మార్కు సువార్త 9:30-50

మార్కు సువార్త 9:30-50 TSA

వారు ఆ స్థలాన్ని వదిలి గలిలయ ప్రాంతం గుండా వెళ్లారు. యేసు తన శిష్యులకు బోధిస్తూ ఉన్నారు కాబట్టి, తాము ఎక్కడ ఉన్నామో ఎవనికి తెలియకూడదని అనుకున్నారు. ఆయన వారితో, “మనుష్యకుమారుడు మనుష్యుల చేతికి అప్పగించబడతాడు. వారు ఆయనను చంపుతారు, మూడు రోజుల తర్వాత ఆయన తిరిగి లేస్తాడు” అని చెప్పారు. అయితే వారు ఆయన మాటల అర్థాన్ని గ్రహించలేదు పైగా దాని గురించి ఆయనను అడగడానికి కూడా భయపడ్డారు. వారు కపెర్నహూముకు వచ్చారు. ఆయన ఇంట్లో ఉన్నప్పుడు, ఆయన వారిని, “మీరు త్రోవలో దేని గురించి వాదించుకుంటున్నారు?” అని అడిగారు. కాని వారు మౌనంగా ఉండిపోయారు ఎందుకంటే దారిలో వారు తమలో ఎవరు గొప్ప అని వాదించుకున్నారు. యేసు కూర్చుని, పన్నెండుమందిని తన దగ్గరకు పిలుచుకొని, “ఎవడైనా మొదటివానిగా ఉండాలని అనుకుంటే వాడు అందరిలో చివరివాడై, అందరికి దాసునిగా ఉండాలి” అని వారితో అన్నారు. ఆయన ఒక చిన్నబిడ్డను తీసుకుని వారి మధ్యలో నిలబెట్టి, ఆ చిన్నబిడ్డను తన కౌగిటిలో ఎత్తుకుని, వారితో ఈ విధంగా చెప్పారు, ఎవరైనా ఈ చిన్నబిడ్డల్లో ఒకనిని నా పేరట చేర్చుకుంటారో, వారు నన్ను చేర్చుకున్నట్టే; అలాగే నన్ను చేర్చుకొన్న వారు నన్నే కాదు నన్ను పంపినవానిని చేర్చుకున్నట్టే. యోహాను యేసుతో, “బోధకుడా, నీ పేరట ఒకడు దయ్యాలను వెళ్లగొట్టడం మేము చూసి, వాన్ని ఆపివేయమని చెప్పాము, ఎందుకంటే వాడు మనవాడు కాడు” అని చెప్పాడు. అందుకు యేసు, “వాన్ని ఆపకండి, ఎందుకంటే నా పేరున అద్భుతాలు చేసేవాడు నా గురించి చెడ్డగా మాట్లాడలేడు. మనకు విరోధి కాని వాడు మన పక్షంగా ఉన్నవాడు. మీరు క్రీస్తుకు చెందినవారని ఎవరైనా నా పేరట ఒక గిన్నెడు నీళ్లను మీకు ఇచ్చినా వారు తమ ఫలాన్ని పోగొట్టుకోరని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. “ఎవరైనా నన్ను నమ్మిన ఈ చిన్నపిల్లల్లో ఒకరికి ఆటంకం కలిగిస్తే, వారి మెడకు తిరుగటిరాయి కట్టబడి లోతైన సముద్రంలో పడవేయబడితే వారికి మేలు. నీవు పొరపాట్లు చేయడానికి ఒకవేళ నీ చేయి కారణమైతే, దానిని నరికి పారవేయి. ఎందుకంటే నీవు రెండు చేతులు కలిగి ఆరని అగ్ని ఉండే నరకంలో పడవేయబడటం కంటే, ఒక చేతితో నిత్య జీవంలో ప్రవేశించడం నీకు మేలు. ఆ నరకంలో, “ ‘వారిని తినే పురుగులు చావవు అగ్ని ఆరదు.’ నీవు పొరపాట్లు చేయడానికి ఒకవేళ నీ కాలు కారణమైతే దానిని నరికి పారవేయి. నీవు రెండు కాళ్లు కలిగి ఆరని అగ్ని ఉండే నరకంలో పడవేయబడటం కంటే, కుంటివానిగా నిత్య జీవంలో ప్రవేశించడం నీకు మేలు. ఆ నరకంలో, “ ‘వారిని తినే పురుగులు చావవు అగ్ని ఆరదు.’ నీవు పొరపాట్లు చేయడానికి ఒకవేళ నీ కన్ను కారణమైతే, దానిని పెరికి పారవేయి. నీవు రెండు కళ్లు కలిగి నరకంలో పడవేయబడటం కంటే, ఒక కన్నుతో దేవుని రాజ్యంలో ప్రవేశించడం నీకు మేలు. ఆ నరకంలో, “ ‘వారిని తినే పురుగులు చావవు, అగ్ని ఆరదు.’ ప్రతి ఒక్కరు అగ్నితో ఉప్పు సారం పొందుకొంటారు. “ఉప్పు మంచిదే, కాని ఒకవేళ అది తన సారం కోల్పోతే, నీవు దానిని తిరిగి ఎలా సారవంతం చేయగలవు? మీలో మీరు ఉప్పును కలిగి ఉండండి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండండి.”