మార్కు 8:1-10

మార్కు 8:1-10 TCV

ఆ రోజులలో మరొక పెద్ద గుంపు గుమికూడింది. అయితే వారు ఏమి తినలేదు, కనుక యేసు తన శిష్యులను దగ్గరకు పిలిచి, “ఈ ప్రజలు మూడు రోజులుగా ఏమి తినకుండా నా దగ్గరే ఉండిపోయారు; వారి మీద నాకు జాలి కలుగుతుంది. నేను వీరిని ఆకలితో ఇండ్లకు పంపితే, వారు దారిలో సొమ్మసిల్లిపోతారు ఎందుకంటే కొందరు దూరం నుండి వచ్చారు” అని చెప్పారు. అందుకు ఆయన శిష్యులు, “కాని ఇంత మందికి భోజనం పెట్టి తృప్తిపరచడానికి కావలసినంత ఆహారం ఈ మారుమూల ప్రాంతంలో మనకు ఎక్కడ దొరుకుతుంది?” అన్నారు. యేసు, “మీ దగ్గర ఎన్ని రొట్టెలున్నాయి?” అని వారిని అడిగారు. వారు, “ఏడు” అని జవాబిచ్చారు. యేసు ఆ జనసమూహాన్ని నేల మీద కూర్చోమని ఆదేశించారు. ఆ ఏడు రొట్టెలను పట్టుకొని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, వాటిని విరిచి జనసమూహానికి పంచిపెట్టుమని తన శిష్యులకు ఇచ్చారు, వారు పంచిపెట్టారు. వారి దగ్గర కొన్ని చిన్న చేపలు కూడ ఉన్నాయి; ఆయన వాటిని కూడ ఆశీర్వదించి, పంచిపెట్టుమని తన శిష్యులకు చెప్పారు. ప్రజలు తిని తృప్తి పొందారు. తర్వాత శిష్యులు మిగిలిన ముక్కలను ఏడు గంపల నిండా నింపారు. తిన్న వారందరు ఇంచుమించు నాలుగు వేలమంది. యేసు వారిని పంపించిన వెంటనే, ఆయన తన శిష్యులతో కలిసి పడవ ఎక్కి దల్మనూతా అనే ప్రాంతానికి వెళ్లారు.