కీర్తనలు 35:1-10

కీర్తనలు 35:1-10 TSA

యెహోవా, నాతో వాదించే వారితో వాదించండి; నాతో పోరాడే వారితో పోరాడండి. కవచం ధరించి, డాలు తీసుకుని యుద్ధానికి సిద్ధపడి, నాకు సాయం చేయడానికి రండి. నన్ను వెంటాడుతున్న వారి మీదికి, మీ ఈటెను విసరండి “నేనే మీ రక్షణ” అని మీరు నాతో చెప్పండి. నా ప్రాణాన్ని తీయాలని చూసేవారు అవమానపాలై సిగ్గుపడుదురు గాక; నా పతనానికి కుట్రపన్నిన వారు భయపడుదురు గాక. యెహోవా దూత వారిని తరుముతుండగా వారు గాలికి కొట్టుకుపోయే పొట్టులా ఉందురు గాక. యెహోవా దూత వారిని తరుముతుండగా వారి మార్గం చీకటిమయమై జారేదిగా ఉండును గాక. కారణం లేకుండా వారు తమ వలను నా కోసం దాచారు నన్ను చిక్కించుకోడానికి వారు ఒక గొయ్యి తవ్వారు. వారికి తెలియకుండానే వారి పైకి నాశనం వచ్చును గాక వారు నా కోసం దాచిన వలలో వారే చిక్కుకొందురు గాక! నా కోసం త్రవ్విన గొయ్యిలో వారే పడుదురు గాక. నా ప్రాణం యెహోవాలో ఆనందిస్తుంది ఆయన రక్షణలో సంతోషిస్తుంది. “యెహోవా, నిన్ను పోలినవారెవరు? బలవంతుల చేతిలో నుండి మీరు బాధితులను విడిపిస్తారు, దోపిడి దొంగల నుండి మీరు దీనులను నిరుపేదలను విడిపిస్తారు” అని నా శక్తి అంతటితో నేను అంటాను.