నెహెమ్యా 6:1-9

నెహెమ్యా 6:1-9 TSA

అప్పటికి నేను గుమ్మాలకు తలుపులు నిలబెట్టక పోయినప్పటికి, ఏ బీటలు లేకుండా గోడను పునర్నిర్మించానని సన్బల్లటు, టోబీయా, అరబీయుడైన గెషెము, మరికొందరు మా మిగతా శత్రువులు విన్నారు. సన్బల్లటు గెషెము, “రండి, మనం ఓనో సమతల మైదానంలో ఉన్న ఒక గ్రామంలో కలుసుకుందాం” అని నాకు సందేశం పంపారు. అయితే వారు నాకు హాని చేయాలని కుట్రపన్నారు; కాబట్టి నేను వారికి, “నేను చాలా గొప్ప పని చేస్తున్నాను, దానిని విడిచిపెట్టి మీ దగ్గరకు ఎందుకు రావాలి? లేను రాలేను” అని చెప్పి దూతతో కబురు పంపాను. వారదే పనిగా నాలుగు సార్లు కబురు పంపారు. నేను ప్రతిసారి అదే జవాబు ఇచ్చాను. అప్పుడు అయిదవసారి సన్బల్లటు తన పనివాని చేతికి తెరిచి ఉన్న ఒక ఉత్తరం ఇచ్చి పంపించాడు. దానిలో ఈ విధంగా వ్రాసి ఉంది: “నీవు యూదులతో కలిసి రాజు మీద తిరుగుబాటు చేయాలనే ఆలోచనతో గోడ కడుతున్నావని ప్రజల మధ్యలో వదంతి ఉంది. దానిని గెషెము నిరూపించాడు. అంతే కాకుండా దాని ప్రకారం నీవు వారికి రాజు కావాలని చూస్తున్నావు. యూదాలో రాజు ఉన్నాడని యెరూషలేములో నీ గురించి ప్రకటించడానికి నీవు ప్రవక్తలను కూడా నియమించావు. ఈ విషయాలు రాజుకు తెలుస్తాయి కాబట్టి నీవు వస్తే ఈ విషయం గురించి మనం కలిసి మాట్లాడుకోవచ్చు.” అప్పుడు నేను ఈ విధంగా జవాబు పంపించాను: “నీవు చెప్పినట్లుగా ఇక్కడ ఏమి జరుగలేదు; అవన్నీ మీరు ఊహించి కల్పించినవే” అని వారికి జవాబు పంపాను. “వారి చేతులు పని చేసి బలహీనమైపోయి ఇక వారు ఆ పని చేయలేరు” అని భావించి వారు మమ్మల్ని భయపెట్టడానికి ప్రయత్నించారు. అయితే నేను, “ఇప్పుడు నా చేతులను బలపరచు” అని ప్రార్థించాను.