ఫిలిప్పీ పత్రిక 3:14-21

ఫిలిప్పీ పత్రిక 3:14-21 TSA

క్రీస్తు యేసులో దేవుని ఉన్నత పిలుపు వలన కలిగే బహుమానాన్ని గెలవడానికి, లక్ష్యం వైపే పరుగెడుతున్నాను. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారందరం ఇదే భావాన్ని కలిగి ఉందాము. అప్పుడు దేని గురించైనా మీరు వేరుగా ఆలోచిస్తే, దాన్ని కూడా దేవుడు మీకు స్పష్టం చేస్తారు. అయినా ఇప్పటివరకు మనం పొందుకున్న దానిని బట్టే క్రమంగా జీవిద్దాము. సహోదరీ సహోదరులారా, మీరు నా మాదిరిని అనుసరించండి. మేము మీకు మాదిరిగా ఉన్నట్లే, ఎవరైతే మాలా జీవిస్తారో వారిపై మీ దృష్టిని ఉంచండి. అనేకమంది క్రీస్తు సిలువకు శత్రువులుగా జీవిస్తున్నారు, గతంలో వీరిని గురించి మీతో అనేకసార్లు చెప్పినా, మరల ఇప్పుడు కన్నీటితో చెప్తున్నాను. వారి గమ్యం నాశనం, వారి కడుపే వారికి దేవుడు, తాము సిగ్గుపడవలసిన వాటిలో వారు గర్వపడుతున్నారు. భూసంబంధమైన వాటిపైనే తమ మనస్సు ఉంచుతున్నారు. అయితే మన పౌరసత్వం పరలోకంలో ఉంది, కాబట్టి అక్కడినుండి వచ్చే మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తు గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము. సమస్తాన్ని తన ఆధీనంలోనికి తీసుకురాగల తన శక్తినిబట్టి, ఆయన మన నీచమైన శరీరాలను తన మహిమగల శరీరాన్ని పోలి ఉండేలా మార్చగలరు.