కీర్తనలు 104:18-35

కీర్తనలు 104:18-35 TSA

అడవి మేకపోతులు ఎత్తైన పర్వతాలమీద మేస్తూ ఉంటాయి; కుందేళ్ళు బండ సందులను ఆశ్రయిస్తాయి. రుతువుల్ని సూచించడానికి ఆయన చంద్రుని చేశారు, ఎప్పుడు అస్తమించాలో సూర్యునికి తెలుసు. మీరు చీకటి కలుగజేస్తారు, అది రాత్రి అవుతుంది, అడవి మృగాలన్నీ వేట కోసం సంచరిస్తాయి. సింహాలు వాటి వేట కోసం గర్జిస్తాయి, అవి దేవుని నుండి ఆహారం వెదకుతాయి. సూర్యుడు ఉదయించగానే, అవి వెళ్లిపోతాయి; అవి గుహలకు వెళ్లి పడుకుంటాయి. అప్పుడు మనుష్యులు వారి పనులకు వెళ్లిపోతారు, సాయంకాలం వరకు వారు కష్టపడతారు. యెహోవా! మీ కార్యాలు ఎన్నో! మీ జ్ఞానంతో మీరు వాటన్నిటిని చేశారు; భూమి అంతా మీ సృష్టితో నిండి ఉంది. అదిగో విశాలమైన, మహా సముద్రం, అందులో లెక్కలేనన్ని జలచరాలు దానిలో జీవులు చిన్నవి పెద్దవి ఉన్నాయి. అందులో ఓడలు ఇటు అటు తిరుగుతాయి, సముద్రంలో ఆడుకోడానికి మీరు సృజించిన లెవియాథన్ అక్కడ ఉంది. సకాలంలో మీరు వాటికి వాటి ఆహారం పెడతారని, జీవులన్నీ మీ వైపే చూస్తున్నాయి. మీరు దానిని వారికి ఇచ్చినప్పుడు, అవి సమకూర్చుకుంటాయి; మీరు గుప్పిలి విప్పి పెడుతుంటే అవి తిని తృప్తి చెందుతాయి. మీ ముఖం మరుగైతే అవి కంగారు పడతాయి; మీరు వాటి ఊపిరిని ఆపివేసినప్పుడు, అవి చనిపోయి మట్టి పాలవుతాయి. మీరు మీ ఆత్మను పంపినప్పుడు, అవి సృజించబడ్డాయి, మీరే భూతలాన్ని నూతనపరుస్తారు. యెహోవా మహిమ నిరంతరం ఉండును గాక; యెహోవా తన క్రియలలో ఆనందించును గాక. ఆయన భూమిని చూస్తే, అది కంపిస్తుంది, ఆయన పర్వతాలను తాకితే, అవి పొగలు గ్రక్కుతాయి. నా జీవితకాలమంతా నేను యెహోవాకు పాడతాను; నేను బ్రతికి ఉన్నంత కాలం నా దేవునికి నేను స్తుతిగానం చేస్తాను. నేను యెహోవాయందు ఆనందిస్తుండగా, నా ధ్యానము ఆయనకు ఇష్టమైనదిగా ఉండును గాక. అయితే పాపులు భూమి మీద నుండి పూర్తిగా తుడిచివేయబడుదురు గాక దుష్టులు ఇక ఉండక పోవుదురు గాక.