యేసు జనసమూహాన్ని తన దగ్గరకు పిలిచి, “ప్రతి ఒక్కరు, నా మాట విని, గ్రహించండి. బయటనుండి లోపలికి వెళ్లేవి ఒకరిని అపవిత్రపరచవు. కాని లోపలి నుండి బయటకు వచ్చేవి మాత్రమే వారిని అపవిత్రులుగా చేస్తాయి. [వినడానికి చెవులుగలవారు విందురు గాక!” అని అన్నారు.]
ఆయన ఆ జనసమూహాన్ని విడిచి ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత, ఆయన శిష్యులు ఆ ఉపమానం గురించి ఆయనను అడిగారు. ఆయన, “మీరు ఇంత బుద్ధిహీనులా? బయటనుండి లోపలికి వెళ్లేది ఏది ఒకరిని అపవిత్రపరచవని మీరు చూడలేదా? అని అడిగారు. ఎందుకంటే అది వాని హృదయంలోనికి వెళ్లదు, కాని కడుపులోనికి వెళ్లి, తర్వాత శరీరం నుండి బయటకు విసర్జింపబడుతుంది.” (ఈ విషయాన్ని చెప్తూ, భోజనపదార్ధాలన్ని పవిత్రమైనవే అని యేసు ప్రకటించారు.)
ఆయన ఇంకా మాట్లాడుతూ, “ఓ వ్యక్తి లోపలి నుండి ఏదైతే బయటకు వస్తుందో అదే వారిని అపవిత్రపరుస్తుంది. ఎందుకంటే, అంతరంగంలో నుండి లైంగిక అనైతికత, దొంగతనం, నరహత్య, వ్యభిచారం, దురాశ, పగ, మోసం, అశ్లీలత, అసూయ, దూషణ, అహంకారం, అవివేకం లాంటి దుష్ట ఆలోచనలు వస్తాయి. ఈ దుష్టమైనవన్ని లోపలినుండే బయటికి వచ్చి వ్యక్తిని అపవిత్రపరుస్తాయి” అన్నారు.
యేసు అక్కడి నుండి లేచి తూరు, సీదోను పట్టణ ప్రాంతాలకు వెళ్లారు. ఆయన ఒక ఇంట్లో ప్రవేశించి తాను అక్కడ ఉన్నట్టు ఎవరికి తెలియకూడదని కోరుకొన్నారు; కాని, తాను అక్కడ ఉన్నాననే సంగతిని ఆయన రహస్యంగా ఉంచలేకపోయారు. ఒక స్త్రీ ఆయన గురించి విన్న వెంటనే, వచ్చి ఆయన పాదాల మీద పడింది. ఆమె చిన్నకుమార్తెకు అపవిత్రాత్మ పట్టింది. ఆ స్త్రీ, సిరియా ఫెనికయాలో పుట్టిన గ్రీసుదేశస్థురాలు. ఆమె తన కుమార్తెలో నుండి ఆ దయ్యాన్ని వెళ్లగొట్టమని యేసును వేడుకొంది.
ఆయన ఆమెతో, “మొదట పిల్లలను వారు కోరుకున్నంతా తిననివ్వాలి, ఎందుకంటే పిల్లల రొట్టెలను తీసికొని కుక్కలకు వేయడం సరికాదు” అన్నారు.
అందుకు ఆమె, “ప్రభువా, పిల్లలు పడవేసే రొట్టె ముక్కలను బల్ల క్రింద వుండే కుక్కలు తింటాయి” అని జవాబిచ్చింది.
అందుకు ఆయన, “జవాబు బాగుంది! నీవు వెళ్లు; నీ కుమార్తెను దయ్యం వదలిపోయింది” అని చెప్పారు.
ఆమె ఇంటికి వెళ్లి, తన కుమార్తె మంచం మీద పడుకొని ఉండడం, దయ్యం ఆమెను వదలిపోయింది.
యేసు తూరు పట్టణ ప్రాంతాన్ని విడిచి సీదోను ద్వారా, గలిలయ సముద్రం మరియు దెకపొలి ప్రాంతాలకు వెళ్లారు. అక్కడ కొందరు చెవుడు, నత్తి ఉన్న ఒకన్ని ఆయన దగ్గరకు తీసుకొనివచ్చి, వాని మీద చెయ్యి ఉంచమని ఆయనను వేడుకొన్నారు.
యేసు జనసమూహంలో నుండి వానిని ప్రక్కకు తీసుకువెళ్లి, వాని చెవుల్లో తన వ్రేళ్ళను ఉంచారు. తర్వాత ఆయన ఉమ్మివేసి, వాని నాలుకను ముట్టారు. ఆయన ఆకాశం వైపు చూసి నిట్టూర్పు విడిచి వానితో, “ఎప్ఫతా!” అన్నారు. ఆ మాటకు “తెరుచుకో!” అని అర్థం. వెంటనే వాని చెవులు తెరువబడ్డాయి, అలాగే వాని నాలుక సడలి వాడు తేటగా మాట్లాడటం మొదలుపెట్టాడు.
ఆ సంగతి ఎవ్వరితో చెప్పవద్దని యేసు గుంపును ఆదేశించారు. కాని ఆయన ఎంత ఖచ్చితంగా చెప్పారో, వారు అంత ఎక్కువగా దానిని ప్రకటించారు. “ఆయన చెవిటివారిని వినగలిగేలా, మూగవారిని మాట్లాడేలా చేస్తూ, అన్నిటిని బాగు చేస్తున్నారు” అని చెప్పుకొంటూ ప్రజలు ఆశ్చర్యంతో నిండిపోయారు.