సామెతలు 31:1-21

సామెతలు 31:1-21 TSA

రాజైన లెమూయేలు సూక్తులు; అతని తల్లి అతనికి బోధించిన ప్రేరేపిత మాటలు. నా కుమారుడా! ఆలకించు, నా గర్భంలో మోసిన నా కుమారుడా, ఆలకించు నా మ్రొక్కుబడులకు జవాబైన నా కుమారుడా, ఆలకించు! నీ బలమును ఆడవారి కోసం ఖర్చు చేయవద్దు, రాజులను పతనము చేసేవారి కోసం నీ శక్తిని ఖర్చు చేయవద్దు. లెమూయేలూ, ఇది రాజులకు తగినది కాదు, మద్యపానం సేవించుట రాజులకు తగినది కాదు, పాలకులు మద్యము కోసం ఆరాటపడకూడదు, ఎందుకంటే వారు త్రాగి, నిర్ణయించిన వాటిని మరచిపోతారు, అణగారిన వారందరి హక్కులను హరించివేస్తారు. నశిస్తున్న వారికి సారా, హృదయ వేదనగల వారికి మద్యము. వారు త్రాగి తమ పేదరికమును మరచిపోతారు తమ కష్టాన్ని ఇక తలంచరు. తమ గురించి తాము మాట్లాడలేని వారి కోసం, నిరాశ్రయులందరి హక్కుల కోసం మాట్లాడండి. మాట్లాడండి న్యాయంగా తీర్పు తీర్చండి; దీనుల, అవసరతలో ఉన్న వారి హక్కులను పరిరక్షించండి. గుణవతియైన భార్య ఎవరు కనుగొనగలరు? ఆమె ముత్యాల కంటే విలువైనది. ఆమె భర్త ఆమెపై పూర్తి నమ్మిక కలిగి ఉంటాడు అతనికి లాభం తక్కువకాదు. ఆమె బ్రతుకు దినాలన్ని, అతనికి మేలు చేస్తుంది గాని కీడు చేయదు. ఆమె గొర్రె ఉన్నిని నారను తెచ్చుకుని, ఆసక్తి కలిగి తన చేతులతో పని చేస్తుంది. ఆమె దూరము నుండి తన ఆహారాన్ని తెచ్చే, వర్తకుల ఓడల లాంటిది. ఆమె ఇంకా చీకటి ఉండగానే లేస్తుంది; తన కుటుంబానికి భోజనము సిద్ధము చేస్తుంది; తన పనికత్తెలకు వారి వాటాను ఇస్తుంది. ఆమె పొలాన్ని చూసి దానిని కొంటుంది; తన సంపాదనల నుండి ఆమె ద్రాక్షతోట ఒకటి నాటుతుంది. ఆమె తన పనిని తీవ్రంగా ప్రారంభిస్తుంది, ఆమె పనులకు తగినట్టుగా ఆమె చేతులు బలమైనవి. ఆమె తన వ్యాపారం లాభదాయకంగా ఉండడం చూస్తుంది, రాత్రివేళ ఆమె దీపం ఆరిపోదు. ఆమె పంటను చేత పట్టుకుంటుంది, తన వ్రేళ్ళతో కదురు పట్టుకుని వడుకుతుంది. పేదవారికి తన చేయి చాపి సహాయం చేస్తుంది, దరిద్రులకు తన చేతులు చాపి సహాయపడుతుంది. మంచు కురిసినప్పుడు ఆమె తన ఇంటివారి గురించి భయపడదు, ఆమె ఇంటివారందరు ఎర్రని రంగు బట్టలు వేసుకున్నవారు.