కీర్తనలు 37:1-9

కీర్తనలు 37:1-9 TSA

దుష్టులను బట్టి బాధపడకు తప్పు చేసేవారిని చూసి అసూయపడకు; గడ్డిలా వారు త్వరలోనే వాడిపోతారు, పచ్చ మొక్కల్లా వారు త్వరలోనే ఎండిపోతారు. యెహోవా మీద నమ్మకం ఉంచి మంచి చేయి; దేశంలో నివసించి సురక్షితమైన క్షేమకరమైన పచ్చికను ఆస్వాదించు. యెహోవాయందు ఆనందించు, ఆయన నీ హృదయ కోరికలు తీరుస్తారు. నీ మార్గాన్ని యెహోవాకు అప్పగించండి; ఆయనపై నమ్మకం ఉంచితే ఆయన నీకు సహాయం చేస్తారు. ఆయన నీ నీతిని తెల్లవారు వెలుగులా ప్రకాశింపజేస్తారు, నీ నిర్దోషత్వాన్ని మధ్యాహ్న సూర్యునిలా ప్రకాశింపజేస్తారు. యెహోవా ముందు మౌనంగా ఉండు ఆయన కోసం ఓర్పుతో వేచి ఉండు. ప్రజలు వారి మార్గాల్లో విజయవంతమైనప్పుడు వారు తమ దుష్ట పన్నాగాలు అమలు చేసినప్పుడు చింతించకు. కోపం మాని ఆగ్రహాన్ని విడిచిపెట్టు; చింతించకు అది కీడుకే దారి తీస్తుంది. చెడ్డవారు నాశనం చేయబడతారు, కాని యెహోవా కోసం నిరీక్షించే వారు దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు.