మార్కు సువార్త 9:14-32

మార్కు సువార్త 9:14-32 TSA

వారు ఇతర శిష్యుల దగ్గరకు వచ్చినప్పుడు, వారి చుట్టూ గొప్ప జనసమూహం ఉండడం ధర్మశాస్త్ర ఉపదేశకులు వారితో వాదిస్తుండడం చూశారు ప్రజలందరు యేసును చూసిన వెంటనే, వారు ఆశ్చర్యంతో మునిగిపోయి ఆయనను పలకరించడానికి పరుగెత్తారు. యేసు, “మీరు దేని గురించి వారితో వాదిస్తున్నారు?” అని వారిని అడిగారు. ఆ జనసమూహంలో నుండి ఒకడు, “బోధకుడా, మూగ దయ్యం పట్టిన నా కుమారుని తీసుకువచ్చాను. అది వాన్ని పట్టినప్పుడెల్లా, వాన్ని నేల మీద పడవేస్తుంది. అప్పుడు వాడు నోటి నుండి నురుగు కారుస్తాడు, పండ్లు కొరుకుతూ, బిగుసుకుపోతాడు. ఈ దయ్యాన్ని వెళ్లగొట్టమని మీ శిష్యులను అడిగాను కాని వారిచేత కాలేదు” అన్నాడు. అందుకు యేసు, “విశ్వాసంలేని తరమా, నేను మీతో ఎంతకాలం ఉంటాను? ఎంతకాలం మీ అవిశ్వాసాన్ని సహించగలను? ఆ పిల్లవాన్ని నా దగ్గరకు తీసుకురండి” అన్నారు. కాబట్టి వారు వాన్ని తీసుకువచ్చారు. ఆ దయ్యం యేసుని చూసిన వెంటనే ఆ పిల్లవాన్ని విలవిలలాడించింది. వాడు నేల మీద పడి నురుగు కార్చుకొంటు పొర్లాడుతున్నాడు. యేసు ఆ పిల్లవాని తండ్రితో, “వీడు ఎంతకాలం నుండి ఇలా ఉన్నాడు?” అని అడిగారు. అతడు, “వాని చిన్నతనం నుండే. అది వాన్ని చంపాలని చాలాసార్లు నిప్పుల్లో, నీళ్లలో పడవేసింది. ఒకవేళ నీ వలనైతే, మమ్మల్ని కనికరించి మాకు సహాయం చేయి” అన్నాడు. అందుకు యేసు, “ ‘నీ వలనైతే?’ అని అడిగి, ఒక వ్యక్తి నమ్మితే సమస్తం సాధ్యమే” అని అతనితో చెప్పారు. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, “నేను నమ్ముతున్నాను; నా అపనమ్మకాన్ని జయించడానికి నాకు సహాయం చేయండి!” అని అరిచాడు. ప్రజలు గుంపుగా తన దగ్గరకు పరుగెత్తికొని వస్తున్నారని యేసు చూసి, “మూగ, చెవిటి దయ్యమా, ఇతనిలో నుండి బయటకు రా, ఇంకెప్పుడు వానిలో ప్రవేశింపకూడదని నీకు ఆజ్ఞాపిస్తున్నాను” అని ఆ అపవిత్రాత్మను గద్దించారు. అప్పుడు ఆ అపవిత్రాత్మ పెద్ద కేక వేసి, వాన్ని విలవిలలాడించి వదిలిపోయింది. ఆ పిల్లవాడు చచ్చిన వానిలా పడి ఉండడం చూసి చాలామంది, “వాడు చనిపోయాడు” అనుకున్నారు. కానీ యేసు వాని చేయి పట్టుకుని లేవనెత్తారు, అప్పుడు వాడు లేచి నిలబడ్డాడు. యేసు ఇంట్లోకి వెళ్లిన తర్వాత, శిష్యులు ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు, “మేము ఎందుకు దానిని వెళ్లగొట్టలేకపోయాం” అని అడిగారు. అందుకు ఆయన, “ఇలాంటివి ప్రార్థన ద్వారా మాత్రమే బయటకు వస్తాయి” అని చెప్పారు. వారు ఆ స్థలాన్ని వదిలి గలిలయ ప్రాంతం గుండా వెళ్లారు. యేసు తన శిష్యులకు బోధిస్తూ ఉన్నారు కాబట్టి, తాము ఎక్కడ ఉన్నామో ఎవనికి తెలియకూడదని అనుకున్నారు. ఆయన వారితో, “మనుష్యకుమారుడు మనుష్యుల చేతికి అప్పగించబడతాడు. వారు ఆయనను చంపుతారు, మూడు రోజుల తర్వాత ఆయన తిరిగి లేస్తాడు” అని చెప్పారు. అయితే వారు ఆయన మాటల అర్థాన్ని గ్రహించలేదు పైగా దాని గురించి ఆయనను అడగడానికి కూడా భయపడ్డారు.