మార్కు సువార్త 9:1-13

మార్కు సువార్త 9:1-13 TSA

యేసు ఇంకా మాట్లాడుతూ, “ఇక్కడ నిలబడి ఉన్నవారిలో కొందరు దేవుని రాజ్యం శక్తితో రావడం చూడక ముందు చనిపోరు అని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అన్నారు. ఆరు రోజుల తర్వాత యేసు పేతురు, యాకోబు, యోహానులను తన వెంట తీసుకుని ఒంటరిగా ఎత్తైన కొండ మీదికి వెళ్లారు, అక్కడ వారి ముందు ఆయన రూపాంతరం చెందారు. ఆయన వస్త్రాలు మిరుమిట్లుగొలిపేంత తెల్లగా మారాయి, లోకంలో ఎవ్వరూ ఉతకలేనంత తెల్లగా. అప్పుడు మోషే, ఏలీయా ప్రత్యక్షమై యేసుతో మాట్లాడుతూ వారికి కనబడ్డారు. పేతురు యేసుతో, “బోధకుడా, మనం ఇక్కడే ఉండడం మంచిది, మూడు గుడారాలను వేద్దాం, నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలీయాకు ఒకటి” అని చెప్పాడు. అతనికి ఏమి చెప్పాలో తెలియలేదు, వారు చాలా భయపడ్డారు. అప్పుడు మేఘం వారిని కమ్ముకుంది, ఆ మేఘంలో నుండి ఒక స్వరం ఇలా చెప్పింది: “ఇదిగో ఈయన నేను ప్రేమించే నా ప్రియ కుమారుడు. ఈయన మాటలను వినండి!” అకస్మాత్తుగా, వారు చుట్టూ చూసినప్పుడు, తమతో యేసు తప్ప మరి ఎవరు వారికి కనబడలేదు. వారు ఆ కొండ దిగి వస్తున్నప్పుడు, మనుష్యకుమారుడు చనిపోయి తిరిగి లేచేవరకు మీరు చూసినవాటిని ఎవరితో చెప్పవద్దు అని యేసు శిష్యులను ఖచ్చితంగా ఆదేశించారు. “చనిపోయి తిరిగి బ్రతకడం” అనే మాట మీద వారు ఒకరితో ఒకరు చర్చించుకొంటూ, ఆ విషయాన్ని తమ మధ్యలోనే ఉంచుకున్నారు. వారు, “ఏలీయా ముందుగా రావాలని ధర్మశాస్త్ర ఉపదేశకులు ఎందుకు చెప్తున్నారు?” అని ఆయనను అడిగారు. అందుకు యేసు, “ఏలీయా ముందుగా వచ్చి అన్నిటిని చక్కపెడతాడన్న మాట నిజమే. అలాంటప్పుడు మనుష్యకుమారుడు అధికంగా హింసను అనుభవించి తృణీకరించబడతాడని ఎందుకు వ్రాయబడింది? అయితే నేను మీతో చెప్తున్న, ఏలీయా ముందే వచ్చాడు, అతని గురించి వ్రాయబడి ఉన్న ప్రకారం, ప్రజలు తమకు ఇష్టం వచ్చినట్టుగా అతనికి చేశారు” అని అన్నారు.