గుండె చెదిరిపోతుంది. యెహోవా, సంతోషంగా నన్ను రక్షించడానికి, యెహోవా నాకు సాయం చేయడానికి త్వరగా రండి. నా ప్రాణం తీయాలని కోరేవారందరు సిగ్గుకు, గందరగోళానికి గురవ్వాలి; నా పతనాన్ని కోరేవారందరు అవమానంతో వెనుకకు తిరిగి వెళ్లాలి. నన్ను చూసి, “ఆహా! ఆహా!” అనేవారు వారికి కలిగే అవమానానికి ఆశ్చర్యానికి గురి కావాలి. అయితే మిమ్మల్ని వెదికేవారంతా మీలో ఆనందించి సంతోషించాలి; మీ రక్షణను ప్రేమించేవారు ఎల్లప్పుడు, “యెహోవా గొప్పవాడు!” అని అనాలి. కాని నా మట్టుకైతే, నేను దీనుడను, అవసరతలో ఉన్నవాడను; ప్రభువు నా గురించి ఆలోచించుదురు గాక. మీరే నా సహాయం, నా విమోచకుడు; మీరే నా దేవుడు, ఆలస్యం చేయకండి.